”నాకొక కల ఉంది”

 "I have a dream"– రివరెండ్‌ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌
ఏ (అబ్రహామ్‌ లింకన్‌ అనే) మహానుభావుడి ఛత్ర ఛాయల్లో నేడు మనం నిలబడి ఉన్నామో ఆయన వందేండ్ల క్రితం బానిసల ”విముక్తి ఆదేశం”పై సంతకం చేశాడు. అన్యాయపు మంటల్లో కాలిపోతున్న కోట్లాది నీగ్రో బానిసలు దానిలో వెలుగుదివ్వెను చూశారు. సుదీర్ఘ చీకట్ల బంధనాలు తొలగిపోతాయని ఆశించారు. వందేండ్ల తర్వాత కూడా నీగ్రోలకు విముక్తి లభించలేదు. ఇనుప సంకెళ్ల వివక్ష విడిపోలేదు. తమ చుట్టూ సంపదమేట వేసి ఉన్నా నీగ్రోలు మాత్రం పేదరికపు ద్వీపాల్లో ఒంటరిగా మిగిలిపోతున్నారు. తమ స్వంత భూమైన అమెరికా మూలల్లో నీగ్రోలు కుమిలిపోతున్నారు. మన జీవితాల అసలు రూపాల్ని ఈ సమాజానికి వెల్లడించడానికి నేడు దేశ రాజధానికి మనం చేరుకున్నాం.
మన రాజ్యాంగ నిర్మాతలు స్వతంత్ర రాజ్యంగ ప్రకటన రాసినప్పుడు మనకిచ్చిన ప్రామిసరీ నోట్‌కు మనం కూడా వారసులమే. నల్లవారైనా, తెల్లవారైనా జీవించే హక్కును, స్వేచ్ఛను ఇవ్వాలి. కానీ, శ్వేతజాతేతరులకు, ముఖ్యంగా నల్లవారికి ఈ ప్రామిసరీ నోట్‌ విఫలమైంది. నీగ్రోలకు చెక్‌ బౌన్స్‌ అవుతుంది. కాని మనకి న్యాయాన్ని పంచాల్సిన బ్యాంకు దివాలా ఎత్తిందని మనం నమ్మట్లేదు. మన జాతి యొక్క అవకాశాల ఖజానాలు వట్టిపోయినాయని మనం నమ్మడానికి సిద్ధంగా లేము. స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని, న్యాయాన్ని మనం గట్టిగా డిమాండ్‌ చేసి వసూలు చేసుకోవాలి.
సమస్య యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేయించడానికే అతని అతి పవిత్ర స్థలంలో జమయినాము. నిద్రమాత్రలతో ప్రశాంతంగా విశ్రమించే సమయం కాదిది. నిర్జనమైన చీకటి కూపాల నుండి జాతి వివక్షత లేని సూర్యకాంతుల వెలుగుల్లోకి నడుద్దాం. జాతి వివక్షతా ఊబిలో నుండి శిలా సదృశమైన సోదరభావం వెల్లివిరిసే వ్యవస్థగా మన దేశాన్ని నిర్మించుకుందాం. దేవుని బిడ్డలందరికీ సమన్యాయం జరిగేలా చూసుకుందాం.
సమస్య తీవ్రత అర్థంకాకపోతే మన దేశానికి అది మరణాంతకమవుతుంది. ఉడికిపోతున్న ఈ ఎండాకాలపు నీగ్రోల న్యాయబద్ధమైన అసంతృప్తి… స్వేచ్ఛా, సమానత్వం వెల్లివిరిసే శరత్‌ కాలం వచ్చేదాకా ఆగదు. 1963 అంతం కాదు, ఆరంభం. నీగ్రోలకు పౌరసత్వ హక్కులిచ్చేదాకా అమెరికాలో ప్రశాంతత మనకు విశ్రాంతి ఉండదు. ప్రకాశవంతమైన న్యాయోదయం అయ్యేదాకా ఈ విప్లవాల సుడిగాలులు మనదేశంలో వీస్తూనే ఉంటాయి. దాని పునాదులను కదిలిస్తూనే ఉంటాయి. మనం నిలబడ్డ వెచ్చని గుమ్మం మనల్ని న్యాయ లోగిల్లోకి తోడ్కొనిపోతుంది. మన న్యాయమైన హక్కుల సాధనలో ఏవిధమైన తప్పులూ చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన స్వాతంత్య్ర పిపాసను ద్వేషమనే కాలకూటం తాగి తీర్చుకోవద్దు. మన ఆత్మగౌరవం తగ్గకుండా, క్రమశిక్షణాయుతంగా మన ఉద్యమం సాగాలి. మన సృజనాత్మకత ఏనాడూ భౌతికదాడుల స్థాయికి దిగజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కొత్తపుంతలు తొక్కుతున్న నీగ్రో సమాజ మిలిటెన్సీ తెల్లవారందరినీ ద్వేషించే స్థాయికి చేరరాదు. నేడిక్కడ పాల్గొంటున్న ఎందరో ”తెల్లసోదరులు తమ గమ్యం కూడా మన గమ్యంతో ముడిపడి ఉందని అర్థమైనవారే. వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల