జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో
మంత్రి తుమ్మల
పీపుల్స్ ప్లాజాలో చేనేత స్టాళ్లను పరిశీలన
కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత
పురస్కార గ్రహీతలకు సత్కారం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అన్నం పెట్టే రైతన్న, వస్ర్తం అందించే నేతలన్నలకు అండగా నిలిచే ప్రభుత్వం మాదనీ, ఆ రెండు శాఖలకు ఒకేసారి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు అని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో వేడుకలు నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కారాలకు ఎంపికైన చేనేత కళాకారులను ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నైపుణ్యమైన చేనేత కళాకారులు ఏర్పాటు చేసిన 100కు పైగా స్టాల్స్‌ను సందర్శించి, వారి చేతి పనితనం, సంప్రదాయ నైపుణ్యం, ఆధునిక డిజైన్ల సమన్వయంతో రూపొందించిన వస్త్రాలను పరిశీలించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీతలు రూపొందించిన ప్రత్యేక చేనేత ఉత్పత్తులను ఆసక్తిగా వీక్షించి, వారి ప్రతిభను అభినందించారు. ఈ ప్రదర్శన ఆగస్టు 7 నుంచి 16 వరకు కొనసాగుతుందని, ప్రజలు పెద్ద ఎత్తున సందర్శించి చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలను ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. చేనేత అనేది కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వానికి ప్రతీక అని కొనియాడారు. హస్తకళను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గద్వాల చీరలు, పోచంపల్లి ఇక్కత్, నారాయణపేట వస్త్రాలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, వరంగల్ దర్రీస్, కరీంనగర్ బెడ్‌షీట్లు వంటి ఉత్పత్తులు తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయని వివరించారు. చేనేత కార్మికుల జియో ట్యాగింగ్‌లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) ద్వారా యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందిస్తూ చేనేత రంగానికి కొత్త తరాన్ని సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఆ సంస్థలో విద్యనభ్యసించిన వగ్గు శ్రీరామ్ రూపొందించిన ఎర్గోనామిక్ బ్యాక్ సపోర్ట్ సిస్టమ్ జాతీయ స్థాయిలో తొలి బహుమతి సాధించడం తెలంగాణ చేనేత శిక్షణా వ్యవస్థ ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న చేనేత సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించి ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించామని గుర్తుచేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) మాట్లాడుతూ…మనిషికి నాగరికత నేర్పింది నేతన్నలేనన్నారు. చేనేత కేవలం ఒక వృత్తి కాదని, అది మన సంస్కృతికి ప్రతీక, సంప్రదాయానికి చిరునామా అని కొనియాడారు. ఏటా కోట్ల రూపాయల విలువైన ఇందిరమ్మ చీరల ఆర్డర్లను చేనేత కార్మికులకు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్‌లకు అవసరమైన వస్త్రాన్ని కూడా చేనేత కార్మికుల నుంచే కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. గతంలో పేరుకుపోయిన నేతన్నల బకాయిలను కూడా తమ ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తోందని చెప్పారు. చేనేత రంగం అభివృద్ధి, సంక్షేమం కోసం ఇప్పటికే సుమారు రూ.1,300 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చించిందని తెలిపారు. వారం లో కనీసం రెండు రోజులైనా చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను కూడా చేనేత దుస్తులు ధరించడానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. కార్యక్రమంలో జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, టెస్కో అధికారులు, చేనేత రంగ ప్రముఖులు, అవార్డు గ్రహీతలు, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.
నేతన్న, రైతన్నలకు అండగా ఉంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



