మేం కామ్రేడ్‌లం

మేం కామ్రేడ్‌లంకలసి పనిచేస్తాం
కానీ లొంగి పనిచేయం
మేం కామ్రేడ్‌లం
వర్గ సంఘర్షణలో మేం
ఎంతకైనా తెగిస్తాం
విముక్తి సమరంలో
మేం అంతమైనా సరే…
మా పంతం శ్రామిక రాజ్యం
నెగ్గించుకుంటాం

భగత్‌సింగ్‌ బాటే
మా దిక్సూచి ఎప్పుడైనా…
నరహంతక హిట్లర్‌లను
మట్టుపెడతాం
ఎక్కడైనా ఏనాటికైనా

ఈ ప్రపంచం
ముమ్మాటికీ మాదే మాదే మాదే
మేం కష్టజీవులం
కామ్రేడ్‌లం

మాకు హద్దుల్లేవ్‌
సరిహద్దుల్లేవ్‌
ఎక్కడికైనా వెళ్తాం
పీడితులకండగా నిలుస్తాం
మనుషులంతా ఒక్కటే
చేగువేరా వారసులం
మేం కామ్రేడ్‌లం

మతాల అజ్ఞానం
మా కనవసరం
కులాల అడ్డుగోడలు
మాకెందుకు దండగ

బతుకును ప్రేమిస్తాం
భవితను ప్రేమిస్తాం
సమతను సాధిస్తాం
శాంతిని ఆరాధిస్తాం
దోపిడీని అంతం చేస్తాం
ఇదే మా శపథం
మేం కామ్రేడ్‌లం

యుగాలు మారతాయి
తరాలు మారతాయి
మనిషిని బానిసగా మార్చే
కుట్రలను కూకటివేళ్లతో సహా
పెకిలిస్తాం
మేం కామ్రేడ్‌లం

మనిషికోసం
మనిషిగా జీవిస్తాం
ఉద్యమాల ఊపిరౌతాం
అవనంతా జేగంటలు
మ్రోగిస్తాం
కామ్రేడ్‌ లెనిన్‌
గుండె చప్పుళ్లం
మేం కామ్రేడ్‌లం
(లెనిన్‌ శత వర్థంతి సందర్భంగా)
– కె.శాంతారావు, 9959745723

Spread the love