పదిరోజుల కిందట గురువారం ఒక్కరోజే సుప్రీం కోర్టు రాష్ట్రాల హక్కులనూ రాజ్యాంగ విలువలనూ కాపాడే కీలకమైన తీర్పులిచ్చింది. జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ (ఎన్‌సిటిడి)లో అధికారాల విభజన పైనా మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని మహా వికాస్ అగాధీ (ఎంవిఎ) సర్కారు పతనానికి కారణమైన అప్పటి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ నిర్ణయాలపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పులు రాబోయే కాలానికి మార్గదర్శకాలుగా ఉంటాయి. ఇటీవలి కాలంలో కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు రాష్ట్రాల అధికారాలను కాలరాసి, కత్తెరేసి నిరంకుశాధిపత్యం సాగించడానికి గవర్నర్లనూ రాజ్‌భవన్‌లనూ ఘోరంగా దుర్వినియోగపరుస్తున్న పూర్వరంగంలో ఈ తీర్పులకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ప్రతిపక్షాలు, రాజ్యాంగ నిపుణులు వీటిని స్వాగతించడానికి కారణమదే. ఈ క్రమంలోనే అత్యున్నత న్యాయవ్యవస్థలో కానవచ్చే విపరీత పోకడలూ వివాదాస్పద తీర్పుల తీరును కూడా ఇవి బహిర్గతం చేశాయి. అందుకే ఇవి చారిత్రాత్మకమైనవి.
మొదటగా ఢిల్లీ విషయం తీసుకుందాం. ఢిల్లీ దేశ రాజధానిగా చాలా కాలం పాటు మెట్రోపాలిటన్ కౌన్సిల్ పాలనలో ఉండేది. తర్వాత దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. వాజ్‌పేయి హయాంలో ఎన్‌సిటిడి ఏర్పడింది. శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతమైంది. అయితే కొన్ని విషయాల్లో కేంద్రానికీ నిర్ణయాధికారం కల్పించ బడింది. కాంగ్రెస్, బీజేపీలే ఢిల్లీలో పాలన చేసినంత కాలం ఇదేం సమస్య కాలేదు. కాని వారిద్దరికీ భిన్నమైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. కేజ్రీవాల్ వరుసగా రెండు సార్లు అధికారంలోకి రావడమే గాక కొన్ని ప్రజానుకూల చర్చలతో ప్రజాదరణ పొందడం, క్రమంగా పంజాబ్‌లోనూ ఆప్ అధికారంలోకి రావడం, మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లోనూ ఓట్లు సంపాదించి జాతీయ పార్టీగా ఎదగడం బీజేపీ భరించలేని పరిణామం. అందుకే చాలా కాలంగా కేజ్రీవాల్ సర్కారును నిబంధనలు అడ్డుపెట్టుకుని వేధిస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు మారినా ఈ పెత్తనం పెరిగిందే గాని తగ్గలేదు. పేరుకే అధికారం గాని ఢిల్లీ సర్కారుకు ఏ అధికారం లేదన్నది కేంద్రం వాదన. తాము నియమించే లెఫ్టినెంట్ గవర్నర్లు (కేంద్రపాలిత ప్రాంతాలకే ఇలా అంటారు) నిజమైన అధినేతలని విడ్డూరమైన వాదన తెచ్చారు. ప్రభుత్వం ఆమోదించిన అనేక శాసనాలను ఆమోదించకుండా తిప్పి పంపారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులపైనా దాడులు చేశారు. ఇవన్నీ కేంద్ర దురహం కారానికి నిదర్శనాలు. ఇక కేజ్రీ రెండవసారి అధికారంలోకి వచ్చాక జాతీయ పార్టీగా విస్తరించడం బీజేపీ అసలు భరించలేక పోయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే దాంతో సహా ఏవేవో ముందుకు తెచ్చి అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా పలువురిని వెంటాడింది. ముఖ్యమంత్రిపైనా విచారణ జరిపింది. (ఈ కేసులోనే బీఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితనూ ఏపీలో వైసీపీ నేతలనూ వారి బంధువులను కూడా చేర్చింది). ఇదంతా ఆప్‌ను దెబ్బ తీసే కుట్ర అని స్పష్టమైపోయింది. అసలు ఈ కుంభకోణానికి ఆధారాలేమిటని ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్ చివాట్లు పెట్టడంతో బండారం బహిర్గతమైంది.
