పవరేంటో చూపిస్తాం…

Let's show the power...– అధికార, ప్రతిపక్షాల సవాళ్లు…
– నేటి అసెంబ్లీలో ఆర్థిక స్థితిగతులపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌
– సీఎం, డిప్యూటీ సీఎంల్లో ఎవరో ఒకరు ఇచ్చే అవకాశం
– తమకూ అవకాశమివ్వాలంటూ బీఆర్‌ఎస్‌ పట్టు- స్పీకర్‌కు లేఖ
– తొలుత సంతాప ప్రతిపాదనలు
– అనంతరం ‘రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు-శ్వేతపత్రం’పై లఘు చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదేండ్ల పాటు పవర్‌(అధికారం)లో ఉండి తాజా ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ ఒకటి.. ఇటీవల ఎలక్షన్లలో గెలుపు జెండా ఎగరేసిన పార్టీ మరోటి… ఆ రెండూ శాసనసభా వేదికగా సమరానికి మరోమారు సిద్ధమవుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శనివారం సభ హీటెక్కిన సంగతి విదితమే. మూడు రోజుల విరామానంతరం బుధవారం నుంచి నిర్వహించబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తామంటూ అధికార కాంగ్రెస్‌ ప్రకటించింది. తద్వారా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ చేసిన దుబారా, నిధుల దుర్వినియోగాన్ని ఎత్తి చూపుతామంటూ సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అదే తరహాలో తమకూ సభలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చేందుకు అనుమతినివ్వాలంటూ ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పట్టుబడుతోంది. తాము పదేండ్లలో వివిధ రంగాల్లో పెట్టిన పెట్టుబడులు, పెంచిన సంపద, వివిధ వర్గాలకు ఆయా ఫలాలను అందించిన విధానాన్ని వివరిస్తా మంటూ ఆ పార్టీ కోరుతోంది. ఆ మేరకు తమకు అవకాశమివ్వాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ప్రధాన ప్రతిపక్షం లేఖ రాసింది. ‘గత బీఆర్‌ఎస్‌ హయాంలో మా పార్టీకి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని కోరితే ఇవ్వలేదు. అందువల్ల ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు ఆ అవకాశం ఇవ్వలేం…’ అంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం నాటి సభ మరింత రసకందాయంగా మారనుంది. ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజంటేషన్‌ ఇచ్చే అవకాశముంది. ఆయన కాకపోతే ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు రామన్నగారి శ్రీనివాసరెడ్డి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, కుంజా సత్యవతికి సభ సంతాపాన్ని ప్రకటించనుంది. అనంతరం ‘తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు-శ్వేతపత్రం’ అనే అంశంపై స్పీకర్‌ లఘు చర్చను ప్రారంభిస్తారని శాసనసభ కార్యక్రమాల పట్టికలో పేర్కొన్నారు.

 

Spread the love