చూస్తూ… చూస్తుండగనే సుబ్బారావు కాస్తా ఆంజనేయుడిగా మారిపోయాడు. ఆంజనేయుడు అంటే ఆంజనేయస్వామి కాదు. వేషధారిగా…
సుబ్బారావు నగర కార్పొరేషన్ కార్యాలయంలో చిరుద్యోగి. పౌరాణిక నాటకాలంటే పిచ్చి. షణ్ముఖి – లక్ష్మణరావుల ‘రామాంజనేయుద్ధం పద్య నాటకాన్ని లెక్కలేనన్ని సార్లు చూశాడు. అర్థరాత్రి అపరాత్రి అని లేకుండా 5-10మైళ్ళు నడిచి లేదా సైకిల్‌తొక్కి చమట్లు కక్కుతూ ఆ నాటకాలను చూసి ఇంటికి వచ్చేవాడు. ఏమాట కామాటే చెప్పుకోవాలి. రాముని పాత్రకంటే ఆంజనేయ పాత్ర అంటేనే సుబ్బారావుకు అభిమానం. ఆంజనేయ పాత్రలో అచ్చం లక్ష్మణరావు పాడినట్టు శ్రీ… రాఘురామ్ అంటూ దీర్ఘశృతిలో రాగాలు తీసేవాడు. సిగ్గు ఎక్కువ కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు బాత్రూమ్‌లోనో లేదా రాత్రుళ్ళు భయం వేసినప్పుడు రహదారుల వెంట బిగ్గరగా పాడుకునేవాడు. కలవరించేవాడు. రాం.. రాం.. రాం.. అంటూ భజన చేసేవాడు. కుప్పిగంతు లేసేవాడు. నిద్రలోనే… కొత్తలో భార్యా బిడ్డలు జడుసుకునేవారు. తన్నొక్కడినే వదలిపెట్టి వేరేగదిలో పడుకునేవారు. అలా వారి మధ్య దూరం పెరిగింది. ఇవన్నీ సుబ్బారావుకు గుర్తుంది.
మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ‘జై భజరంగభలీ’ అంటూ ఓటేయండి అని పిలుపు ఇవ్వగానే మరల పాత జబ్బు తిరిగ బడిందేమోనని భయం వేస్తున్నది.
తనని తాను అద్దంలో చూసుకోకపోయినా శరీరం అంతా పచ్చరంగు అయిపోయినట్టు ఎర్ర లాగు తొడుక్కున్నట్టు. మూతికి ఎర్ర స్పాంజి అతికించినట్టు, లాగులోనుండి ఎస్ ఆకారంలో వంకర తిరిగిన తోక ఉన్నట్టు అన్నీ స్పష్టంగా కనిపి స్తున్నాయి. వీకో వజ్రదంతి టూత్‌పేస్ట్ యాడ్‌లాగా ప్రధానమంత్రి మాటలు తన మీద అంత ‘ప్రభావంతమైనవి’గా పనిచేస్తున్నదా… ఒకటే అనుమానం…
అదిగో… జై భజరంగభలి అంటూ ఆంజనేయుడి వేషంలో పరిగెడుతున్నాను. గాలిలో తేలిగ్గా ఎగురుతున్నాను. ట్రాఫిక్ జామ్ ఉన్నా సూపర్ మాన్‌లా గెంతేస్తున్నాను. కార్లు, బస్‌లు దూకేస్తున్నాను. ప్లైఓవర్‌లు ఏంకర్మ – మెట్రోపైకి కూడా ఎక్కేస్తున్నాను. అరె అందరూ నన్ను కింద నుండి చూస్తూ చప్పట్లు కొడుతున్నారే… భలే… భలే…
ఆ… గుర్తొచ్చింది. ఇంటర్ చదివే రోజుల్లో ఒకతను కోతివేషం వేసి అచ్చం కోతిలాగానే గబగబా చెట్లు ఎక్కేవాడు. కరెంటు పోల్స్ పైకి చకచకా పాకేవాడు. పిట్టగోడ లెక్కేవాడు. అరటిపళ్ళకొట్లో దూరి తినేవాడు. ఎవ్వరూ ఏమనేవారు కారు. ఆ తర్వాత బాబూ ధర్మం చేయండి అని అడుక్కునేవాడు. అందరూ డబ్బులిచ్చేవారు పాపం. నేను కూడా సినిమా చూద్దామని తెచ్చుకున్న రెండ్రూపాయిలు వేరే ఆలోచనలేకుండా ఇచ్చేసా… అప్పుడు.
