ఇస్రో శాస్త్రవేత్తలకు నీరాజనం!

Desperation for ISRO scientists!చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాడుకున్న మనం దాని రాకకోసం ఆగకుండా మనమే వెళ్లాం. ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే కాదు, ప్రపంచంలోనే ఒక వినూత్న అధ్యాయానికి నాంది పలికింది. చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ నిలిచిందంటే దాని వెనుక ఉన్న యావత్‌ ఇస్రో సిబ్బంది దీక్ష, పట్టుదలే కారణం. అందుకు వారిని యావత్‌ జాతి శ్లాఘిస్తోంది. భుజం తట్టి మరిన్ని విజయాలతో ముందుకు పోవాలని మనసారా కోరుకుంటోంది. ఇంతటి మహత్తర విజయం తరువాత ఏమిటి అనే ప్రశ్న, ఉత్కంఠను రేకెత్తించింది. తాము ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నట్లు 1955 జూలై 29న అమెరికా ప్రకటించింది. తరువాత నాలుగు రోజులకే తామూ అదే చేయనున్నట్లు సోవియట్‌ యూనియన్‌ కూడా ప్రకటించింది. దాంతో ప్రారంభమైన పోటీలో మనం వెనుకబడకూడదన్న లక్ష్యంతో నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చొరవతో మన అంతరిక్ష పరిశోధనలకు 1962లో జాతీయ అంతరిక్ష పరిశోధనా కమిటీని ఏర్పాటు చేశారు. మరుసటి ఏడాదే కేరళలోని తుంబా కేంద్రం నుంచి తొలి రాకెట్‌ను ప్రయోగించారు. నాటి నుంచి నేటి వరకు మన పురోగమనం, సాధించిన విజయాలు తెలిసినవే. జాబిల్లి మీద నెమ్మదిగా దిగిన విక్రమ్‌తో మన అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడిగా పరిగణిస్తున్న విక్రమ్‌ సారాభారు పేరు శాశ్వతంగా నిలిచిపోయింది.
అంతరిక్ష పరిశోధన, ప్రయోగాల్లో మన శాస్త్రవేత్తలు ఎన్నో విజయాలు సాధించినా ప్రపంచంలో మనకంటే ముందున్న వారికంటే ఇంకా ఎంతో వెనుకబడి ఉన్నామని గ్రహించాలనటం మనవారి కృషిని తక్కువ చేసి చెప్పటం కాదు. వివిధ దేశాల నుంచి 1957లో అంతరిక్షంలోకి రెండు వస్తువులతో ప్రారంభమై 2022లో 2,474 ఈ ఏడాది ఇప్పటి వరకు 1,354 పంపారు. మొత్తం ఉపగ్రహాలు 15,946 పంపగా వాటిలో కొన్ని దగ్ధం కాగా 11,330 ఉన్నట్లు ఐరాస కేంద్రం తెలిపింది. వీటిలో అమెరికా 4,511, చైనా 586, బ్రిటన్‌ 561, రష్యా 177, భారత్‌ 62 ఉపగ్రహాలను నియంత్రిస్తూ తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. మన కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు పెద్దన్న అమెరికా చేయని ప్రయత్నం లేదని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. మనకు అవసరమైన పరికరాలను, పరిజ్ఞానాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన వివిధ దేశాల సంస్థల మీద ఆంక్షలు విధించింది. సీఐఏను ప్రయోగించి కుట్రలు చేసింది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉండి మన ప్రధాని నరేంద్రమోడీని ఆకాశానికి ఎత్తుతున్న జోబైడెన్‌ 1992లో సెనెటర్‌గా ఉన్నప్పుడు రాకెట్ల ప్రయోగానికి అవసరమైన క్రయోజెనిక్‌ ఇంజన్ల సరఫరా, రూపకల్పనకు మనదేశంతో రష్యా కుదుర్చుకున్న ఒప్పందం ప్రమాదకరమైనదని నానాయాగీ చేసిన పెద్దమనిషి అని మరవకూడదు. అమెరికా బెదిరింపులు, కుట్రలు, ఆంక్షలకు లొంగకుండా మన శాస్త్రవేత్తలు సాగించిన కృషి, సాధించిన విజయాలతో మరో దారి లేక ఇప్పుడు సహకారం గురించి కబుర్లు చెబుతున్నాడు.
