శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు 

– ఎన్నికల నిబంధనలు అతిక్రమించవద్దు 
– మంథని సీఐ ఎన్. వెంకటేశ్వర్లు 
నవతెలంగాణ – రామగిరి
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మంథని సీఐ ఎన్. వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం రామగిరి పోలీస్ స్టేషన్ లో స్థానిక ఎస్.ఐ కట్రాప్ సందీప్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ప్రారంభమైందన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు ప్రతి ఒక్కరు నడుచుకోవాలని కోరారు. వాహనాలలో రూ.50 వేలకు మించి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకువెళ్ళ రాదని, నిబంధనలు మేర ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేసి ఐ.టి శాఖ అధికారులకు అప్పగిస్తామని తెలియజేశారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులలో ఏ ఒక్క మతాన్ని గాని, ఏ ఒక్క రాజకీయ పార్టీని గానీ కించపరిచే విధంగా మెసేజులు చేయరాదని అన్నారు. విద్వేషాలు సృష్టించే మెసేజ్ లు గ్రూపులలో పెడితే, అడ్మిన్ తో పాటు మెసేజ్ పంపిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు వీడి మద్యం షాపులు నడపరాదని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా, రోడ్ల పై మద్యం సేవించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. వాహనాలు నడిపే సమయంలో మద్యం సేవించి ఉండి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరు పరుస్తామన్నారు. ముఖ్యంగా యువత గంజాయికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. గంజాయి సేవించినట్లు, గంజాయి అమ్మినట్లు తెలిస్తే రహస్యంగా సమాచారం అందించి సమాజ అభివృద్ధికి తోడ్పడాల్సిందని కోరారు. గంజాయి అమ్మే వారిని, తాగే వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, చట్టరీత్యా చర్యలు తీసుకుం టామని అన్నారు. రౌడీయిజం, గుండాయిజం చేస్తే పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. సివిల్ వివాదాలు కోర్టులో పరిష్కరించుకోవాలని సూచిం చారు. చట్ట పరిధిలో ఉండే ప్రతిభ పిటిషన్ వరకు పోలీస్ పరంగా న్యాయం అందించాలని కృషి చేస్తామన్నారు. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరా లు ఏర్పాటు చేసామని, ప్రతిరోజు గ్రామలలో సీసీ కెమెరాల నిఘా తీవ్రంగా ఉందన్నారు. అసాంఘిక కార్యక్రమాలు ఎవరి దృష్టి కి వస్తే రహస్యంగా ఫోన్ చేసి తెలియజేయాలని, వారి పేరు గోప్యంగా ఉంచుతామని అన్నారు.
Spread the love