ఓటరు.. తస్మాత్‌ జాగ్రత్త!

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా నేటికీ దేశ ప్రజల్లో నూటికీ మూడోవంతు జనాభాకు మూడూ పూటలా తిండి లేదు. సగం మందికి పైగా మంచినీరు లేదు. ఇక విద్యా, వైద్యం అందని ద్రాక్షే. ఇటువంటి పరిస్థితుల్లో 1952 నుంచి దేశవ్యాప్తంగా పార్లమెంటు , వివిధ రాష్ట్రాల్లో ప్రతీ ఐదేండ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజాబద్దంగా అనేక పార్టీలు విజయం సాధించి, ప్రభుత్వాలు ఏర్పాటు చేసి, పాలన కొనసాగిస్తున్నాయి. అయినప్పటికీ అనేక మందికి కనీస అవ సరాలు అందక పోవడానికి కారణం ఏమిటి!? ఇది ఆందోళన కలిగించే అంశం. దేశంలో ఉన్న దాదాపు అన్ని రాజకీయపార్టీలు (వామపక్షాలు మినహా) ఓట్లు దండుకునే క్రమంలో దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు మించి ఒకరికి మించి మరొకరు తాయిలాలు ప్రకటిస్తూ ఓటర్లకు గాలం వేసి గద్దెనెక్కుతున్నారు. పథకాలతో ప్రజలు ఎంతోకొంత ఉపశమనం పొందుతున్న మాట వాస్తవం. కానీ వారికే కొనుగోలు శక్తి కలిగించేలా చేయడం ద్వారా మాత్రమే వారి అభివృద్ధి సాధ్యమవుతుందన్న విషయం పాలకులు గ్రహించాలి. సాధారణంగా ఎన్నికల సమయంలో పేదలకు బడుగు బల హీన వర్గాలకు కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం, ప్రచారంలో ఉచిత పథకాలు ప్రకటించడం సహజం. కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో వారి కింది స్థాయి లీడర్లు, కార్యకర్తలకే ఈ పథకాలు ఉపయోగపడుతున్నా యనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే పాలకులు ఇచ్చే హామీ లు, వాగ్దానాలు అమలు చేసే క్రమంలో వివిధ రాష్ట్రాల ఖజానాలు ఖాళీ అయి, వివిధ బ్యాంకులు, కేంద్రం చుట్టూ ప్రతీరోజూ అప్పుల కోసం తిరిగే పరిస్థితి ఉంటుంది. ఉన్న ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం (లేదా) అమ్మటం ద్వారా నిధులు సమకూర్చే విధానం పరిపాటిగా మారుతున్నది. ఇది దేశానికి, రాష్ట్రాలకు అత్యంత ప్రమాదకరం.
ముఖ్యంగా వ్యవ సాయ, పారిశ్రామిక రంగాలకు సరైన ప్రోత్సాహం లేకపోవడంతో ఉద్యోగ ఉపాధి అవకా శాలు సన్నగిల్లుతున్నది. దేశంలో ఎన్నడూ లేనం తగా ”నిరుద్యోగం” తాండ విస్తుంది. అధిక ధరలు సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయి. ఎన్నికలవేళ ప్రజల జీవితాల్లో నిజమైన సుస్థిర అభివృద్ధికి విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాలు రాజకీయ పార్టీలు తమ అజెండాలో చేర్చాలి. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే పథకాలు ప్రకటించాలి. అధిక ధరలకు కళ్లెం వేసే నియంత్రణ చట్టాలకు హామీ ఇవ్వాలి. దేశంలో ప్రతీ సంవత్సరం కొన్ని లక్షల మంది యువత గ్రాడ్యుయేషన్‌, బి.టెక్‌ వంటి చదువులు చదివి బయటకు వస్తుంటే, వారి బతుకులకు భరోసా ఇచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలు రూపొందించాలి. ముఖ్యంగా పారిశ్రామిక, సేవా రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెట్టి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇక వ్యవసాయ రంగంలో రైతులకు, కౌలు రైతులకు లాభ సాటిగా ఉండే పధకాలకు శ్రీకారం చుట్టాలి. అసంఘటిత కార్మికుల జీవి తాలను మెరుగుపరిచే విధంగా చూడాలి. మద్యం, డబ్బులు, వివిధ రకాల బహుమతులకు ఆశపడకుండా తమ భవిష్యత్తును తామే స్వతంత్రంగా ఓటు ద్వారా నిర్మించుకోవాలి. అంకెలు ర్యాంకులు సంఖ్యలు చూసి భుజా లు చరుచుకోరాదు. నిజంగా అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందితే, ఇంకా ఉచితాలు, రాయితీలు ఎందుకు!? ఆకలి సూచిలో ఎలా ఉన్నామో అంతర్జాతీయ సర్వేలు చెబుతున్నాయి కదా!? అందుకే వాస్తవాలు అందరూ గ్రహిం చాలి. మబ్బుల్లో విహరించరాదు.
ముఖ్యంగా రాజకీయ పార్టీలు నేడు దేశంలో ఉన్న నిరుద్యోగం, అధి క ధరలు, వ్యవసాయ సంక్షోభం, అసంఘటిత కార్మికుల సమస్యలు, ఉద్యోగుల సీపీఎస్‌ సమస్యలు, పర్యావరణ పరిరక్షణ, మహిళల ఇబ్బం దులు, ఆకలి కేకలు, మంచినీరు, విద్యా, వైద్యం వంటి విషయాలపై పరి ష్కారం కోసం ఒక పటిష్టమైన అజెండాతో భవిష్య త్తుకు భరోసా ఇచ్చే ప్రణాళికలతో ప్రజల ముందుకు రావాలి. బడా పారిశ్రామికవేత్తలకు ప్రభు త్వరంగ సంస్థలను ధారాదత్తం చేసే పార్టీలకు చెల్లు చీటినివ్వాలి. ప్రోత్సా హకాల పేరుతో బకాయిలు మాఫీ వంటి చర్యలు మానుకోవాలి. ప్రజలు, ఓటర్లు కూడా దీర్ఘకాలిక మంచి భవిష్యత్తు ఇచ్చే పార్టీలకు మద్దతు తెల పాలి. అంతేకానీ తాత్కాలిక ఉపశమనాల వలలో చిక్కుకుని భవిష్యత్తును ఛిద్రం చేసుకోరాదు. అందుకే ఓటరు మహాశయా..తస్మాత్‌ జాగ్రత్త!
– రావుశ్రీ

Spread the love