పోటీ పరీక్షల్లో విశ్వసనీయత ఏది ?

In competitive exams What is reliability?– నీట్‌ అవకతవకలపై విచారణ జరపాలి
– కేంద్రం మౌనం వీడాలి
– రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ-భువనగిరి
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల విద్య, ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే ప్రవేశ, పోటీ పరీక్షలంటేనే విశ్వసనీయత లేకుండా పోయిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో శనివారం ఆయన సీపీఐ(ఎం) జిల్లాస్థా యి రాజకీయ శిక్షణా తరగతులను ప్రారంభించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పాలకులు విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్‌ పరీక్షపై న్యాయవిచారణ నిర్వహించాలని చాలా మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రుణమాఫీ చేయాలని కోరారు. ఆగస్టు నెలలో చేస్తే రైతులు రుణగ్రస్తులుగానే ఉంటారని తెలిపారు. ముందుగా చేస్తే రైతులు విత్తనాలు, ఇతర వ్యవసాయ సంబంధిత పనులు వేగవంతంగా చేసుకుంటారని అన్నారు. ముందస్తుగా ఇవ్వలేకపోతే బ్యాంకులతో చర్చించి కొత్త రుణాలు ఇచ్చే విధంగా కృషిి చేయాలన్నారు.
లేకపోతే రైతులు ప్రయివేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోయే అవకాశం ఉందన్నారు. రైతుబీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా నిర్ణయం తీసుకొని అమలు చేయాలన్నారు. రైతు భరోసాను వెంటనే ఇస్తే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. వ్యవసాయ కూలీలకు రూ.12,000, కౌలు రైతులకు రైతు భరోసా అందించాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు రూ.2500 పథకాన్ని అమలు చేయాలని కోరారు. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, తద్వారా రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అశోక్‌రెడ్డి, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు ఉన్నారు.

Spread the love