– 50వేల జనాభాకు ఒక వార్డు ఏర్పాటు
– నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
– వార్డు ఆఫీసర్ల శిక్షణా కార్యక్రమం ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు జీహెచ్‌ఎంసీ వార్డు వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్ వార్డు అధికారుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లా డుతూ 50 వేల జనాభాకు ఒక వార్డును ఏర్పాటు చేస్తున్నామనీ, వార్డు కార్యాలయాల్లో పది మంది వివిధ విభాగాలకు చెందిన అధికారుల బృందంతోపాటు వార్డు పరిపాలన వ్యవస్థను త్వరలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి అందిన ఫిర్యా దులను సంబంధిత అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని తిరిగి ఫిర్యాదుదారుడికి సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ వార్డు వ్యవస్థ పని చేస్తుందని తెలిపారు. వార్డు స్థాయిలో వచ్చే తాగునీటి సమస్యలు, సివరేజ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ తదితర సమస్యలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సిటీజన్ చార్ట్ ఆధారంగా నిర్ణీత సమయంలో సమస్య పరిష్కారా నికి కృషి చేస్తారని తెలిపారు. అధికారులు ప్రజలతో జవాబుదారీ తనంతో ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని తెలిపారు. వార్డు లెవెల్ అధికారులు కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ వార్డు పరిపాలన సంబంధించిన నియమావళి పుస్తకాన్ని ఆవిష్కరించారు.
సత్వరమే ప్రజా సమస్యల పరిష్కారం : కమిషనర్
వార్డు వ్యవస్థను నెలకొల్పడం ద్వారా నగర నలుమూలల నుంచి వస్తున్న ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి వీలు పడుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమా ర్ తెలిపారు. వార్డు కార్యాలయాల్లో జీహెచ్‌ఎంసీ విభాగాలైన బయోడైవర్సిటీ, హెల్త్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, వార్డ్ ఇంజినీర్, ఎంటమాలజీ, వాటర్‌వర్క్స్, విద్యుత్, కమ్యూనిటీ పని చేస్తాయని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు హెడ్ ఆఫీస్, సర్కిల్ జోనల్ కార్యాలయాలకు వెళ్లకుండా తమ సమస్యల ను దగ్గరలోని వార్డు కార్యాలయాల్లో ఫిర్యాదు చేస్తే అధికారులు తక్షణమే పరిశీలించి పరిష్కరిస్తారన్నారు. వార్డు ఆఫీస్‌కు వచ్చే వారి పట్ల అధికారులు, సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎక్కువగా శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలపైనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వార్డు లెవెల్ సిబ్బంది ముందుగా ఉదయం పూట తమ పరిధిలో వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ, మధ్యా హ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు తప్పని సరిగా అందరూ వార్డు కార్యాలయంలో ఉండాలన్నారు. బాధితుల నుంచి తీసుకు న్న విన్నపాలు, ఫిర్యాదులను డేటా ఎం ట్రీ చేసి సంబంధిత అధికారికి ఫార్వర్డ్ చేసి, సమస్య పరిష్కారమైన తర్వాత ఫిర్యాదుదారుడికి విషయాన్ని తెలియజే యాలని ఆదేశించారు. వార్డు వ్యవస్థపై టౌన్ ప్లానింగ్, ఎంటమాలజీ, శానిటేష న్, వాటర్ వర్క్స్ తదితర విభాగాలపై సమగ్ర శిక్షణను నగర వ్యాప్తంగా సంబంధిత జోన్‌లలో హెచ్.ఓ.డీలతో నిర్వహిస్తున్నామని తెలిపారు.
కలిసికట్టుగా పని చేయాలి : జలమండలి ఎండీ దానకిషోర్
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా సమస్యలను విస్తతంగా పరిష్కరించడానికి వార్డు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు. ప్రతిరోజూ సోషల్ మీడియా, వాట్సప్, హెల్ప్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా అందు తున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలోనే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తా మని తెలిపారు. వాటర్ వర్క్స్ నగరానికి వందేండ్లకు సరిపడా తాగునీటి వసతి, వంద శాతం సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వార్డు అధికారులు ప్రజలతో సామరస్యంగా ఉండి కలిసికట్టుగా పని చేయాలని జలమండలి అధికారులకు, సిబ్బందికి దానకిషోర్ ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ప్రియాంక అలా, ఈఎన్‌సీ జియా ఉద్దీన్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, సీసీపీ దేవేందర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్‌లు వి.కృష్ణ, జయరాజ్ కెన్నెడీ సరోజ, జోనల్ కమిషన ర్లు మమత, రవి కిరణ్, పంకజ, శంకరయ్య, శ్రీనివాస్‌రెడ్డి, అశోక్ సామ్రాట్, ఆస్కీ ప్రొఫెసర్ స్నేహలత, ప్రాజెక్ట్ ఆఫీసర్ సౌజన్య, డిప్యూటీ కమిషనర్లు, వార్డు పరిపాలన అధికారులు, జలమండలి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.