77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం… గత కొన్నేళ్ళుగా ఆయన చేస్తూ వచ్చిన స్వాతంత్య్ర దినోత్సవాల ప్రసంగాల మాదిరిగానే మూస పద్ధతిలో సాగిపోయింది. 2014 నుండి భారతదేశం అన్ని రంగాల్లో ఎలా అద్భుతంగా పురోగతి సాధించిందో ప్రధాని మోడీ చెప్పుకున్న గొప్పలే ఆ ప్రసంగంలో ఉన్నాయి. ముస్లిం పాలనతో ప్రారంభమై బ్రిటిష్ పాలనతో ముగిసిన వెయ్యి సంవత్సరాల బానిస పాలనతో పోలుస్తూ అమృత కాలం కూడా వెయ్యి సంవత్సరాలు ఉండాలని తాము ఎదురు చూస్తున్నామంటూ మోడీ పేర్కొన్నారు. అదొక్కటే ఈ ఏడాది ప్రసంగంలో కొత్త అంశంగా ఉంది. ఇకపోతే సర్వసాధారణంగా ఎప్పుడూ ఉండే మాదిరిగానే వివిధ రంగాల్లో ప్రభుత్వం సాధించిన విజయాల పట్టికతో ప్రసంగం నిండిపోయింది. ప్రధానిగా తాను పోషించిన కీలక పాత్ర మీదే మోడీ ప్రధానంగా దృష్టి సారించారు. ఆ ప్రగల్భాలతో కూడిన ప్రసంగాలను విమర్శనాత్మక దృష్టితో చూస్తూ, ప్రతి ఒక్క దాన్ని వాస్తవికతలతో సరిపోల్చడమనేది వృధా ప్రయాస అవుతుంది. గతంలోనూ ఇప్పుడు కూడా ఇటువంటి కీలకమైన, నిశిత పరిశీలనలు జరిగాయి. దీనికి బదులు, ప్రధాని ప్రసంగంలోని రాజకీయ కోణాలను పరిశీలించడం ఉపయుక్తంగా ఉండగలదు.
మోడీ తన పంద్రాగస్టు ప్రసంగం ప్రారంభం నుంచి మణిపూర్ పరిస్థితులనే ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే ఆయన చెప్పిన విషయాలు మణిపూర్ ప్రజలను, దేశంలోని ఇతర ప్రజలను నిరాశపరిచాయి. అక్కడ ఘర్షణలు ఎలా చెలరేగాయి, మరణాలు ఎలా సంభవించాయి, మహిళలను ఎలా అవమానించారు అన్న అంశాలపై ఆయన పైపైన మాట్లాడారు. కానీ, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో శాంతి నెలకొందన్నారు. శాంతిని నెలకొల్పి, సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఇక్కడ సందేశం స్పష్టంగా ఉంది. జాతుల ఘర్షణ చెలరేగడానికి బాధ్యుడు, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను దీనికంతటికీ జవాబుదారీగా చేయలేదు. వాస్తవానికి అత్యంత ఘోరమైన లైంగిక నేరాల్లోని బాధితులకు న్యాయం చేయడం గురించి ఒక్క మాట కూడా లేదు. అలాగే ఈ సున్నితమైన ఈశాన్య ప్రాంత రాష్ట్రం ఏ రీతిన జాతుల ఘర్షణలు, అల్లర్ల ఊబిలోకి కూరుకుపోయిందో వివరించనూ లేదు.
ఇక రాబోయే 2024 ఎన్నికల వల్ల మోడీ ప్రసంగంలోని రాజకీయాలకు రంగులద్దబడ్డాయి. గత స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల మాదిరిగా కాకుండా ప్రతిపక్షంపై పదునైన దాడి చేశారు. వారసత్వ రాజకీయాలు, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తనకెంతో ఇష్టమైన అంశాన్ని ప్రస్తావిస్తూ, భారతీయ ప్రజాస్వామ్యంలో వారసత్వ పార్టీలన్నీ వ్యాధులు, వైకల్యాల వంటివని విమర్శించారు. అయితే, వారసత్వ రాజకీయాలపై ప్రధాని జరిపే తిరుగుబాటు ఒక వాస్తవాన్ని విస్మరించింది. బీజేపీలో మరింతమంది రాజకీయ వారసులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కీలక పదవులు చేపడుతున్నారన్నదే ఆ వాస్తవం. అవినీతిపై సుదీర్ఘంగా సాగిన ఆయన ప్రసంగం ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా దాడి చేసే మరో ఆయుధంగా మారింది. ప్రతిపక్ష నేతలపై అణచివేతకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఆయుధంగా వాడుతున్నారు. గత తొమ్మిదేండ్లలో చోటు చేసుకున్న ఉన్నత స్థాయి అవినీతి రికార్డును, దాని పట్ల మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును మనం చూసినట్లైతే, అవినీతి అనేది కేవలం ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వాడే ఆయుధమని స్పష్టంగా అర్ధమవుతోంది. రాఫెల్ ఒప్పందంలో కొట్టవచ్చినట్లు కనిపించే అవకతవకలను సమాధి చేయడం నుండి, హైవేల నిర్మాణంలోనూ, అలాగే పిఎంజెఎవై వంటి కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాల అమలు వరకు విస్తృతంగా జరుగుతున్న అవినీతి గురించి కాగ్ తాజా నివేదిక బట్టబయలు చేసింది. బుజ్జగింపు రాజకీయాలపై ఆయన దాడి చేశారు. ఇది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కొత్త అంశం, పైగా అరిష్ట సూచకం కూడా. ఇక్కడ బుజ్జగింపు అంటే మైనారిటీల బుజ్జగింపు. మోడీ అభిప్రాయం ప్రకారం, ఈ బుజ్జగింపు రాజకీయాలు జాతీయ స్వభావంపై చెరగని మచ్చ వేస్తున్నాయి, సామాజిక న్యాయానికి హాని కలిగిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే విస్తృతంగా ఘర్షణలు, మత హింస చెలరేగిన కేవలం 70కిలోమీటర్ల దూరంలో ఎర్రకోట బురుజులపై నుండి మాట్లాడుతున్న ప్రధాని మోడీ ఈ మైనారిటీ బుజ్జగింపు ధోరణిని ఖండిస్తున్నారు. ఘర్షణల్లో హిందూత్వ గూండాల దాడులకు మియో ముస్లింలు బలయ్యారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారినే లక్ష్యంగా చేసుకుంది. మోడీకి సంబంధించినంత వరకు, ముస్లింల ఇళ్ళను, దుకాణాలను ప్రభుత్వం కూలగొడుతున్న సమయంలో… మైనారిటీ బుజ్జగింపు ధోరణిని నిరసిస్తూ మాట్లాడటమంటే… లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మతోన్మాద ధోరణులను రెచ్చగొట్టడమన్నది వారి ఎజెండాలో ఉందనడానికి స్పష్టమైన సంకేతంగా ఉంది. మొత్తంమీద, నరేంద్ర మోడీ పదవ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కూటమి విషపు రాజకీయాల విన్యాసంగా ఉంది.
(‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)