వీడేం దొంగరా బాబూ!

What a thief!– ఆర్టీసీ బస్సునే చోరీ చేసి.. ప్రయాణికులకు ఎక్కించుకుని..
– డీజిల్‌ ఆయిపోయి బస్సు ఆగిపోవడంతో తుర్రుమన్న ఘనుడు
– ప్రయాణికుల గగ్గోలుతో తేరుకున్న ఆర్టీసీ అధికారులు
– ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన వైనం
నవతెలంగాణ – తంగళ్లపల్లి
వీడో చిత్రమైన దొంగ.. ఆర్టీసీ బస్సును దొంగిలించి.. డ్రైవర్‌లా ఫోజిచ్చి మరీ ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. తీరా కొంత దూరం వెళ్లాక డీజిల్‌ అయిపోయి బస్సు ఆగిపోవడంతో అక్కడి నుంచి తుర్రుమన్నాడు. బస్టాండ్‌లో బస్సు పోయినా సోయిలేని అధికారులు చివరకు ప్రయాణికుల గగ్గోలుతో విషయం తెలుసుకుని తేరుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు సదరు దొంగ కోసం వెతుకుతున్నారు. ఈ ఘటన సోమవారం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి శివారులో జరిగింది. సిద్గిపేట బస్టాండ్‌లో ఉదయం 6గంటలకు ఓ ఎక్స్‌ప్రెస్‌ బస్సు వేములవాడకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో డ్రైవర్‌, కండక్టర్‌ లేని సమయం చూసి ఓ దొంగ ఆ బస్సును చోరీ చేశాడు. నీలిరంగు చొక్కా, ప్యాంటు తొడిగి అచ్చం డ్రైవర్‌లా ఫోజిచ్చి డ్రైవర్‌ సీట్లో కూర్చొని సిద్దిపేట నుంచి మధ్యాహ్నం వేములవాడ బస్టాండ్‌కు బస్సు తీసుకొచ్చాడు. అక్కడ హైదరాబాద్‌ బోర్డు మార్చి ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. బస్సు కొంత దూరం వెళ్లి సిరిసిల్ల జిల్లా కేంద్రం దాటుతుండగా.. కండక్టర్‌ ఏడని ప్రశ్నించిన ప్రయాణికులకు మధ్యలో బస్సు ఎక్కుతాడని సదరు చోరుడు బదులిచ్చాడు. తంగళ్లపల్లి వచ్చినా ఇంకా బస్సు ఎక్కని కండక్టర్‌ కోసం ఎదురుచూస్తున్నారు. సారంపల్లి గ్రామ శివారుకు రాగానే బస్సులో డీజిల్‌ అయిపోయి ఆగిపోయింది. ఏమైందని కిందికి దిగిన ప్రయాణికులకు వేరే బస్సు ఎక్కడండని ఆ దొంగ బదులిచ్చాడు. కండక్టర్‌ లేకపోవడం, డ్రైవర్‌ మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో పలువురు అతన్ని నిలదీశారు. కొందరు అతన్ని వీడియో కూడా తీశారు. సరైన సమాధానం చెప్పకుండా మెళ్లిగా అక్కడి నుంచి రోడ్డు దిగి తుర్రుమన్నాడు. దీంతో ప్రయాణికులు ఆగ్రహంతో విషయాన్ని ఆర్టీసీ అధికారులకు తెలియజేశారు. ఏం జరిగిందో అర్థంకాక వేములవాడ ఆర్టీసీ అధికారులు ఘటనస్థలానికి చేరుకోగా.. అసలీ బస్సు ఎక్కడిదని ఆరా తీశారు. సిద్దిపేట బస్టాండ్‌లో ఉదయం చోరీకి గురైన బస్సు ఇదేనని నిర్ధారించుకున్నారు. బస్సు చోరీ అయిన విషయాన్ని పోలీసులకు, సిద్దిపేట అధికారులకు తెలియజేశారు. దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషయమై వేములవాడ డిపో మేనేజర్‌ మనోహర్‌ను ‘నవతెలంగాణ’ వివరణ కోరగా.. సిద్దిపేట డిపో ముందున ఆర్టీసీ బస్సు చోరీకి గురైన విషయం వాస్తవమేనని, సదరు బస్సు డ్రైవర్‌ డిపోలో రిపోర్టు చేయలేదని తెలిపారు. చోరీ అయిన బస్సు వేములవాడలో ప్రత్యక్షమైన ఉదంతంపై విచారణ చేశామని, సిద్దిపేటలో కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారని చెప్పారు.

Spread the love