బాన్సువాడ ప్రజలతో మాకు పేగు బంధం

 – స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి 
నవతెలంగాణ- నసురుల్లాబాద్: బాన్సువాడ నియోజకవర్గంలో 45 ఎండ్లు రాజకీయంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ప్రజలది తమది అధికార బంధం కాదని, పేగు బంధం ఉందని అధికారం శాశ్వతం కాదు. బంధమే శాశ్వతం అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
 అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని కొనాపూర్, హన్మజి పెట్, సాంగోజి పెట్, తడ్కోల్ , కొత్తబాది, తీర్మాల పూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాన్సువాడ మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కు వివిధ గ్రామాల కార్యకర్తలు ఓటర్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు నా కుటుంబ సభ్యులకన్నా ఎక్కువగా చూసుకుంటానన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు వచ్చేలా చూశానన్నా. నియోజకవర్గ ప్రజల బంధం పేగు బంధం లాంటిదన్నారు. ఎవరు ఎన్ని లాజిక్కులు చేసినా నియోజవర్గ ప్రజల బంధాన్ని ఎవరు విడదీయలేదన్నారు. కాంగ్రెస్‌కు అభివృద్ధి సంక్షేమం చేసే గుణం లేదని, అధికార కాంక్ష మాత్రమే ఉందని, ఎన్నికల సమయంలో మాత్రమే ఆ పార్టీకి ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు. అది చేస్తాం, ఇది ఇస్తాం.’ అని ఝూటా మాటలు చెప్పి పోతారని, ప్రజలకు ఏమీ చేయరని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు గతంలో యాభై ఐదేండ్లు అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. వారి హయాంలో పింఛన్‌ 200మాత్రమే ఇచ్చారన్నారు. కొత్త పింఛన్‌ కావాలంటే పాత పింఛన్‌దారుడు ఒకరు పోతే ఇచ్చేటువంటి దుస్థితి, దుఃఖం ఉండేడిదని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పాలనలో రైతులకు పైసా కూడా ఇవ్వలేదన్నారు. నేటి బీఆర్‌ఎస్‌ పాలనలో హనుమంతుని గుడి లేని ఊరు లేదని, సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని చెప్పారు. రాష్ట్రంలో మరోసారి కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్‌ను 5వేలకు పెంచుకుంటాని, ఎన్నికల పూర్తయిన వెంటనే రూ.3వేలు అవుతుందని, తర్వాత ఏటేటా 500 పెంచుతూ 5వేలు చేస్తామన్నారు. కటాఫ్‌ డేట్‌తో సంబంధం లేకుండా, పీఎఫ్‌ కార్డు ఉన్నాలేకున్నా బీడీ కార్మికులందరికీ 5వేల పెన్షన్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకం కింద పేద మహిళలకు 3వేల పింఛన్‌ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మూడోసారి అధికారంలోకి రాగానే కొత్త రేషన్‌ కార్డులు జారీ చేస్తామని, దాంతో రాష్ట్రంలో రేషన్‌ కార్డులు కోటికి చేరుతాయన్నారు. కేసీఆర్‌ మ్యానిఫెస్టో అంటే అన్ని వర్గాలకు భరోసా అని, కేసీఆర్‌ బీమా కింద ప్రతి ఒక్కరికి 5లక్షల బీమా వర్తింపజేస్తామని చెప్పారు. రేషన్‌ కార్డు మీద సన్నబియ్యం సరాఫరా చేస్తామన్నారు. కేసీఆర్‌ ఆరోగ్య రక్ష పథకం కింద 15లక్షల ఆరోగ్య బీమా పరిమితిని పెంచుతామన్నారు. అలాగే అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒక హాస్టల్‌ నిర్మిస్తామన్నారు. ఇంకా సొంత స్థలం ఉన్నపేదవారికి ఇండ్లు కట్టుకోవడానికి గృహలక్ష్మి పథకం 3లక్షల అందజేస్తున్నామని, నియోజకవర్గంలో ఇప్పటికే 14వేల మందికి ఇచ్చినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ఇళ్లు లేని ప్రతి కుటుంబానికి ఇండ్లు కట్టడమో..? డబ్బులు ఇవ్వడమో చేస్తామన్నారు. వచ్చే రానున్న ఎన్నికల్లో యువత ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Spread the love