మతోన్మాద, ఆధిపత్యభావాలపై యుద్ధం చేయాలి

War should be fought against bigotry and supremacy– ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి : నవతెలంగాణ 8వ వార్షికోత్సవంలో తమ్మినేని
– మానవవాదాన్ని సృష్టించాలి : దేవరాజు మహరాజు
– నిజాలను నిర్భయంగా చెప్పాలి : తెలకపల్లి రవి
– పత్రికా, మీడియా వ్యాపారమయమైంది : సీజీఎం ప్రభాకర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ప్రస్తుతం పెట్టుబడిదారీ సమాజం వేగంగా విస్తరిస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది వ్యక్తుల వద్ద విపరీతమైన సంపద పోగవుతున్నదనీ, దాని చుట్టే వ్యవస్థలు తిరుగుతున్నాయని చెప్పారు. అందుకే పెట్టుబడిదారీ సమాజంలో ప్రతిదీ సరుకుగా మారుతూ…చివరకు అనుబంధాలు, బంధాలు, కుటుంబం వ్యవస్థ, స్నేహాలు సమస్తం ‘సరుకీకరణ’గా రూపాంతం చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు మతోన్మాద, అధిపత్య భావాల వంటి తిరోగమన భావజాలం అన్ని రంగాల్లోకి వ్యాప్తి చెందుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వ్యవస్థలోని లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపాలనీ కోరారు. ఆ వ్యవస్థ తన బలహీనతల వల్ల చరమాంకంలోకి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం పెరుగుతున్నదనీ, ఆ వ్యవస్థపై తిరుగుబాట్లు, పోరాటాలు పెరుగుతున్నాయని చెప్పారు. అందుకు తగినట్టుగా మన కృషి కూడా పెరగాలని సూచించారు. మతోన్మాద, అధిపత్య భావజాలానికి వ్యతిరేకరంగా ప్రత్యామ్నాయ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన కర్తవ్యం నవతెలంగాణపై ఉందని నొక్కి చెప్పారు. మంగళవారం హైద రాబాద్‌లోని ఎంహె చ్‌ భవన్‌లో ‘నవ తెలంగాణ 8వ వార్సికోత్సవ సభలో ఆయన మాట్లాడారు. సంస్కృతి, సంప్ర దాయాలు, సినిమాలు, కథలు, కళల్లోకి కూడా మతోన్మాద భావజలం ప్రమాదకరంగా తొంగి చూస్తు న్నదని తెలిపారు. అటువంటి అంశాలను శోధించి బయటకు తీసి ఎండగట్టాలని కోరారు.
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్‌ పడిపోతున్నదని తమ్మినేని ఈ సందర్భంగా చెెప్పారు. ఆ పార్టీ నేతలు ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారని వివరించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంటుందని అభిప్రాయ పడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పోరా డుతున్నదని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఉన్నా… అంత వాంఛ నీయంగా లేద న్నారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న పార్టీలేవీ ఆ పార్టీ లోటు పాట్లను ప్రశ్నిం చడం లేద న్నారు. కమలం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా మతోన్మాదానికి వ్యతి రేకంగా నిలబడ్డా యనుకుంటే పొరపాటేనన్నారు. తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా మాత్రమే అవి వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ తిరోగమన చర్యల్ని, దుర్మార్గాలను అడ్డుకునేందుకు వచ్చే ఎన్నికల్లో ఆపార్టీని ఓడించాలని కోరారు.
నవతెలంగాణ మొఫిిషిల్‌ రాష్ట్ర ఇన్‌చార్జి గుత్తా వేణుమాధవరావు అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం నవతెలంగాణ కాలమిస్టులు ఎం కోటేశ్వరరావు, ఉషాకిరణ్‌, బోడపట్ల రవీందర్‌, సుధామ, పి జ్యోతి, కూర చిదంబరం, పొన్నం రవిచంద్ర తదితరులకు శాలువా కప్పి, మోమెంటో ఇచ్చి సత్కరించారు. కార్యక్రమంలో నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ ఎడిటర్‌ కె ఆనందాచారి, ఇన్‌చార్జి ఎడిటర్‌ రాంపల్లి రమేష్‌, 10టీవీ మాజీ ఎండీ కె వేణుగోపాల్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మానవవాదాన్ని సృష్టించాలి దేవరాజు మహరాజు
మతోన్మాదం, ఆధిపత్యం భావజాలాన్ని వ్యతిరేకిస్తూ… మానవవాదాన్ని సృష్టించా లని జీవశాస్త్రవేత్త డాక్టర్‌ దేవరాజు మహరాజు ఆకాంక్షించారు. అందుకే నవతెలంగాణలో మానవవాదం, మానవత్వాన్ని పాఠకులకు అందించే ప్రయత్నం చేస్తున్నదని ఈ సందర్భంగా చెప్పారు. ఆ వాదాన్ని పక్కన పెట్టిన మిగతా వాదాలపై చర్చించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సైంటిఫిక్‌ టెంపర్‌కు సంబంధించిన అంశాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటర్నెట్‌, ఫోరోగ్రామ్‌, ఆర్టీఫిషీయల్‌ ఇంటెలిజెన్నీ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ఈ సమాజాన్ని మూడువేల ఏండ్ల వెనక్కితీసుకపోతామంటే ఊరుకునే సమస్యేలేదన్నారు. తిరోగమన శక్తులపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు.
పత్రికా,మీడియా వ్యాపారమయమైంది : పి ప్రభాకర్‌
కొందరు మీడియాను అడ్డంపెట్టుకుని ఆస్తులు, పదవులు అనుభవిస్తున్నారనీ, వ్యాపారంగా మార్చేశారని సభకు అధ్యక్షతన వహించిన నవతెలంగాణ సీజీఎం పి ప్రభాకర్‌ చెప్పారు. తమకు ఇష్టమైన పార్టీలను అధికారంలోకి తెచ్చుకు నేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పేదలు, కార్మికులు, రైతులు, మధ్యతరగతి వర్గాల సమస్యలపై ‘నవతెలంగాణ’లో నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్నామని తెలిపారు. ఎన్నో నిర్భంధాలతోపాటు కరోనాను సైతం ఎదుర్కొని పత్రిక నిలబడిందని గుర్తు చేశారు. నవతెలంగాణ కోసం స్వచ్ఛం ధంగా ఎంతో మంది కాల మిస్టులు, రచయితలు, కవులు రాస్తున్నారనీ వారితోపాటు సిద్ధాంతాలు, రాజకీయ నిబద్ధతతో పని చేస్తున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు.
నిజాలను నిర్భయంగా చెప్పాలి : తెలకపల్లి రవి
మతోన్మాద భావజాలంపై నిజాలను నిర్భయంగా రాయాలని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రజాశక్తి మాజీ సంపాదకులు తెలకపల్లి రవి సూచించారు. దానిపై విస్తృతమైన ఉద్యమాలు సాగించాలన్నారు. ఆశయాలకనుగుణంగా పని చేయాలని సూచించారు. ఎన్నో బాలారిష్టాలను అధిగమించి పత్రిక ముందుకు సాగుతున్నదని తెలిపారు. అధిపత్యాన్ని ప్రశ్నించడంతోపాటు ప్రజల గొంతుకగా ఉండాలన్నారు. అందుకు నిబద్ధతతోపాటు నిపుణత కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Spread the love