జి-20 సమ్మిట్‌కు

– పుతిన్‌ హాజరుకావడం లేదు : రష్యా వెల్లడి
మాస్కో : భారత్‌లో జరగనున్న జి-20 సమ్మిట్‌కు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌ వ్యక్తిగతంగా హాజరుకావడం లేదు. అయితే ఈ సదస్సులో వర్చువల్‌గా ఆయన పాల్గొంటారని తెలుస్తున్నది. క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. జి-20 సమ్మిట్‌కు పుతిన్‌ స్వయంగా హాజరయ్యే ప్రణాళికలు ఏమీ లేవని తెలిపారు. వర్చువల్‌గా ఈ సదస్సులో పాల్గొనడాన్ని తర్వాత నిర్ణయిస్తామని అన్నారు. సెప్టెంబరు 9 నుంచి 10 వరకు ఢిల్లీలో జి-20 సమ్మిట్‌ జరగనున్నది. అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌ సహా పలు దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరవ్వనున్నారు. అయితే రష్యా అధ్యక్షులు పుతిన్‌ మాత్రం వ్యక్తిగతంగా హాజరుకావడం లేదని ఆ దేశం స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై సంక్షోభం నేపథ్యంలో పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసిసి) అరెస్టు కోసం వారెంట్‌ జారీ చేసింది. ఈ కారణంతోనే పుతిన్‌ విదేశాల్లో ప్రయాణించడం లేదని కొంత మంది ఆరోపిస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్‌ సదస్సుకు కూడా పుతిన్‌ హాజరుకాలేదు. అయితే వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు.

Spread the love