”ఎవరు మీరు అంతలా మండిపోతున్నారు”
”నేను సూర్యుణ్ణి”
”ఎవరూ, మండుతున్న సూరీడా”
”నేను మండుతున్నందుకే కద నన్ను సూర్యుడంటారు”
”ఏమో బాబూ నీవు మండడం కాదు మమ్మల్ని మాడుస్తున్నావు”
”నేనా………?!”
”మరి నీవుగాక ఇంకెవరు?”
”నా గుణమే మండడం. అసలు భూమి మీద జీవం ఏర్పడడానికి నేనే కారణం. నానుండి విడిపోయిన చిన్న ముక్కే మీరు నివశిస్తున్న భూమి. అది దూరంగా పోయి మెల్ల మెల్లగా చల్లబడి నీరు ఏర్పడి తరువాత జీవం ఏర్పడి తన వైవిధ్యాన్ని చూపిస్తోంది తెలుసా”
”మా భూమి గురించి మాకే చెబుతావా….!”
”మరి చెప్పక”
”సరేలే అలాంటి భూమిని మళ్లీ మండించి, మాడ్చి నీలో కలిపేసుకుందామనేనా నీ ప్లాను”
”ఏమో మరి అది మీ చేతుల్లో ఉంది. అసలు మంచు యుగాలు కూడా ఈ భూమి చూసింది తెలుసా.
అలాంటిది ఇప్పుడు మండుతున్నామంటూ ఏడుస్తున్నారు”
”మరేం చేయాలి చెప్పు”
”ప్రపంచం నిండా చెట్లు, జంతువులు, కొండలు, అడవులు, సముద్రాలు,
నదులు ఉన్నంత కాలం చల్లగానే ఉంది. ఆ తరువాతే….”
”ఆ తరువాత అంటే?”
”చెబుతా చెబుతా, మీ లాంటి మానవులు పరిణామం చెంది ఈ భూమి మీద పుట్టాకనే కదా భూమికి తిప్పలు.
మనిషి ఎక్కడ అడుగు పెడితే అక్కడ సర్వనాశనమని చెబుతుంటారు కదా. కాని నా నమ్మకమంతా మనిషి పైనే.
మంచి పనులు చేసేది కూడా అతనే. అందుకేగా మానవుడే మహనీయుడు అని ఆరుద్ర రాసింది”
”నీకు మా కవులు కూడా తెలుసా?
”ఎందుకు తెలీదు? మండే కవులు మండించే కవులు అందరూ తెలుసు. ఫిరదౌసి తెలుసు, జాషువా తెలుసు, శ్రీశ్రీ తెలుసు, ఇంకా…..”
”సరే కాని అలాంటి మానవులుగా మేమేం చేయాలి చెప్పు”
”ఇప్పుడే చెప్పాను కదా చెట్లు, జంతువులు, కొండలు, అడవులు, సముద్రాలు, నదులు ఉన్నంత కాలం చల్లగానే ఉంది అని, వాటిని మళ్ళీ భూమిని పాత రూపానికి తీసుకురండి చాలు. అప్పుడు ఈ ఎండాకాలం కూడా మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలు మీరు మానవావతారం ఎత్తక ముందు ఈ భూమి ఎలాగుందో, ఎంత కాలుష్యరహితంగా ఉందో మళ్లీ అలాగ చేయండి చాలు”
అంతేనా?
వంద శాతం అంతే
అలాగే సూర్యుడు గారూ
*****
అలాగే సూర్యుడు గారూ…… అలాగే సూర్యుడు గారూ….. అలాగే సూర్యుడు గారూ
”ఏమే ఏదో కలగన్నట్టున్నావు, లే. లేచి పర్యావరణ పరిరక్షణ పై జన విజ్ఞాన వేదిక క్లాసులకు మాతో పాటు రావాలి”
”అది ఆలోచిస్తూ పడుకుంటేనే కల పడిందమ్మా” మొత్తం కల అమ్మకు చెప్పింది
”కలకాదు దాన్ని నిజం చేయాలి, లే లే…..”
