– వేలాది ఎకరాల వరి పంటలను కాపాడాలి
– మంత్రి ఇచ్చిన హామీలను నిలుపుకోవాలి
– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్
నవతెలంగాణ- కూసుమంచి
పాలేరు జలాశయం నుండి పాత కాలువకు నీటిని వెంటనే విడుదల చేసి, పాలేరు పాత కాలువ ఆయకట్టు పరిధిలోని వేలాది ఎకరాల వరి పంటలను కాపాడాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలుపుకొని, రైతాంగాన్ని కాపాడాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని పాలేరు పాత కాలువ పరిధిలోని ఆయకట్టు రైతులను ఆయన కలిశారు. అనంతరం మండలంలోని మల్లేపల్లి, జక్కేపల్లి, పెరకసింగారం తదితర గ్రామాలలో రైతులతో కలిసి నీరు లేక ఎండిపోయిన వరి పొలాలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా పెరకసింగారం గ్రామంలో ఆయన మాట్లాడుతూ… నేడు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఈ నష్టంతో పాటు చేతికి వచ్చిన వరి పంట పొలాలు నీళ్లు లేక ఎండిపోవడంతో రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుందన్నారు. దీంతో రైతులు మనోవేదనకు గురై, ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పాలేరు జలాశయానికి ఎస్సారెస్పీ నీళ్లను తరలించి, ఆ నీటితో పాలేరు జలాశయం నుండి పాలేరు పాత కాలువకు నీటిని విడుదల చేసి, పాత కాల్వ పరిధిలోని వేలాది ఎకరాల రైతులు పంటను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి ఎకరా పంటకు ఇప్పటికే 20 నుంచి 25 వేల రూపాయల పెట్టుబడులు అయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఒక తడి నీళ్లు వస్తే తమ పంటలను కాపాడుకుంటామని రైతును మొరపెడుతున్నారని, రైతే రాజు అనే విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తుంచుకొని, తక్షణమే కాలువ ద్వారా నీటిని విడుదల చేసి రైతాంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు మల్లెల సన్మతరావు, యడవల్లి రమణారెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు తోటకూరి రాజు, బిక్కసాని గంగాధర్, ముకుందరెడ్డి, మాధవరావు, ఉపేందర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మూడు గన్యా నాయక్, మండల నాయకులు కర్ణబాబు, ఆయా గ్రామాల పరిధిలోని సర్పంచులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.