అన్నింట్లోనూ గెలుస్తాం

We will win everything– మేం దేశం కోసం పోరాడుతున్నాం
– అందుకే ప్రతిపక్ష కూటమికి ఇండియా అని పేరుపెట్టాం
– బీజేపీ ఎత్తుగడలు సాగనీయం : కాంగ్రెస్‌ నేత రాహుల్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఈ ఏడాది చివర్లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు చెప్పాల్సి వస్తే, తెలంగాణలో గెలిచే అవకాశం ఉందని, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో తప్పనిసరిగా గెలుస్తామని, రాజస్థాన్‌లోనూ గెలుపునకు చాలా దగ్గర్లో ఉన్నామని అన్నారు. పార్టీ విజయం సాధిస్తుందని విశ్వసిస్తోందన్నారు. తెలంగాణలోబీజేపీ రేసులో కూడా లేదని, దాని పని అయిపోయిందని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ పూర్తిగా బలహీనపడిందని అన్నారు. ఆదివారం అసోంలోని ప్రతిదిన్‌ మీడియా నెట్‌వర్క్‌ నిర్వహించిన కన్‌క్లేవ్‌లో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం, కాంగ్రెస్‌ పార్టీ తమ వాదనను చెప్పుకునే అవకాశం ఇవ్వకపోవడంతోనే బీజేపీ గెలుస్తూ వచ్చిందని అన్నారు. కర్నాటక ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయాన్ని గ్రహించిందని చెప్పారు. ప్రజలతో నేరుగా మమేకం కావడానికే తాము భారత్‌ జోడో యాత్ర చేపట్టాల్సి వచ్చిందని, యాత్రను తప్పుదారి పట్టించాలని జాతీయ మీడియా, బీజేపీ ప్రయత్నం చేసినప్పటకీ వారి ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. బీఎస్‌పీ ఎంపీపై దాడి వెనుక పక్కా వ్యూహం.. కులగణన ఆలోచన నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఎంపీ రమేష్‌ బిధూడీ లోక్‌సభలో బీఎస్‌పీ ఎంపీ దానిష్‌ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఇది బీజేపీ వ్యూహంలో భాగమేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. బిధూడి, నిశికాంత్‌ దూబే చేసిన ప్రయత్నాలను సభలో అంతా గమనించారని చెప్పారు. తన యూట్యూబ్‌ ఛానెల్‌, తన ట్విటర్‌ అన్నీ అణిచివేయబడ్డాయని చాలా స్పష్టంగా అర్థమైందని, ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా జాతీయ మీడియాలో వక్రీకరణ లేకుండా సాగదని అన్నారు.
‘ఒక దేశం…ఒకే ఎన్నిక’ ఎత్తుగడ కూడా ఇదే..
దేశంలో ప్రధానమైన అంశాలు అనేకం ఉన్నాయని, ఆరోగ్యం, సంపదలో భారీ అసమానత, ధరలు పెరుగుదల, తీవ్రమైన నిరుద్యోగం, ఓబీసీలు, గిరిజన తెగలను పట్టించుకోకపోవడం అనే పలు అంశాలపై బీజేపీ ఎలాంటి పట్టింపులేకుండా ఉందని చెప్పారు. ఈ సమస్యలన్నీ పక్కనపెట్టి ‘ఒకదేశం.. ఒకే ఎన్నిక(జమిలి)’ అనే అంశాన్ని లెవనెత్తడం వెనుక బీజేపీ ఉద్దేశాలు తాము గ్రహించగలమని అన్నారు. అయితే బీజేపీ ఎత్తుగడలు సాగనీయమని తెలిపారు. ‘జమిలి ఎన్నికలు జరుపుదాం. భారతదేశం పేరు మారుద్దాం’ ఇదంతా బీజేపీ కుట్రలో భాగమేనని విమర్శించారు.
ఆర్థిక దాడులు
తమపై (కాంగ్రెస్‌ పార్టీ) ఆర్థిక దాడులు జరిపించారని రాహుల్‌ ఆరోపించారు. ”ఇవాళ దేశంలోని ఏ వ్యాపారవేత్తనైనా అడగండి. ఒక ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్‌ చేస్తే వారికి ఏం జరిగిందో తెలుసుకోండి. ప్రతిపక్ష పార్టీకి ఒక చెక్‌ ఇవ్వాలని వారనుకుంటే ఏం జరిగిందో తెలుస్తుంది. మాపై ఆర్థిక దాడులు జరిగాయి. మీడియా దాడులు జరిగాయి. మేం ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా పోరాటం చేయడం లేదు. దేశం కోసం, ఐడియా ఆఫ్‌ ఇండియా (భారతదేశం ఆలోచన) కోసం పోరాడుతున్నాం. అందుకోసమే ప్రతిపక్ష కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టాం” అని రాహుల్‌ తెలిపారు. మాతో 60 శాతం జనాభా ఉన్నారని, ప్రతిపక్షాలు కలిసి పని చేస్తున్నాయని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఇండియా కూటమి ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఆయన అన్నారు.

Spread the love