వాస్తవానికి ఢిల్లీ ప్రభుత్వ పాలనాధికారాల గురించిన ఈ కేసు అంతకన్నా ముందుది. 2019లో దీనిపై సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇవ్వలేకపోయింది. 2019 ఫిబ్రవరిలో ధర్మాసనంలోని ఇద్దరూ చెరో తీర్పు ఇవ్వడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ కేసులో జస్టిస్ సిక్రీ ఢిల్లీ ప్రభుత్వానికి జాయింట్ కార్యదర్శి హోదాకు లోపున ఉన్నవారిపైనే అజమాయిషీ కలిగివుందని తీర్పు చెప్పారు. అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు తనకే లోబడి ఉండాలని చేస్తున్న వాదనను బలపర్చింది. కాగా మరో జడ్జి అశోక్ భూషణ్ అసలు ఢిల్లీ ప్రభుత్వానికి ఏ అధికారమూ లేదని తీర్పు చెప్పారు. ఇద్దరూ రెండు తీర్పులు చెప్పడం వల్ల అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో మరో ధర్మాసనం నియమించారు. ఈలోగా చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. కేంద్రం, రాష్ట్రం తమ వాదనలు వినిపించాయి. చివరకు గురువారంనాడు సంచలన తీర్పు వెలువరించారు. ఢిల్లీ రాష్ట్ర పాలనాధికారం ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. ఎంతటి ఉన్నతాధికారులైనా ప్రభుత్వానికి జవాబుదారిగా ఉండాల్సిందేనని ఆదేశించారు. ఎన్‌సిటిడి చట్టం సెక్షన్ 239 ఎఎలో 1,2,18 కింద వచ్చే ప్రజా వ్యవహారాలు, పోలీసు, భూమి మాత్రమే కేంద్రం పరిధిలో ఉంటాయి గనక లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలోకి వస్తాయన్నది. ఇవిగాక మరే విభాగాలపై పెత్తనం చేయడమైనా కుదరదని తేల్చింది. పాలనా వ్యవహారాలు రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, అధికారులెవరైనా దానికి లోబడి ఉండకపోతే అసలు జవాబుదారీ తనమే దెబ్బతిని అలసత్వం ప్రబలుతుందని హెచ్చరించింది. రాజ్యాంగం ఏడవ షెడ్యూల్‌లో పేర్కొన్న పాలనా వ్యవహారాలన్నీ పౌర పోలీసు అధికారులతో సహా ప్రభుత్వానికే నివేదించాలని నిర్దేశించింది. బదిలీలు కూడా వారి పనేనని చెప్పింది. కేంద్రం అండ చూసుకుని లెఫ్టినెంట్ గవర్నర్ చెలాయించిన ఆధిపత్యానికిది చెల్లుచీటీ. అదే సమయంలో సుప్రీం కోర్టు గవర్నర్‌కు సర్వాధికారాలు కట్టబెడితే సమాఖ్య విధానం ఏమవుతుందని ప్రశ్నించింది. పూర్తి రాష్ట్ర స్థాయిలేని ఢిల్లీ వంటి చోటనే సుప్రీం కోర్టు తీర్పు ఇంత తీక్షణంగా ఉంటే ఇక రాష్ట్రాల సంగతి ఏం చెప్పాలి? అందుకే ఇది మోడీకి పెద్ద ఎదురు దెబ్బ.
పార్టీల్లో తగాదాలు మీకెందుకు?
ఇక మహారాష్ట్ర తీర్పు మరింత కీలకమైంది. నిజానికి ఆ గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ఇప్పుడు పదవిలో లేరు. ఆరెస్సెస్ వీరవిధేయుడైన కోషియారి అనేక విధాల ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టారు. ఆఖరుకు ముఖ్యమంత్రి థాకరేను శాసనమండలికి నామినేట్ చేయడానికి కూడా అడ్డుపడి ఉద్రిక్తతకు కారణమైనారు. మెజార్టీ లేకున్నా దేవేంద్ర ఫడ్నవిస్‌తో తెల్లవారుజామునే రహస్యంగా ప్రమాణ స్వీకారం చేయించి పట్టంకట్టారు. కర్నాటకలోనూ 2018లో యెడియూరప్పకు మెజార్టీ లేకున్నా అలాగే ప్రమాణ స్వీకారం చేయించారు. రెండు చోట్ల వారం తర్వాత వారు గద్దె దిగిపోవలసి వచ్చింది. కొత్త సంకీర్ణాలు అధికారం చేపట్టాయి. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఏర్పడ్డం గవర్నర్ ఎన్నడూ జీర్ణించుకోలేకపోయారు. అనేకసార్లు ఆ మంత్రులను, ఎంపీలను వేధించేందుకు సిబిఐని ఉపయోగించారు. రోజుకో రణరంగంగా పాలన నడిచింది. చివరకు ఏక్‌నాథ్ షిండే అకస్మాత్తుగా కనిపించ కుండా పోవడంతో సంక్షోభం పరాకాష్టకు చేరుకుంది. సుప్రీం కోర్టు ఆ విషయమే తీర్పునిచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక చోట్ల ఇలాంటి పరిణామాలు చూశాం. ఎప్పుడూ చెప్పుకునే ఎస్‌ఆర్ బొమ్మై తీర్పు కూడా దీనికి సంబంధించిందే. 1989లో మెజార్టీ కోల్పోయారనే పేరుతో బొమ్మై ప్రభుత్వాన్ని నాటి గవర్నర్ సిఫార్సుపై ఏకపక్షంగా కేంద్రం రద్దుచేసింది. దీన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. మెజార్టీలు తేలవలసింది శాసనసభలో తప్ప రాజ్‌భవన్‌లో కాదని 1994లో తీర్పునిచ్చింది. అయితే దీన్ని కూడా ఆచరణలో దుర్వినియోగపర్చడానికి ఆస్కారముందని మోడీ ప్రభుత్వం చాలాసార్లు నిరూపించింది. ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను బలపరీక్షకు పురికొల్పి కూల దోయడం ఒక రివాజుగా మారింది. మహారాష్ట్రలో కూడా అప్పటి గవర్నర్ ఏ కారణం లేకుండానే ఉద్ధవ్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని, బలపరీక్ష కోరడం సరైంది కాదని సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పులో తేల్చి చెప్పింది. షిండేవర్గం తిరుగుబాటు చేయడం వారి అంతర్గత వ్యవహారం. దాంట్లో తలదూర్చాల్సిన అవసరం, అవకాశం గవర్నర్‌కు లేవు. తాము ఉద్ధవ్‌పై విశ్వాసం కోల్పోయామని వారేమీ లేఖ రాయలేదు. అవిశ్వాసం నోటీసు ఇవ్వలేదు.
