అసెంబ్లీలో నిరుద్యోగుల తరుపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం

– రాహుల్‌ గాంధీ హామీ ఏమైంది..?
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు
నవతెలంగాణ-బేగంపేట్‌
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అసెంబ్లీని స్తంభింపచేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులతో చర్చలు జరపాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో నిరుద్యోగ సమస్యలపై దీక్ష చేస్తున్న మోతీలాల్‌ నాయక్‌ను ఆయన పరామర్శించారు. దీక్ష విరమించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతీలాల్‌ నాయక్‌తో మాట్లాడాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా నిరుద్యోగులు తరఫున బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని తెలిపారు. మోతీలాల్‌ను దీక్ష విరమించాలని కోరగా.. ఇది తన ఒక్కడి పోరాటం కాదని, రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నానని, ప్రభుత్వం దిగివచ్చేదాకా దీక్ష విరమించబోనని చెప్పారని తెలిపారు. మోతీలాల్‌కు ఏం జరగకముందే ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. పిల్లల హక్కుల పట్ల ప్రొ||కోదండరాం పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. మోతీలాల్‌ నాయక్‌ ఏడు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కపట ప్రేమ చూపెట్టి నిరుద్యోగులను వాడుకొని వదిలిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ది ఓడదాటే దాకా ఓడ మల్లన్న ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్నలా వ్వవహారం ఉందన్నారు. ఆనాడు నిరుద్యోగుల కోసం ప్రొఫెసర్‌ కోదండరాం, రియాజ్‌, బాల్మ్యురి వెంకట్‌, మురళి, రేవంత్‌ రెడ్డి అశోక్‌ నగర్‌లో కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరిగారని, రాహుల్‌ గాంధీని అశోక్‌ నగర్‌కు తీసుకువచ్చి ప్రమాణాలు చేయించారన్నారు. అయితే మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయి కానీ నిరుద్యోగులకు రాలేదన్నారు. ఇప్పుడు ఎందుకు మీ గొంతులు మూగబోయాయని ప్రశ్నించారు.
రాహుల్‌ గాంధీ రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని.. ఏడు నెలలైనా ఎందుకు జాబ్‌ నోటిఫికేషన్లు ఇవ్వలేదని నిలదీశారు. జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని, గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు ఆంధ్రప్రదేశ్‌లో 1:100 పిలుస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యంకాదని ప్రశ్నించారు. నిరుద్యోగులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే పోరాటాలు చేస్తుంటే ఎందుకు రాహుల్‌ గాంధీ పట్టించుకోరో చెప్పాలన్నారు. గ్రూప్‌-2, 3 ఉద్యోగాల సంఖ్య పెంచాలని డిమాండ్‌ చేశారు. జీవో 46 రద్దు చేస్తామని ఎందుకు చేయడం లేదని, మెగా డీఎస్సీ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ప్రొఫెసర్‌ కోదండరాం ఇదే నిరుద్యోగులను రెచ్చగొట్టారని.. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. నిరుద్యోగులు యువకులు సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని.. ఇదేనా ప్రజాపాలన అని నిలదీశారు. నిరుద్యోగుల డిమాండ్‌లను పరిష్కరించకుంటే నిరుద్యోగుల తరఫున మరో పోరాటానికి బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతుందని హెచ్చరించారు.

Spread the love