నుండి విడదీయరానివన్న భావనే నేడు వారినిక్కడికి నడిపింది. మనం ఒంటరిగా నడవలేము. మన ఉద్యమం వెనక్కి తిరిగిచూడరాదు. ముందుకే పురోగమించాలి. మీరు ఎప్పటికి తృప్తి చెందుతారని కొందరు మనల్ని ప్రశ్నిస్తూంటారు. పోలీసు దుర్మార్గాలు ఆగేదాకా ఏ నీగ్రో సంతృప్తి చెందడు. ఒక చిన్న వెలివాడ (ఘెట్టో) నుండి పెద్ద వెలివాడలోకి మార్చినంత మాత్రాన ఏ నీగ్రో సంతృప్తి చెందడు. ”తెల్లవారికి మాత్రమే” అనే బోర్డుల ద్వారా మా పిల్లల బాల్యాన్ని దోచుకునే స్థితి ఈ దేశంలో ఉన్నంత వరకు ఏ నీగ్రో సంతృప్తి చెందడు. న్యాయంగా మాకు చెందాల్సినవి నీటి ప్రవాహంలాగా జలజలా మావైపు ప్రవహించేదాకా మాకు సంతృప్తి ఉండదు.
మీరు ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు. కొందరు ఇరుకైన జైలు గదుల నుండి వచ్చారు. మీ స్వాతంత్రేచ్ఛ మిమ్మల్ని పోలీసుల పీడనకు, వేటకు గురిచేశాయని నేనెరుగుదును. ‘సృజనాత్మక’ బాధలు అనుభవించ డంలో మీరు పండిపోయారు. ఈ బాధల నుండి ఏదో ఒక రోజు విముక్తి పొందుతామన్న నమ్మకం మిమ్మల్ని నడిపిస్తోంది. మీమీ ప్రాంతాలకు, మీ మురికివాడలకు, మీ వెలివాడలకు తిరిగి వెళ్ళండి. ఈ పరిస్థితి తప్పనిసరిగా మారుతుందన్న నమ్మకంతో వెళ్ళండి.
నా మిత్రులారా! నిరాశనే కూపంలో పడిదొర్లకండి. నేడు ఎన్నో కష్టాలు, కడగండ్లు మనం ఎదుర్కొంటున్నా, రేపు నాకో కల ఉంది. అమెరికా సమాజంలో లోతుగా వేళ్ళునుకున్న కల అది. ఏదో ఒకరోజు ఈ దేశం తన నిజమైన స్థానంలోకి, అంటే ప్రజలందరూ సమానంగా సృజియించబడ్డారన్న సత్యంలోకి, పునరుద్ధాన మొందుతుందనేదే నా కల! ఏదో ఒకరోజు జార్జియాలోని ఎర్రకొండల్లో గత బానిసల పిల్లలు, బానిస యజమానుల పిల్లలు చెట్టా పట్టాలేసుకు తిరుగుతారనేది నా కల. ప్రస్తుతం శ్వేతజాతి దురహంకారంతో అట్టుడిగిపోతున్న అనేక రాష్ట్రాలు రంగు వివక్షతలేనివిగా సోదర భావం పరిఢవిల్లేవిగా మారతాయని నా కల!
ఇది నా ఆశ. ఈ విశ్వాసంతోనే నేను నా దక్షిణ ప్రాంతానికి తిరిగి వెళ్తున్నాను. ఈ నిరాశా పర్వతా ల్లో నుండే ఆశల శిల్పాలు చెక్కుతామన్న నమ్మకం నాకుంది. ఘర్షణ పూరిత వాతావరణ మున్న మన దేశంలో ఒక శ్రావ్యమైన సౌభ్రాతృత్వ వాయిద్య బృందగానామృతం జాలు వారుతుందని నా కల.
ఈ విశ్వాసంతోనే మనం కలిసి పనిచేస్తాం. కలిసి ప్రార్థన చేస్తాం. కలిసి పోరాటం చేస్తాం. కలిసి జైళ్ళలో కెల్తాం. స్వాతంత్య్రం కోసం కలిసి నిలబడతాం. ఏదో ఒక రోజు విముక్తి సాధిస్తామన్న నమ్మకంతోనే ఇవన్నీ చేయగలుగుతాం.
అమెరికా నిజంగా గొప్ప దేశంగా విలసిల్లా లంటే ఇవన్నీ నిజం కావాలి. దేశంలోని అన్ని ప్రాంతాల నుండీ, కొండల నుండీ, కోనల నుండీ ఈ స్వేచ్ఛా గీతం ఆలపించబడాలి. అది జరిగినప్పుడే, అలా జరిగేలా మనం చూసినప్పుడే ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి పట్టణం, ప్రతి రాష్ట్రం నుండి ఆ స్వేచ్ఛా గీతం ఆలపించబడినప్పుడే, దేవుని బిడ్డలందరూ… నలుపు, తెలుపు, యూదులు, ఇతర ఏ దేశస్తులైనా, ప్రొటెస్టెంట్లైనా, కేథలిక్కులైనా అందరూ చెట్టాపట్టాలేసుకుని పురాతన నీగ్రో ప్రార్థన ‘మేం విముక్తి చెందాం. ధన్యవాదాలు భగవంతుడా! చివరికి మేం విముక్తి చెందాం!’ అని పాడుకోగలం.
– అనువాదం: ఆర్‌. సుధాభాస్కర్‌.

 

Spread the love