వీరతెలంగాణ ధీరత్వం కామ్రేడ్‌ ఠానూనాయక్‌

Veeratelangana bravery Comrade Thanunayakతెలంగాణ మట్టిలో వికసించిన పీడిత ప్రజల చరిత్ర ఇది. కత్తులు, తుపాకుల కవాతుల మధ్య కుత్తుకలు తెగిపడ్డ విప్లవవీరుల శిరస్సులు నినదించిన రక్తాక్షరాల చరిత్ర. నిజాం నిరంకుశత్వానికి, దొరల ఆగడాలకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం, దున్నేవానికే భూమి కావాలని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఉధృతంగా సాగింది. 1944 నుంచి 1951 వరకు హైదరాబాద్‌ సంస్థానంలో సాగిన ఈ పోరాటం భారతదేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. తెలంగాణలో అనేక ప్రాంతాల్లో పోరాటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. జనగాం ప్రాంతంలోని ధర్మాపురం, ముండ్రాయి చుట్టుపక్కల తండాల్లోని లంబాడీ గిరిజనులు చేసిన పోరాటం, వారు చూపిన తెగువ, ధైర్యసాహసాలు, చేసిన త్యాగాలు భావితరాలకు దిక్చూచి.
జనగాం తాలూకాలో విసునూరు రామచంద్రారెడ్డి, వుసుకూరు రాఘవరావు, కటారి నరసింహారావు, బాబూ దొర అనే భూస్వాములు ఆ ప్రాంత ప్రజలను పీడించేవారు. దుర్మార్గులైన దొరలు నిరంకుశ నిజాం ప్రభుత్వ రజాకార్ల అండతో ప్రజల భూములను ఆక్రమించడం, నిర్ధాక్షిణ్యంగా పన్నులు వసూలు చేయడం, ఎదురు తిరిగిన వారిని చంపడం, చిత్రహింసలు పెట్టడం, మహిళలపై అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు, నిత్యకృత్యంగా సాగేవి. దేవరుప్పల మండలం ధర్మాపురం లంబాడీ గిరిజనులకు చెందిన 80 ఎకరాల మెట్ట, 25 ఎకరాల మాగాణి భూములను ఆక్రమించేందుకు విసునూరు రాఘవరావు అనే దొర గుండాలను పంపాడు. ఇది తెలుసుకున్న తండా పెద్దలైన లంబాడీ జాటోత్‌ హాము, జాటోత్‌ రామోజీ కుటుంబాల కొడుకులు వడిసెలు, గుదపలతో వారితో తలపడ్డారు. లంబాడీల పోరాట పటిమ ముందు నిలబడలేక పారిపోయారు. తండాలో లంబాడీలు సాగుచేసుకుంటున్న 30 ఎకరాల మాగాణి, 40 ఎకరాల బంజరు భూమిని కటారి నరసింహారావు వారి భూములను తన పేర రాయించుకున్నాడు. కోపోద్రిక్తులైన గిరిజనులు చుట్టుపక్కల గ్రామాలు, తండాల ప్రజలను ఏకంచేసి దొరలతో తలపడటానికి సిద్ధమయ్యారు. జాటోత్‌ హాము కొడుకులైన ఠానూనాయక్‌ ఆరుగురు అన్నదమ్ములు. జోద్యా నాయక్‌, సోమ్లా నాయక్‌, సంకు నాయక్‌, దర్గ్యానాయక్‌, కిషన్‌ నాయక్‌లు నేతృత్వం వహించారు. (వీరిలో దర్గ్యానాయక్‌ ఒక్కరే ప్రస్తుతం బతికి ఉన్నారు) 11వ ఆంధ్ర మహాసభ జనగామలో జరిగిన సందర్భంగా మొట్టమొదట సభ్యత్వం తీసుకున్నది ఈ కుటుంబమే. వీరికి అండగా కమ్యూనిస్టు పార్టీ (సంఘం) దళం కూడా రావడంతో వడిసెలు, గుదపలు చేతపట్టి పొలం వైపు కదిలారు. ధర్మాపురంలో ఎదురు దెబ్బతిన్న దొరలు నిజాం పోలీసులను, గూండాలను దింపారు. యుద్ధాన్ని తలపించే విధంగా తలపడ్డారు. పోలీసులు, గూండాల వద్ద వున్న తుపాకులు, ఆయుధాల ముందు లంబాడీలు నిలవలేకపోయారు. 