మన రాజ్యాంగంలో పేర్కొన్న శాస్త్రీయ దృక్పధానికి తూట్లు పొడుస్తూ కుహనా సైన్సును ఆకాశానికి ఎత్తుతూ పరిశోధనలను నిర్లక్ష్యం చేస్తున్న పెద్దమనుషులు ఏలికలుగా ఉన్న కాలమిది. చంద్రయాన్‌తో సహా మన శాస్త్రవేత్తలకు దక్కాల్సిన ఖ్యాతిని ప్రధాని నరేంద్రమోడీ ఖాతాలో వేసేందుకు సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నాలుగేండ్ల క్రితం చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని తానే పర్యవేక్షిస్తున్నట్లుగా మీడియా, వంది మాగధులు చిత్రించేందుకు గాను ఏకంగా నరేంద్రమోడీ బెంగళూరు ప్రయోగకేంద్రంలో కూర్చున్నారు. అలాంటి పనులు శాస్త్రవేత్తల మీద ఎంతవత్తిడి పెంచుతాయో అర్థం చేసుకోవాల్సిందే తప్ప చెబితే ఎక్కదు. ఆ ప్రయోగం విఫలమైనప్పుడు ఏడ్చిన నాటి ఇస్రో చైర్మన్‌ శివన్‌ను ప్రధాని ఓదార్చిన చిత్రాలను దేశమంతా చూసింది. ప్రతి వైఫల్యం మరో ముందడుగు, విజయాలకు సోపానాలుగా ఉంటాయని ప్రతి విజయచరిత్ర వెల్లడించింది. నేటి విజయానికి మోడీ ఇచ్చిన ప్రోత్సాహమే కారణమన్నట్లుగా కొందరు చిత్రిస్తున్నారు. అదే నిజమైతే చంద్రయాన్‌-2 వైఫల్యానికి కారకులు, శాస్త్రవేత్తల విలువైన సమయాన్ని, కొన్ని వందల కోట్ల రూపాయాల ధనాన్ని వృధాచేసింది మోడీ అనాల్సి ఉంటుంది. తాజా విజయంతో ప్రపంచ గుట్టుమట్టులన్నింటినీ ఇట్టే పసిగట్టే పరిజ్ఞానం మన సొంతమవుతుందని, చైనాతో సహా వివిధ దేశాల మిలిటరీ రహస్యాలన్నీ తెలుసుకోవచ్చన్నట్లుగా వాట్సాప్‌ యూనివర్సిటీ పండితులు ప్రచారం ప్రారంభించారు. అదేగనుక వాస్తవమైతే వందల సంఖ్యలో గూఢచార ఉపగ్రహాలు ఉన్న అమెరికా ఈపాటికి అన్ని దేశాలనూ తన పాదాక్రాంతం చేసుకొని ఉండేది. తాలిబాన్ల చేతిలో చావు దెబ్బలు తినేది కాదు. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు వస్తాడన్న పెద్దల సూక్తి సదా గమనంలో ఉండాలి. ఇకనైనా రాహువులు, కేతువులు, చంద్రుడికి నీలాపనిందల కట్టుకథలు, పిట్టకథలకు స్వస్తి పలికి జనానికి శాస్త్రీయ అంశాలను బోధించాలని ఈ ప్రయోగం రుజువు చేసింది. ఇందుకు దోహదం చేసిన మన ఇస్త్రో శాస్త్రవేత్తలకు మరోసారి అభినందనలు, వారికి కృషికి నీరాజనాలు పడదాం !

Spread the love