– ఈ సర్వేను వందశాతం పారదర్శకంగా నిర్వహిస్తున్నాం
– సంబంధిత రైతుల సమక్షంలోనే సరిహద్దుల నిర్ధారణ
– జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్
నవతెలంగాణ-సత్తుపల్లి
భవిష్యత్తులో ఎలాంటి భూవివాదాలు తలెత్తకుండా ప్రతి అంశాన్ని నిబంధనల ప్రకారం భూముల రీ-సర్వేను చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ స్పష్టం చేశారు. భూ రీ-సర్వేను వంద శాతం పారదర్శంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ స్పష్టం చేశారు. సత్తుపల్లి తహసీల్దారు కార్యాలయంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బేతుపల్లి భూ రీ-సర్వే ప్రక్రియను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సమక్షంలో రెవెన్యూ అధికార్లతో కలిసి కలెక్టర్ సమీక్షను నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న భూ రీ-సర్వే కార్యక్రమాన్ని ఖచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మండల సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా బేతుపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీ-సర్వే వివరాలను కంప్యూటరులో చేసే డిజిటలైజేషన్ ప్రక్రియను సైతం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ…. రీ-సర్వేలో ప్రతి దశను నిబంధనలకు లోబడి, పూర్తి ఆధారాలతో నమోదు చేస్తున్నామన్నారు. సర్వే సమయంలో సేకరించిన ప్రతి వివరాన్ని భూ యజమానులు, రైతుల సమక్షంలో ధ్రువీకరించి, పంచనామ చేసిన సమాచారం, భూ హద్దులు, సర్వే నంబర్లు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలు తదితర అంశాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వేతో భూముల హద్దులు శాస్త్రీయంగా నిర్ధారించబడి, భూ రికార్డులు నవీకరించబడతాయని తెలిపారు. రైతులకు స్పష్టమైన యాజమాన్య హక్కులు, పారదర్శక భూ రికార్డులు అందుబాటులోకి రావడంతో పాటు వంద శాతం భూ వివాదాల పరిష్కారానికి ఇది దోహదపడుతుందని అన్నారు. ప్రతి భూ రీ-సర్వే సమయంలో సంబంధిత రైతు వద్ద ఉన్న పట్టాదారు పాస్‌బుక్, పాత పహాణీలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, సాగుకు సంబంధించిన ఇతర ఆధారాలు వంటి అన్ని పత్రాలు సర్వే నోటీసు అందించినట్లు రసీదు తీసుకోవడం, ఫోటోలతో కూడిన పంచనామా తయారు చేయడం, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ నమోదు చేయడం వంటి ప్రక్రియలను పూర్తి చేస్తున్నామని తెలిపారు. భూ సర్వే పూర్తయిన వెంటనే రైతు సమక్షంలోనే కొలతల వివరాలను వివరిస్తూ అవసరమైతే రైతు అభ్యర్థన మేరకు మరోసారి కొలతలు తీసి సందేహాలను నివృత్తి చేస్తున్నామన్నారు. రైతుకు వచ్చిన విస్తీర్ణాన్ని స్పష్టంగా తెలియజేసి, అతని అంగీకారంతో సంతకం తీసుకుంటున్నామని తెలిపారు. ఇలా పారదర్శకంగా వ్యవహరిస్తునచన నేపథ్యంలో భూ రీ-సర్వేపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ సమీక్షలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, సత్తుపల్లి తహసీల్దారు పున్నం సత్యనారాయణ, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.



