వయలెన్స్‌ కా విజిటింగ్‌ కార్డ్‌

నందమూరి బాలకష్ణ హీరో(ఎన్‌బికె 109)గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. బాలకష్ణ, బాబీ కొల్లి, సూర్యదేవర నాగవంశీ పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాను అధికారికంగా ప్రకటించి, చిత్ర పనులు ప్రారంభించారు. బాలకష్ణ పుట్టినరోజు సందర్భంగా శనివారం నిర్వహించిన పూజా కార్యక్రమంలో స్క్రిప్ట్‌ను దర్శకుడు వి.వి. వినాయక్‌ తన చేతుల మీదుగా చిత్ర బృందానికి అందజేశారు. దక్షిణ కొరియా గౌరవ కౌన్సెల్‌ జనరల్‌ చుక్కపల్లి సురేష్‌ ముహూర్తపు షాట్‌కి క్లాప్‌ కొట్టారు. దర్శకుడు గోపీచంద్‌ మలినేని కెమెరా స్విచాన్‌ చేశారు. మొదటి షాట్‌కి రచయిత, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో తెలిపేలా కాన్సెప్ట్‌ పోస్టర్‌ను చిత్ర బందం విడుదల చేసింది.
ఇనుప పెట్టెలో మద్యం సీసా, గొడ్డలి, ఇతర పదునైన ఆయుధాలతో కథానాయకుడి పాత్ర ఎంత శక్తివంతంగా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. 1982 బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న కాన్సెప్ట్‌ పోస్టర్‌తోనే ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగేలా చేసింది చిత్ర బందం. ‘వయలెన్స్‌ కా విజిటింగ్‌ కార్డ్‌’ అనే లైన్‌తో, అలాగే ”ప్రపంచానికి అతను తెలుసు.. కానీ అతని ప్రపంచం ఎవరికీ తెలియదు’ అంటూ పోస్టర్‌ పై రాసి ఉన్న సినిమా ట్యాగ్‌లైన్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రాన్ని 2024 ప్రారంభంలో విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. అలాగే త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.

Spread the love