– సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్
– సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
నవతెలంగాణ-సత్తుపల్లి
ప్రజలకు సంక్షేమాభివృద్ధి పథకాలను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. శుక్రవారం స్థానిక ద్వారకాపురిలోని ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయంలో సత్తుపల్లి పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్), కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. 37 మంది లబ్ధిదారులకు రూ.16,18,900 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు 71 మంది లబ్ధిదారులకు రూ.71,08,236 విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలవడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చేయూత అందుతోందన్నారు. పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఆసరాగా నిలుస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేకూరేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దారు పున్నం సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, వైస్ చైర్ పర్సన్ బొంతు సుమలత, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.



