రాజస్థాన్‌ను దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతాం

We will make Rajasthan number one in the country– ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గెహ్లాట్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాజస్థాన్‌ను దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ అన్నారు. భౌగోళిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ, రాజస్థాన్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ”మిషన్‌-2030”ని ప్రారంభించిందనీ, ఇది రాజస్థాన్‌ పురోగతిని పదిరెట్లు వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ ప్రణాళిక తమ కలల రాజస్థాన్‌గా మార్చడానికి రూపొందించబడిందని గుర్తు చేశారు. ఈ చొరవలో భాగంగా, ఒక సమగ్ర ”విజన్‌-2030” పత్రం తయారు చేయబడుతున్నదనీ, రెండు కోట్ల మంది ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామన్నారు. అశోక్‌ గెహ్లాట్‌ సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని వలస రాజస్థానీ కమ్యూనిటీ, పారిశ్రామికవేత్తలు, ఇతర వాటాదారులతో మారియట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన సమావేశం సామూహిక చర్చల్లో పాల్గొన్నారు. రాజస్థాన్‌ అభివృద్ధి, భవిష్యత్తు గమనాన్ని నిర్దేశించే లక్ష్యంతో రాబోయే విజన్‌-2030 డాక్యుమెంట్‌ కోసం విలువైన సూచనలను ఆహ్వానితుల నుంచి స్వీకరించారు. రాష్ట్ర ప్రగతి పయనంలో వలస వచ్చిన రాజస్థానీయులు ఆన్‌లైన్‌ , ఇతర మార్గాల ద్వారా వీలైనంత ఎక్కువ మంది తమ సూచనలను అందించాలని విజ్ఞప్తి చేశారు. దేశాభివద్ధికి రాజస్థాన్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు చేస్తున్న గణనీయమైన కషిని గుర్తించారు. జీడీ బిర్లా, జమ్నాలాల్‌ బజాజ్‌ తదితర ప్రముఖ వలస రాజస్థానీయులు మహాత్మాగాంధీతో పాటు స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్రలు పోషించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి గెహ్లాట్‌ తన మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజస్థాన్‌ ఫౌండేషన్‌ స్థాపనను హైలైట్‌ చేశామన్నారు. ఇది వలస రాజస్థానీలు రాజస్థాన్‌ మధ్య బంధాన్ని బలోపేతం చేసిందని గుర్తుచేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి, రాజస్థాన్‌ జీడీపీ రూ. 15 లక్షల కోట్లకు చేరుతుందనీ, 2030 నాటికి రూ. 30 లక్షల కోట్లను అధిగమించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 1.50 లక్షల కిలోమీటర్ల రహదారుల నిర్మాణంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్‌ పౌండేషన్‌ చైర్మెన్‌ ధీరజ్‌ శ్రీవాస్తవ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Spread the love