స్వచ్ఛమైన తెలంగాణ కావాలి

– విలువలతో కూడిన విద్యను అందించాలి
– నిరాశలో యువకులు
– హర్యానా గవర్నర్‌ బండార్‌ దత్తాత్రేయ
నవతెలంగాణ-భువనగిరి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం శుద్ధి చేయబడిన స్వచ్ఛమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని, అందుకోసం ఉద్యమకారులు మరోసారి ఉద్యమాలకు సిద్ధం కావాలని హర్యానా రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు.ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలోని తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత ప్రాంగణంలో ఆలరు-బలరు మాట, ఆట, పాట, ముచ్చట పేరుతో తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకష్ణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా చేయడానికి కషి చేయాలన్నారు.సమస్యలను వెలికితీసి యువతకు వివరించి వారిని చైతన్యం చేయాలన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్క వ్యక్తితో రాలేదని అమరవీరుల రక్తంతో ఉద్యమకారుల ఆటపాటతో వచ్చిందన్నారు. సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి సూచనల మేరకు తెలంగాణ ఉద్యమం లో అందరు పాల్పంచుకునేందుకు అలరు -బలరు కార్యక్రమం చేపట్టామన్నారు.వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలకతీతంగా కదలి వచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమం 1950లో ప్రారంభమైందని 1997లో వేదిక ఏర్పడదని 2004లో మలిదశ ఉద్యమం ఏర్పడిందన్నారు. ప్రత్యేక తెలంగాణలో యువతలో ఉద్యోగాలు రాక నిరాశాతో ఉన్నారన్నారు.మహిళలు సమాన హక్కులు పొందడం లేదన్నారు.ఆర్థిక స్వావలంబన జరగడం లేదన్నారు.అందరికీ స్వచ్ఛమైన తెలంగాణ ద్వారా తెలంగాణ ఫలాలు అందించాలన్నారు.బడుగు బలహీనవర్గాలకు విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. స్వచ్ఛందసంస్థలు, మేధావులు తెలంగాణ రాష్ట్ర అభివద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మాట కంటే పాట బాగా పనిచేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కెసిఆర్‌ పాటను ఉద్యోగులగా ఎరవేసి పాటనే బంద్‌ చేయించారన్నారని విమర్శించారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడ మల్లన్న అన్న చందంగా కెేసీఆర్‌ అసలు రూపం బయటపడిందన్నారు.మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ ఉద్యమాలు ధూమ్‌ దాం కార్యక్రమంతో ప్రజలలో చైతన్యం తీసుకొచ్చిందన్నారు.సాయిధరైతాంగ పోరాటానికు చైతన్యం అందించింది పాటలేనన్నారు.కేసీఆర్‌ పాలనలో రైతులకు ఎలాంటి మంచి జరగలేదన్నారు. కేసీఆర్‌ అన్యాయాలపై మరో ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య, సీనియర్‌ పాత్రికేయులు పాశం యాదగిరిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి తెలంగాణ ఉద్యమకారులతోపాటు నలుగురు ప్రముఖ మహిళలు తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ, బీజేపీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌, రాజ్యసభ స్పీకర్‌ మీరా కుమారి పాత్ర ఉందన్నారు.భువనగిరిలో అమరవీరుల చిత్రపటాలతో స్మతివనాన్ని ఏర్పాటు చేయాలన్నారు.చీమలుపెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్లు తెలంగాణ సబ్బండవర్గాలు నిర్మించిన ఉద్యమంలోకి కేసీఆర్‌ వచ్చాడన్నారు. దొరల పాలన కొనసాగిస్తున్నాడన్నారు.చలి చీమలు సైతం విష సర్పాన్ని చంపేసిన విషయం కేసీఆర్‌ మర్చిపోయాడని,కేసీఆర్‌ను గద్దె దించడానికి సబ్బండ వర్గాలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలన్నారు.రాష్ట్రంలో నరహంతక నయీమ్‌ మతి చెందినప్పటికీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నయీం ఆశయాలను ముందుకు తీసుకుపోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హోంమంత్రి మాధవరెడ్డిని బెదిరించి తెలంగాణ ఉద్యమకారులను చంపేటట్లు చేశాడని ఆరోపించారు.కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌, బండ్రు శోభారాణిలు మాట్లాడుతూ స్వరాష్ట్ర ప్రజలు ఆశించిన కలలు కలగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తపరిచారు.తెలంగాణ కోసం ఉద్యమం చేశామని కెేసీఆర్‌ నాయకత్వంలో దొరల గడీల తలుపులు తెరిచారని విమర్శించారు.తెలంగాణ సంపదను దోచుకుని దేశంలో తిరుగుతున్నాడన్నారు.అమరవీరుల కుటుంబాలు కూటికి లేక పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజా గాయకుడు ఏపూరి సోమన్నబందం పాడిన పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌ నగేష్‌, రాణి రుద్రమదేవి, బట్టు రామచంద్రయ్య, భువనగిరి శ్రీనివాస్‌, బెల్లి చంద్రశేఖర్‌, జగన్మోహన్‌రెడ్డి, పొటోళ్ల శ్యామ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Spread the love