20 మంది లంబాడీలను బంధీలుగా పట్టుకుని చేతులకు బేడీలు వేసి కొట్టుకుంటూ, చిత్రహింసలు పెడుతూ ఆ ప్రాంత గ్రామాలన్నింటిలో ఊరేగించారు. దొరలపై తిరగబడితే ఇటువంటి శిక్షలే ఉంటాయని హెచ్చరించారు. ఠానూనాయక్‌, దర్గ్యా నాయక్‌, సోమ్లానాయక్‌లతో పాటు కమ్యూనిస్టుల దళం ఆచూకీ చెప్పాలని చిత్రహింసలు పెట్టారు. ప్రాణాలైనా ఇస్తాం గానీ వాళ్ల ఆచూకీ చెప్పమని ఖరాకండిగా చెప్పారు. చేసేదిలేక పోలీసులకు అప్పగించగా జనగామ జైలుకు తరలించారు.
కడివెండి గ్రామంలో 1946 జూలై 4న విస్నూరు రామచంద్రారెడ్డి దొర గూండాల కాల్పుల్లో దొడ్డి కొమురయ్య మరణించడానే వార్త జనగామ ప్రాంతంలో దావానంలా వ్యాపించింది. విషయం తెలియగానే ఠానూ నాయక్‌, దర్గ్యానాయక్‌, సోమ్లానాయక్‌ లు పరుగు పరుగునా కడివెండి చేరుకున్నారు. జూలై 6న వందలాది మంది నిజాం పోలీసులతో కడివెండికి వస్తున్న డీఎస్పిని గ్రామంలో అడుగు పెట్టకుండా ఠానూనాయక్‌ ముగ్గురన్నదమ్ములు నిప్పు రవ్వలాగా చెలరేగి వారితో తలపడ్డారు. దొరల ఆగడా లను అడుగడుగునా ఎదిరిస్తున్న ధర్మాపురం తండాను సర్వనాశనం చేయాలని, జాటోత్‌ ఠానునాయక్‌ వారి అన్నదమ్ములను ఎలాగైనా చంపాలని విసునూరు దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి కొడుకు విసునూరు బాబూదొరకు బాధ్యతను అప్పగించారు. ధర్మాపురాన్ని దొర గూండాలు చుట్టుముట్టారు. ఠానూనాయక్‌ వారి అన్నదమ్ములను మాకు అప్పగించాలని కొంతమంది లంబాడీలను చిత్రహింసలకు గురిచేశారు. తండాలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఠానూనాయక్‌, సోమ్లా, దర్గ్యానాయక్‌లు వారితో తలపడ్డారు. ప్రాణభయంతో ఎడ్లబండి గడ్డిలో దాక్కొని పారిపోతున్న బాబూ దొరను బయటకు లాగి గుదుపలతో దెబ్బమీదదెబ్బ వేస్తూ చితకబాదారు. దర్గ్యానాయక్‌ చేతిలో ఉన్న తుపాకీతో బాబూదొర గుండెలపై కాల్చడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. కోపోద్రిక్తులైన దొర గూండాలు వెంబడించి కొంతమంది లంబాడీలను, దళనాయకులను పట్టుకున్నారు. ఇందులో సోమ్లానాయక్‌, చంద్రూనాయక్‌, బలరాం నాయక్‌, సోములు నాయక్‌, రేడ్యానాయక్‌ ఐదుగురు చిక్కారు. వీరిని బంధించి కట్టెలు తెప్పించి వారి చితిని వారితోనే పేర్పించి, ఎవరి చితిని వారే అంటించుకునేలా చేశారు. చితిపై కాలుతూ కూడా ”ఎర్రజెండా వర్ధిల్లాలి” అంటూ ప్రాణాలొదిలారు.
