నూహ్ లో హింస, విధ్వంసం వెనుక…

Behind the violence and destruction in Noah...హర్యానాలోని నూహ్ కు, ఢిల్లీ నుండి గంట ప్రయాణం. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న నూహ్ జిల్లాలో, పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత ఎక్కువ. ఇటీవలి కాలంలో సైబర్‌ నేరాలకు కేంద్రంగా ప్రసిద్ధికెక్కింది. ఈ ప్రాంతానికి మత ఉద్రిక్తతల చరిత్ర ఉంది. జూలై 31న కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ధ్వంసమైన వాహనాలు, దగ్ధమైన దుకాణాలు, భయోత్పాతాన్ని గుర్తుచేస్తాయి. ఒకప్పుడు జిల్లాలో సందడిగా, హడావిడిగా ఉన్న గ్రామాల్లో నెలకొన్న భయంకర నిశ్శబ్దాన్ని, పరిస్థితిని అదుపు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం వేల సంఖ్యలో దింపిన పోలీసుల బూట్ల శబ్దం ఛేదించింది.
ఇద్దరు హౌంగార్డులు, నలుగురు పౌరులు మొత్తం ఆరు గురు ఈ ఘర్షణల్లో చనిపోయారు. ఘర్షణల వార్తలు పల్వాల్‌, సోహ్నాతో పాటుగా నూహ్ కు పొరుగునున్న గురుగ్రామ్‌, ఇతర ప్రాంతాల్లో ప్రతిధ్వనించాయి. మిలీనియం సిటీగా కూడా పేరున్న గురుగ్రామ్‌ నడిబొడ్డున ఒక మసీదును దగ్ధం చేశారు. అంతర్జాతీయ మీడియా హింసకు సంబంధించిన సమాచారాన్ని, సెప్టెంబర్‌ నెలలో ఢిల్లీలో జరిగే జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని దేశ రాజధాని ప్రాంతంలో, నూహ్ లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున ముస్లిం యువకుల్ని కట్టడి చేస్తూ చర్యలు చేపట్టి, మైనర్లను కూడా నిర్బంధించడం ప్రారంభించారని స్థానిక ముస్లింలు ఆరోపించారు. ఆగస్టు 3వ తేదీ వరకు, హింసకు సంబంధం ఉందన్న పేరుతో 176మందిని అరెస్ట్‌ చేసి, 90మందిని నిర్బంధించి, 93మంది పైన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అరెస్టుల సమాచారం కోసం ఫ్రంట్‌ లైన్‌ ప్రతినిధి, నూహ్ ఎస్పీ, వరుణ్‌ సింగ్లాను కలిశాడు కానీ అధికారిక సమాచారం అందలేదు. నూహ్ లో హింస చెలరేగిన కొన్ని రోజుల తరువాత, ఘర్షణలు జరిగినప్పుడు సెలవు పై వెళ్ళిన సింగ్లాను భివానీకి బదిలీ చేసి, నరేంద్ర బిజార్నియాను కొత్త ఎస్పీగా నియమించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పి) నిర్వహించిన బ్రిజ్‌ మండల్‌ జలాభిషేక్‌ యాత్ర, శివాలయం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేద్లా మోడ్‌ దగ్గరకు చేరినప్పుడు ఒక మతానికి చెందిన యువకులు ఆ యాత్ర పైన రాళ్ళు రువ్వడంతో సమస్య మొదలైంది. వాడివేడి మాటలతో మొదలైన ఘర్షణ, రాళ్ళ వర్షంగా మారిందని స్థానికులంటున్నారు. సామాజిక మాధ్యమంలో వైరలైన వీడియోల్లో ఇరువర్గాల వారు, కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలు, తుపాకుల్లాంటి మారణాయుధాలతో కనిపించారు. యాత్రలో భాగస్వాములైన వందలాది మంది శివాలయంలో తలదాచుకున్నారు, తరువాత పోలీసులు వారిని బయటకు తీసుకొచ్చారు. ఆ వెంటనే సామాజిక మాధ్యమాల్లో, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న నూహ్ లాంటి ప్రాంతాల్లో హిందువులకు రక్షణ లేదని, హిందూత్వ సంస్థల సభ్యులు కథనాలను వ్యాప్తి చేయడం ప్రారంభించారు.
