– టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో దశాబ్ది ఉత్సవాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంస్థ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవరం రఘుమా రెడ్డి కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని గుర్తుచేసుకున్నారు. గడచిన తొమ్మిది ఏండ్లలో విద్యుత్‌రంగంలో సంస్థ సాధించిన విజయాలను వివరించారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తూ, రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవల్ని అందిస్తున్నామన్నారు.
ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల్ని బలోపేతం చేసుకున్నామన్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన సేవల్ని అందిస్తూ ఉద్యోగులు తెలంగాణ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి శ్రీనివాస్, జె శ్రీనివాస్‌రెడ్డి, కె రాములు, జి పర్వతం, సీహెచ్ మదన్ మోహన్‌రావు, ఎస్ స్వామిరెడ్డి, పి నరసింహరావు, జి గోపాల్ తదితరులు పాల్గొని, అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.