చిత్రానందం!

Chitranandam!కొన్ని సినిమాల్లో కథే హీరోను నడిపిస్తుంది. మరికొన్నింటిలో హీరోనే కథను నడిపిస్తాడు. కానీ జాతీయ చలన చిత్ర పురస్కారాల ఎంపిక కమిటీని మాత్రం కేంద్రంలోని బీజేపీ వెనుకనుండి నడిపిందనేది ‘కాశ్మీరీఫైల్స్‌’కు అవార్డుతో తేటతెల్లమైంది. కాశ్మీరీపండిట్‌లు, ముస్లింల మధ్య విభజనను సృష్టించిన ‘కాశ్మీర్‌ఫైల్స్‌’కు దేశ సమైక్యత అవార్డు ఇవ్వడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇక తెలుగు చలన చిత్రరంగం జాతీయ స్థాయిలో పలు అవార్డులు గెలుచుకోవడం అభినందనీయం. ఇన్నాళ్లూ ఏదో తెలియని వెలితి తెలుగుచిత్ర పరిశమ్రను వెంటాడుతూ ఉండేది. ఎన్నో స్ఫూర్తిదాయక అవార్డులు గెలుచుకున్నా ఉత్తమ నటుల్లో మనోళ్లు జాతీయస్థాయిని ఇంతవరకు అందుకోలేక పోయారు. దాదాపు 69 సంవత్సరాల తర్వాత తెలుగు హీరో అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమనటుని అవార్డు దక్కింది. ఎంతోమంది మహామహులు, మరెంతోమంది ఉద్దండులు తెలుగు చిత్రసీమను ఏలారు. ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యంలో ముంచారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కానీ వారెవరినీ ఈ అవార్డు వరించలేదు. ఇప్పటికైనా ఓ తెలుగు నటునికి జాతీయ ఉత్తమనటుని అవార్డు దక్కటం అభినందించాల్సిన అంశం. కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘పుష్ప ద రైజ్‌’ సినిమాలో అల్లుఅర్జున్‌ నటనకు అవార్డును ప్రకటించిన విషయం విదితమే. సాన బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. ఇంకా పలు విభాగాల్లో తెలుగు సినిమాకు అవార్డులు ఈసారి ఎక్కువే దక్కాయి. వీటన్నిటి ఎంపికపైనా పలు విమర్శలు లేకపోలేదు!
అదలా ఉంచితే… తెలుగు చిత్ర పరిశ్రమ ప్రారంభమైనప్పటి నుంచి సందేశాత్మక చిత్రాలు ఎన్నో వచ్చాయి. అందులో సామాజిక కోణంలో ఉన్నవి, వైవిధ్య భరితమైనవి, ఆలోచించదగినవి చాలానే ఉన్నాయి. చిత్రసీమ కమర్షియల్‌ బాట పట్టిన తర్వాత సమాజానికి ఉపయోగపడే చిత్రాలు చాలా అరుదనే చెప్పాలి. కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజకీయ ప్రభావితం కోసం కొన్ని సినిమాలు తెరకెక్కడం ఓ ధోరణిగా మారింది. అందులో ముఖ్యమైనవి ‘కాశ్మీర్‌ ఫైల్స్‌’, ‘ది కేరళ స్టోరీ’. ప్రజల్లో మత విద్వేషాలు పెంచిపోషించిన చిత్రాలివి. వాస్తవాల్ని వక్రీకరిస్తూ ప్రజల మధ్య విద్వేషానికి కారణమైన కాశ్మీర్‌ఫైల్స్‌కు దేశ సమైక్యత అవార్డును ఇవ్వడం శోచనీయం! ఇందులో భావాత్మక ఆలోచనలు, కళాత్మక గుణాలు, సందేశాత్మక సన్నివేశాలు ఏ కోశానా లేవు. కానీ కేంద్రం పురస్కారమివ్వడం ఎంతవరకు సమంజసం? పుష్ప సినిమా నేపథ్యం కూడా పరిశీలించాల్సిన అంశమే. 2021లో సుకుమార్‌ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం మంచి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌కొట్టింది. కాదనలేం. కానీ సినిమా నేపథ్యం తిరుమల కొండల్లోని కలప అక్రమ రవాణాతో నడిచే కథ. ఇందులో కలపను ఏ విధంగా పోలీసుల కన్నుగప్పి అక్రమంగా అడవిని దాటించాలనే స్మగర్ల కోణమే దాగుంది. ఈ సినిమా చూసిన కొంతమంది అక్రమార్కులు కలపను కారులో స్మగ్లింగ్‌ చేస్తూ పోలీసులకు దొరికిన ఘటనలు కూడా మనం చూశాం. ఈ సినిమా మంచికంటే చెడునే ఎక్కువ ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. మన తెలుగువాడికి అవార్డు రావడం సంతోషించదగిన విషయమే అయినా, ఈ ఎంపిక దేనికి సంకేతమన్నదే ప్రశ్న.
ఇదే ఏడాది సామాజిక చైతన్యం నేపథ్యంగా తెరకెక్కిన సినిమా ‘జైభీమ్‌’. జస్టిస్‌ కె చంద్రు నిజజీవిత కథ ఆధారంగా డైరెక్టర్‌ జ్ఞానవేల్‌ రూపొందించిన ఈ సినిమా అట్టడుగు వర్గాల జీవితాలకు అద్దం పట్టింది. వారికి జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించింది. ఈ సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు పట్టుసడలని భావోద్వేగాల సమాహారంగా సాగుతుంది. పాత్రదారుల నటనలో సహజత్వం ఉట్టిపడుతుంది. సినిమా టేకింగ్‌లోనూ మేకింగ్‌ లోనూ ఉన్నత విలువలు దర్శనమిస్తాయి. అన్నిటికీ మించి ఈ సినిమా గొప్ప సామాజిక బాధ్యతను సందేశంగా ఇస్తుంది. బాధితులకు భరోసానిచ్చిన ఓ స్ఫూర్తి దాయకమైన సినిమా ‘జైభీమ్‌. కానీ కేంద్రం ప్రకటించిన చిత్ర పురస్కారాల్లో ఏ ఒక్క విభాగంలోనూ ఈ సినిమాకు అవార్డు దక్కకపోవడం నిజంగా అన్యాయం. ఇలాంటి సినిమాలు సమాజానికి నేడు అవసరం. వారిని ప్రోత్సహించాలి. అవసరమైన సహాయం కూడా అందించాలి. మొత్తంగా చూస్తే తెలుగు కథానాయకుడికి, తెలుగు సినిమాకి జాతీయస్థాయి గుర్తింపు లభించిందన్న ఆనందం తప్ప…అవార్డుల ఎంపికను మనస్ఫూర్తిగా హర్షించలేం.

Spread the love