*****
ఇక నిజమైన సూర్యుణ్ణి వదిలేసి ఇంకో సూర్యుడి గురించి తెలుసుకోవాలి మనం. అతనే ఓటేసే సూర్యుడు, ఓటరు. ఈ ఓటరు సూర్యుళ్లందరూ ఇప్పుడు తమ సత్తా చూపడానికి సిద్ధంగా ఉండాలి. ఓటరే సూరీడు. ఓటర్లే మనకు దారి చూపే సూర్యుళ్లు. మన చుట్టుపక్కల వాతావరణమంతా వేడిగా సెగ పంచుతున్న గాలులతో నిండి ఉంది. అలా చేసుకుంటూ పోతే సూర్య ప్రతాపం తెలుస్తుంది. దేశంలో, సమాజంలో కూడా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మతాలు, కులాలు, నీతి లేని రాజకీయాలు, బంధు ప్రీతి, మిత్రులంటే పడి చచ్చే ప్రేమతో కలుషితం చేస్తున్నారు. అలాంటి కలుషిత వాతావరణంలో కూడా మనకు వేడి తెలుస్తుంది. దాన్ని కంట్రోలు చేసేది ఈ ఓటరు దేవుళ్ళు…. వాళ్లే సూర్యుళ్ళు. ఎలాగైతే చెట్లు, కొండలు, నదులు, చెరువులు మాయమైనాయో మన మధ్య సోదర ప్రేమ, పరమత సహనం సాధ్యమైనత మేర చెడగొట్టారు. అందుకే ఈ మానసిక సెగలు. దాన్ని మరమ్మత్తు చేయవలసింది ఈ ఓటరు సూర్యుళ్లే. నిజంగా ఈ ఓటరు సూర్యుళ్ళకు అందరూ కలిసి ఉండడమే ఇష్టం. ఏమంటే కొందరు చేసే ప్రచారాన్ని నమ్మి అలా మారారంతే. వాళ్లకు వాస్తవాలు నిదానంగా అర్థమయ్యేలా చెబితే అయ్యో ఇన్నిరోజులు ఇంత అమాయకంగా ఉన్నామా అని కోపం తెచ్చుకొని సూర్యుడిలా ఎర్రటి కండ్లతో ప్రపంచాన్ని చూస్తారు.
శ్రీ సూర్య నారాయణా మేలుకో అంటూ ఉదయాన్నే ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాడిన పాట పెడుతుంటారు టీవీల్లో . ముందే ఎండా కాలం, ఆయన ఎక్కువసేపు నిద్రపోతే మేలు కదా ఎందుకు లేపడం అనిపిస్తుంది కొందరికి. అసలు ఆయనను లేపే పనే లేదు ఎందుకంటే మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చిన్నప్పుడే చదూకున్నాం. అలా మనం తిరిగినప్పుడే సూర్యుడొస్తాడు. తరువాత మనచుట్టూ తిరిగే చంద్రుడొస్తాడు. అసలు చంద్రుడి వెన్నెల కూడా సూర్య కిరణాలే కదా…! ఏమైనా ఆ ఓటరు సూర్యుళ్లని మనం మ్చాాలి. వాళ్లలో కొందరికి అన్నీ ముందే తెలుసు. మిగతావాళ్లని మేల్కొల్పాలి. మరో ఐదేళ్ళు మనల్ని ఎవరు పాలిస్తారు అన్న విషయంలో మెలకువగా ఉండమని చెప్పాలి. ఎటువంటి మత్తూకూ లోనుకాకుండా, లొంగిపోకుండా ఓటెయ్యమని చెప్పాలి. నిన్ను నువ్వు ఏలుకోవాలంటే మేలుకోమ్మని చెప్పాలి.
– జంధ్యాల రఘుబాబు
సెల్ : 9849753298