పార్టీ అంటే పార్టీనే, సభాపక్షం కాదు
మరోవైపు కొత్తగా ఎన్నికైన స్పీకర్ రాహుల్ నార్వేకర్… ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించడం, వారు ప్రతిపాదించిన గోగావాలేను చీఫ్‌విప్‌ను చేయడం చట్ట విరుద్ధం అని సుప్రీం తీర్పు తేల్చిచెప్పింది. విప్ ఎన్నిక శాసనసభా పక్షానిదే గాని సంబంధిత రాజకీయ పార్టీతో నిమిత్తం లేదని షిండే వర్గం స్పీకర్ చేసిన వాదనను తోసిపుచ్చింది. పదవ షెడ్యూలులోని ఫిరాయింపుల నిరోధక చట్టం సెక్షన్ 2లో పార్టీ అంటే రాజకీయ పార్టీ తప్ప శాసనసభా పార్టీ కాదని స్పష్టం చేసింది. ఒక రాజకీయ పార్టీకి దాని శాసనసభా పక్షానికి మధ్య బొడ్డు పేగు లాంటి పాత్ర చీఫ్ విప్‌దని అభివర్ణించింది. అభ్యర్థి ఓట్లు కోరేది పార్టీ తరపున అయినప్పుడు శాసనసభా పక్షం వేరు కాబోదని ఈ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు చాలా కీలకమైంది. గతంలో చాలాసార్లు ఈ సమస్య వచ్చింది. ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ రెండు సార్లు ఈ సమస్యను ఎదుర్కొంది గాని అది వేరే చర్చ. గవర్నర్ బలపరీక్ష ఆదేశం, స్పీకర్ షిండే వర్గాన్ని గుర్తించి విప్‌గా నియమించడం రెండూ తప్పే గనక ఈ ప్రభుత్వ మార్పు చెల్లదు. అయితే అప్పటి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదని కూడా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం నిర్ధారించింది. బలపరీక్షను థాకరే సవాలు చేసినా బహిష్కరించినా ఏం జరిగేదో గాని ఆయన ముందే తనకు తాను రాజీనామా చేసి కూర్చున్నారు. కాబట్టి ఆయనను మళ్లీ నియమించడం కుదిరేపని కాదు. థాకరే రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి పదవి ఖాళీ ఏర్పడింది గనక షిండేను నియమించడం కూడా తప్పు కాదని కోర్టు భావించింది. ఇది కూడా ఒక పెద్ద గుణపాఠం. రాజకీయాలలో అవసరమైన పోరాటం చేయకుండా దుర్బలంగా వ్యవహరించడం, ముందే తప్పుకోవడం ఎంత దెబ్బ తీస్తుందో చెప్పే ఉదాహరణ. తప్పులు జరిగినప్పుడు గతంలో కొన్నిసార్లు తొలగించిన వారిని సుప్రీం కోర్టు పునర్నియమించిన సందర్భాలున్నాయి. కాని ఉద్ధవ్ థాకరే రాజీనామాతో ఆ అవకాశం లేకుండా పోయిందట. మొత్తంపైన ఢిల్లీ, మహారాష్ట్ర ఈ రెండు కేసుల్లోనూ గవర్నర్ల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనను సుప్రీం కోర్టు తప్పుపట్టిన ఇరు రాష్ట్రాల హక్కుల రక్షణ పోరాటంలోనూ ప్రభుత్వాల ఏర్పాటు, కూల్చివేత ప్రక్రియలోనూ చాలా కీలకమైన నిర్దేశాలు ఇచ్చింది. వాటిని గట్టిగా అమలు జరిగేలా చూడటం రాజకీయపక్షాల, వ్యవస్థల బాధ్యత. తప్పు జరిగితే గట్టిగా పోరాడాలి గాని బేలగా లోబడిపోవడం కాదు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, బెంగాల్ వంటి చోట్ల గవర్నర్ల రాజ్యాంగ విరుద్ధ పాత్రకు ఇదో చెంప దెబ్బ.
– పీపీ