ఆ రాత్రి గురుగ్రామ్‌ సెక్టార్‌ 57లోని అంజుమన్‌ జమా మసీద్‌కు డిప్యూటీ ఇమామ్‌గా ఉన్న హఫీజ్‌ సాద్‌, పోలీసులు పహారా కాస్తున్నప్పటికీ, మూక దాడిలో చనిపోయాడు. బీహార్‌ రాష్ట్రంలోని సితామర్హీకి చెందిన అతడు సంవత్సరం క్రితమే అక్కడికి వచ్చాడు. స్థానికుల కథనం ప్రకారం, అర్థరాత్రి సమయంలో సాయుధ మూక మసీదుపై దాడి చేసి, నిప్పంటించింది. సాద్‌ సుమారు రాత్రి 2 గంటల సమయంలో చనిపోయాడని అతని సోదరుడు షాదాబ్‌ అన్నాడు. రాత్రి 11.30 గంటలకు సాద్‌ తన అక్కకు ఫోన్‌ చేస్తే, ఆమె బీహార్‌ తిరిగి వచ్చేయమని చెప్పగా, మసీదుకు రక్షణగా పోలీసులు చుట్టూ ఉన్నారని, భయపడాల్సినవసరం లేదని చెప్పాడు. దాడిలో ఛాతీపై అనేక కత్తిపోట్లు పొడవడంతో చనిపోయాడని షాదాబ్‌ ఫ్రంట్‌ లైన్‌కు చెప్పాడు. స్వరాష్ట్రానికి వెళ్ళేందుకు సాద్‌ ఆగస్ట్‌ 1వ తేదీనే టికెట్‌ బుక్‌ చేసుకున్నాడని అతనన్నాడు. డబ్ల్యూ.ప్రతీక్షా హాస్పిటల్‌కు పోలీసులు సాద్‌ను తీసుకొనిపోగా చనిపోయాడని చెప్పారు. మసీదులో ఉన్న మరో వ్యక్తిని కూడా తీవ్రంగా కొట్టి, అతని మోకాలును గాయపరిచారు. అతడింకా ఐసీయూలోనే ఉన్నాడు. నేరస్తులను గుర్తించే పనిలో ఉన్నామని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని పోలీసులంటున్నారు.
ఈ హింసకు ప్రధాన ఉత్ప్రేరకంగా రెండు వీడియోలు పని చేసినట్లు కనిపిస్తోంది. ఒకటి, ఇద్దరు ముస్లింలను చంపిన నేరంలో ప్రధాన నిందితుడు, పారిపోయిన గోరక్షక దళ సభ్యుడైన మోనూ మనేసార్‌ వాట్సాప్‌ ద్వారా పంపిన వీడియో, మరొకటి ఫరీదాబాద్‌ గోరక్షక బజరంగ్‌ ఫోర్స్‌ యూనిట్‌కు ఇన్చార్జ్‌ అయిన బిట్టూ బజరంగీ జూలై 31 ఉదయం 11 గంటలకు ఫేస్బుక్‌లో పోస్ట్‌ చేసిన లైవ్‌ వీడియో. వీహెచ్‌పి యాత్రలో మోనూ మనేసార్‌ పాల్గొంటున్న ఉద్దేశ్యాన్ని ప్రకటిస్తూ బిట్టూ ఆ వీడియోలో కనిపిస్తాడు.
”నేను మీకు (ముస్లింలకు)ముందుగానే చెపుతున్నాను. మీ బావగారు (మోనూ మనేసార్‌) ఇక్కడ సందర్శనకు వస్తున్నాడు. మేం మళ్ళీ మీకు చెప్పలేదని అనొద్దు. ఆయన కోసం పూలు, పూలదండలతో సిద్ధంగా ఉండండి” అని బిట్టూ బజరంగీ ఆ వీడియో ద్వారా చెప్పాడు.
మోనూ మనేసార్‌ హర్యానాలో స్వయం ప్రకటిత గోరక్షకుడు. ఆవుల్ని స్మగ్లింగ్‌ చేస్తున్నారన్న అనుమానంతో ఫిబ్రవరి 16న బజరంగ్‌ దళ్‌ సభ్యులు, నాసిర్‌, జునైద్‌లను కిడ్నాప్‌ చేసి,హత్య చేసిన నేరాల్లో మోనూ ప్రధాన నిందితుడు. కారులోకి ఎక్కించి, సజీవ దహనం చేయడానికి ముందు వారిని అనాగరికంగా కొట్టారు. వారిరువురూ రాజస్థాన్‌ రాష్ట్రంలో గోపాల్‌ ఘర్‌ గ్రామానికి చెందినవారు. మే నెలలో రాజస్థాన్‌ పోలీసులు నాసిర్‌, జునైద్‌లను హత్య చేసినందుకు మోనూపై కేసు మోపారు కానీ, అతన్ని పట్టుకోలేక పోయారు. రాజస్థాన్‌ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించిన మేవత్‌ ప్రాంతంలో ఈ కేసు ఒక సున్నితమైన సమస్యగా మిగిలింది. నూహ్ ను సందర్శించాలన్న మోనూ నిర్ణయంతో ఆగ్రహించిన కొందరు ముస్లిం యువకులను(బిట్టూ సవాల్‌కు ప్రతిస్పందనగా) ఎదురు దాడి చేయడానికి సిద్ధంగా ఉండేట్లు అనివార్యంగా ఉసిగొల్పారు.
”సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్‌ చేసినప్పుడు, ఆ ప్రాంత ప్రజల మానసిక స్థితి పూర్తిగా మారింది. జునైద్‌, నాసిర్‌ల హత్య కేసులో మోనూ నిందితుడు. ప్రజలు మానసిక ఉద్వేగాలకు లోనయ్యారు. అక్కడ ఏమీ జరగనట్టు, మోనూ, నూహ్ సందర్శిస్తానని చెప్పాడు” అని ఆగస్ట్‌ 1న వీహెచ్‌పి, బజరంగ్‌ దళ్‌, జమైత్‌ ఉలామా-ఈ-హింద్‌, ఇతర ప్రతినిధులు పాల్గొన్న శాంతి సమావేశానికి హాజరైన ఉలామా-ఈ- హింద్‌ సభ్యుడు ముఫ్తీ సలీం చెప్పాడు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగడంతో శాంతి సమావేశం నిష్ప్రయోజనమైంది.
ముస్లిం యువకులకు కోపం తెప్పించాలనీ, వారు ప్రతిస్పందించేట్టు చేయాలనేది లేకుంటే, నాసిర్‌, జునైద్‌ల హత్యా నేరంలో నిందితుడైన మోనూను ఇక్కడికెందుకు ఆహ్వానించాలని, గాంధీ గ్రామ్‌ నివాసి, నూహ్ లో టీకొట్టు నడుపుతున్న మహమ్మద్‌ అయూబ్‌ అనే పెద్ద మనిషి అన్నాడు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ఘర్షణలు సృష్టించాలనే ఉద్దేశ్యం వీహెచ్‌పికి ఉందని, అదే ప్రాంత నివాసి మౌజ్‌ ఖాన్‌ అంటాడు. బీజేపీ హిందూత్వ అజెండాను ముందుకు తీసుకుపోయే లక్ష్యంతోనే ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ఘర్షణల్ని సృష్టించి, హిందువులు ప్రమాదంలో ఉన్నారనే కథనాలను వ్యాపింప చేస్తున్నారని ఆయన అన్నాడు.
వచ్చే సంవత్సరం జరగబోయే సాధారణ ఎన్నికలు, హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హిందువుల మద్దతు పొందే లక్ష్యంతోనే మేవాత్‌ ప్రాంతాన్ని మతతత్వీకరణ చేసే సుదీర్ఘ ప్రణాళికను బీజేపీ రచించిందని, శాంతి సమావేశ భాగస్వామి, స్వరాజ్‌ ఇండియా పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్‌ అన్నాడు. వీడియోల ద్వారా హింసను ప్రేరేపించిన బజరంగ్‌ దళ్‌ సభ్యులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.
హింస మొదలైనప్పుడు, అధికారులు తగిన రీతిలో స్పందించక పోయిన కారణంగానే పరిస్థితులు ఇక్కడి దాకా వచ్చాయనే అభిప్రాయాన్ని స్థానికులు వెలిబుచ్చారు. హింసను నివారించడంలో అధికారుల వైఫల్యం గురించి మాట్లాడుతూ… మహిళా జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ను చుట్టుముట్టిన మూకల నుండి ఆమెను రక్షించడంలో తాను సహకరించానని నూహ్ లో సీనియర్‌ న్యాయవాది అయిన రంజాన్‌ చౌదరీ అన్నారు. ఆమెను బయటకు తీసుకురావడానికి, రక్షణగా ఉండటానికి పోలీసులు నిరాకరించారు. ప్రచారంలో ఉన్న వీడియోలను పరిశీలించి, వాటిలో బహిరంగ బెదిరింపులకు దిగిన వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని నూహ్  అడిషనల్‌ ఎస్పీ ఉషా కుందూకు చేసిన అభ్యర్థనలను పట్టించుకోలేదని చౌదరి అన్నాడు.
సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు ఇంకా చక్కర్లు కొడుతున్నాయి కాబట్టి అధికార యంత్రాంగానికి చర్యలు తీసుకునే ఉద్దేశం లేదనేది స్పష్టం అవుతుంది. సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులకు గురిచేస్తున్న పోస్టుల్ని తీసేయలేదు, ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని ముందు జాగ్రత్త చర్యగా నిర్బంధంలోకి తీసుకోలేదని విమర్శకు లంటున్నారు. హింస చెలరేగిన తరువాత మాత్రమే ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేసి, దానిని ఆగస్ట్‌ 5 వరకు పొడిగించింది.
ఈ క్రమంలో, పరిస్థితిని చక్కదిద్దడంలో అధికారుల తీరుపై బీజేపీ పాలకపక్షం సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. గురుగ్రామ్‌ ఎంపీ, కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌, నూహ్ హింసపై మాట్లాడుతూ… యాత్రలో పాల్గొన్నవారు కత్తులు, కర్రలు చేబూనడం సరైంది కాదని అన్నాడు. ”వారికి ఆయుధాలెవరిచ్చారు? కత్తులు, కర్రలు పట్టుకుని ప్రదర్శనకు ఎవరు వెళ్తారు? అవతలివైపు నుండి ప్రేరేపిత చర్యల్లేవని నేననడం లేదని” ఆయన అన్నాడు. యాత్రకు అనుమతిచ్చే సందర్భంలో, యాత్రలో ఖచ్చితంగా ఆయుధాలు లేకుండా చూడాలని నిర్వాహకులకు చెప్పినట్లు నూహ్ డిప్యూటీ కమీషనర్‌, ప్రశాంత్‌ పన్వర్‌ మీడియాతో అన్నాడు. 2016, ఫిబ్రవరిలో 10రోజులపాటు రాష్ట్రాన్ని బలహీనపరిచిన హింసాత్మక జాట్‌ నిరసనల సందర్భంలో కూడా మనోహర్‌ లాల్‌ ఖట్టార్‌ నాయకత్వంలోని ప్రభుత్వం మొద్దునిద్ర పోయింది. అప్పుడు చెలరేగిన హింసను అదుపుచేయడంలో కూడా ప్రభుత్వం విఫలం చెందిందనే ఆరోపణలున్నాయి. ఈసారి హర్యానాలో చెలరేగిన హింస, పేద ముస్లింలు నివసించే ప్రాంతాలకు విస్తరించింది. వారు అధికారుల ఒత్తిడిని కూడా ఎదుర్కొంటున్నారు. ఆగస్ట్‌ 4న, అధికారులు నూహ్ లో ముస్లిం వలస కార్మికులకు చెందిన 250 గుడిసెలు, పాకలను కూల్చారు. ఇవి ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలని అధికారులు ఆరోపిస్తున్నారు.
ముఖ్యమంత్రి ఖట్టార్‌, హింస వెనుకున్న కుట్రను బట్టబయలు చేసి, నేరస్తులను శిక్షిస్తామని అన్నాడు. ఆస్తుల్ని కోల్పోయిన వారికి నష్టపరిహారాన్ని ప్రకటించాడు. 5లక్షల రూపాయల నష్టం జరిగిన వారికి అందులో 80శాతం, 5 నుండి 10 లక్షల రూపాయల నష్టం వాటిల్లిన వారికి 70శాతం, 10 నుండి 20 లక్షల రూపాయల నష్టం జరిగిన వారికి 60శాతం పరిహారాన్ని అందజేస్తామని, మానేసార్‌ను పట్టుకునేందుకు వేట మొదలైందని ముఖ్యమంత్రి మీడియాతో అన్నాడు.
ఈ క్రమంలో ఆగస్ట్‌ 2న నూహ్, గురుగ్రామ్‌లలో అల్లర్లు జరిగిన తర్వాత వీహెచ్‌పి, బజరంగ్‌ దళ్‌లు తలపెట్టిన ప్రదర్శనలను నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టులో ఓ దరఖాస్తు దాఖలైంది. ”ప్రదర్శనల్లో ఎలాంటి ద్వేషపూరిత ప్రసంగాలు లేకుండా కేంద్రం హామీ ఇవ్వాలని, ప్రదర్శనలు నిర్వహించే సందర్భంలో భద్రతా కారణాల రీత్యా అదనపు బలగాలను మోహరింప చేయాలని” కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
(”ఫ్రంట్‌ లైన్‌” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌, 9848412451
ఇస్మత్‌ ఆరా

Spread the love