భారత సైన్యాలు తెలంగాణలో ప్రవేశించిన తర్వాత గ్రామాలు వదిలి పారిపోయిన దేశముఖ్‌లు, జమీందార్లు, దొరలు, రజాకార్లు భారత సైన్యాలు తెలంగాణాలో ప్రవేశించిన తరువాత తిరిగొచ్చారు. సైన్యం అండతో గ్రామాలపై పడి వందల మంది దళనాయకులను కాల్చి చంపారు. 1949 ఫిబ్రవరి 26న ఠానూనాయక్‌ తమ్ముడు సంకునాయక్‌ను పట్టుకున్నారు. చిత్రహింసలు చేసి మరణదండన విధించారు. సంకును అరెస్టు చేసిన పదిరోజులకు 18 ఏండ్ల వయస్సు గల చివరి తమ్ముడు కిషన్‌ నాయక్‌ను పట్టుకుని జైల్లో పెట్టారు. ఠానూ నాయక్‌ ఆచూకీ కోసం సైన్యం అండతో దొరలు, వారి గూండాలు వెతుకుతున్నారు. ఠానూనాయక్‌ అత్యంత ధైర్యశాలి. ధృడదీక్ష గలవాడు. పోరాటాల్లో నిప్పుకణికలాగా కదిలేవాడు. ప్రజలంటే అమితమైన ప్రేమ, ప్రజలను, ప్రత్యేకించి తమ లంబాడీలను అణచివేస్తున్న దుర్మార్గులంటే పట్టనంత ద్వేషం. ఠానూనాయక్‌ అనతికాలంలోనే ప్రజలు కమ్యూనిస్టు పార్టీ నాయకుల మన్ననలు పొందారు. కామ్రేడ్‌ ఠానూనాయక్‌ను సజీవంగా పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఏడాదిపాటు సైన్యానికి, శత్రువులకు దొరకలేదు. చివరకు ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం వల్ల ముండ్రాయి గ్రామంలో సైన్యం, దొరల చేతికి చిక్కారు. అతడిని పెట్టని హింసలేదు. ఎన్ని బాధలు పెట్టినా పార్టీ రహస్యం ఒక్కటికూడా బయటపెట్టలేదు. అతని మొండితనం, ధైర్యం, తెగువను చూసి సైన్యాధికారులే ఆశ్చర్యపోయారు. వారు ఠానూనాయక్‌ను చంపడానికి నిరాకరించారు. అప్పుడు అక్కడే కాచుకుని కూర్చున్న రామవరం దేశ్‌ముఖ్‌ కటారి నర్సింహారావు ఠానూనాయక్‌ను బండి చక్రానికి కట్టించి శరీరం ముక్కలై పోయేవరకు ఈడ్పించి చంపాడు. 1950 మార్చి 20వ తేదీన కామ్రేడ్‌ జాటోత్‌ ఠానూనాయక్‌ వీరమరణం పొందారు. తుది ఘడియలో సైతం ఆయన పెదవులపై ”కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి- శత్రువు అంతం చూడాలి” అన్ని నినాదాలే నాట్యమాడాయి. తెలంగాణ వీరత్వానికి నిలువెత్తు రూపమైన కామ్రేడ్‌ జాటోత్‌ ఠానూనాయక్‌కు విప్లవ జోహార్లు.
(నేడు ఠానూనాయక్‌ 74వ వర్థంతి)
రమావత్‌ శ్రీరాంనాయక్‌, 9440532410

Spread the love