ఇదేంటి ఇప్పుడు నేనూ అలా మారిపోయినా అందుకేగా జనాలు చూసి నవ్వుతున్నారు. చప్పట్లు కొడుతున్నారు.
దీన్నేమంటారు అసలు? కవులు రచయితలైతే చైతన్య స్రవంతి అని అంటారేమో..! మానసిక వైద్యులైతే ఇల్యూజన్ డిజ్‌ఆర్డర్ అనవచ్చేమో… ఆఁ… ఎవరేమనుకుంటే నాకేంటి? నాదారి నాదే…
హమ్మయ్య… పోలింగ్ బూత్ వచ్చింది. జై భజరంగభలి అని మీట నొక్కబోయాడు. గుర్తులు చూశాడు. ఏవేవో గుర్తులున్నాయి. అంతా మోసం. దగా… అంటూ గుండెలు బాదుకున్నాడు. వెర్రి కేకలు వేస్తున్నాడు. ప్రిసైడింగ్ ఆఫీసర్ గల్లా పట్టుకుని అరుస్తున్నాడు. రామబాణం గుర్తు ఏది? నేను ధరించే గధ ఏది? మీ ఇష్టం వచ్చినట్టు గుర్తులు మార్చేస్తారా..? ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా..? పిచ్చి చేష్టలు అనుకున్నారా..? ప్రధానమంత్రి మాట అంటే మీకు లెక్కేలేదా? జై భజరంగభలి అనగానే కొబ్బరి కాయ కొట్టాలి కదా? కొబ్బరికాయలేదు. అరిటిపళ్ళు, హారతి పళ్ళెం లేదు, అగరొత్తులూ లేవు. ఉండండి మీ పనిచెప్తాను. ఇప్పుడే పిఎంకు, ఎన్నికల కమిషన్‌కు కంప్లైంట్ చేస్తా… నిజంగానే కంప్లైంట్ చేస్తా’… అరుస్తున్నాడు.
తప్పున నీళ్ళ ముద్దై కళ్ళు తెరిచాడు. ఖాళీబక్కెట్‌తో ఉగ్రకాళిలా ఎదురుగా భార్యామణి.
‘మీకు పిచ్చి బాగా తలకెక్కింది..?
‘అవునే ఏం చేయను… ఎంత వద్దన్నా అవే కలలు వస్తున్నాయి. ఓ పనిజేయి. రోకలి బండ తెచ్చి తలకు చుట్టు…’ అన్నాడు అదోలా నవ్వుతూ..!
‘జోకా… నాకు మాత్రం నవ్వు రాదు. కాంట్రాక్టు పనుల్లో మీ ప్రభుత్వం తీసుకునే నలభైశాతం కమిషన్‌ల గురించి ఇవ్వాళ కాకపోయినా రేపైనా బయటకు రాకమానదు, మీటూ ఉద్యమంలా. ఎప్పటికైనా వెంటాడుతూనే ఉంటుంది. అప్పుడు నిజంగానే ముత్యాలముగ్గు సినిమాలో అల్లురామలింగయ్యలా పిచ్చికోతైపోతారు. తెలుసా…’ అన్నది భార్యామణి.
ఏంటి ఆంజనేయ స్వామిగా కాదా… పిచ్చి కోతినైపోతానా..? బట్టలు చించుకుంటానా..? జట్టుపీక్కుంటానా…?
– కె. శాంతారావు
9959745723