ప్రయివేటులో ఫీ’జులుం’ ఆగెదెప్పుడు?

రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఫీజులుం కొనసాగుతూనే ఉన్నది. నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యంగానే కనిపిస్తోంది. నర్సరీ నుండి మొదలుకొని పదవ తరగతి వరకు వేల నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. పుస్తకాల పేరిట ఇప్పటికే భారీగా దండుకున్నారు. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారు. అత్యధిక శాతం ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు నిబంధనలను పాటించడం లేదు. పైగా మూడు నుంచి నాలుగేండ్ల పిల్లలకు కూడా వేల రూపాయలు వసూలు చేయడం ఆందోళన చెందాల్సిన అంశం. వారు ఏడాది మొత్తం బడికెళ్లినా తెలుగు వర్ణమాల, ఆంగ్లంలో ఆల్ఫబెట్స్‌ కూడా సరిగా నేర్చుకోలేడు. నాలుగు ఆక్షరాలు నేర్పించడానికి ఇంత ఫీజు వసూలు చేయడమేంటి? ద్వితీయ శ్రేణి కార్పొరేట్‌ స్కూలు, పేరున్న ప్రయివేటు విద్యాసంస్థలవారు ఎల్‌కేజీకి రూ.40 వేల దాకా వసూలు చేస్తున్నారు. గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో రూ.30 వేల నుంచి రూ.80 వేలు తీసుకుంటున్నారు. ఎంత డబ్బు ఎక్కువగా తీసుకుంటే అంత నాణ్యతగా చదువు ఉంటుం దని తల్లిదండ్రులను మభ్య పెడుతున్నారు. తరగతి పెరిగేకొద్దీ ఈ మొత్తాలు కూడా మరింత పెరుగుతుంటాయి. ఇవిగాక పాఠ్యపుస్తకాలు, స్కూల్‌ యూనిఫాం, టై, బెల్టులు, బూట్లు, సాక్సుల దుకాణాలూ బడిలోనే ఏర్పాటు చేసినా కన్నెత్తి చూసే నాథుడు లేడు. నాలుగైదు వందల రూపాయలకు మించని పుస్తకాలకు వేలు వసూలు చేస్తున్నారు. రకరకాల సామగ్రి పేరిట అదనంగా డబ్బులు లాక్కుంటున్నారు. అందరి దృష్టిని ఆకర్షించడానికి పాఠశాలలకు వివిధ రకాల పేర్లు జోడిస్తున్నారు. ఈ టెక్నో, ఈ లర్నింగ్‌, గ్లోబల్‌, స్మార్ట్‌, ఈ స్మార్ట్‌, ఐఐటీ, నీట్‌, ఒలంపియాడ్‌, కాన్సెప్ట్‌, ఇంటర్నేషనల్‌… ఇలా వివిధ రకాల పేర్లతో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈ పేర్లతో భారీ హోర్డింగులు, బోర్డులు పెట్టేవారు. కానీ పాఠశాల పేర్లతోనే విద్యాసంస్థలు నిర్వహించాలని ఆదేశాలు రావడంతో రూటు మార్చారు. విద్యాసంస్థలో వాటి పేరిట ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు నిర్వహిస్తున్నామని అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. సాధారణ చదువులకు ఇవి భిన్నమని విద్యార్థుల తల్లిదండ్రులను నమ్మిస్తున్నారు. దీంతో తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, విషయ పరిజ్ఞానం పెరుగుతుందని తల్లిదండ్రులు అడిగినంత ఫీజు చెల్లిస్తున్నారు. తల్లిదండ్రుల బలహీనతలను యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి.
నిబంధనలు బేఖాతరు…
రాష్ట్ర ప్రభుత్వం 1994లో జీఓ నెం.1లో ఒకసారి, 2008లో జీఓ నెం.90, 91, 92లో మరోసారి ప్రయివేటు విద్యా సంస్థలు పాటించాల్సిన నియమ నిబంధనలను పేర్కొంది. ఈ జీఓల్లో ఫీజుల నియంత్రణపై స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. 1994 జీఓ నెంబర్‌ -1 ప్రకారం ఫీజులను నిర్ణయించడానికి పాఠశాల చైర్మన్‌, ప్రిన్సిపాల్‌, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఇద్దరు, విద్యార్థి సంఘాలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. పాఠశాలల యాజమాన్యాలు వసూలు చేసిన ఫీజుల్లో 5శాతానికి మించి తీసుకోవడానికి వీల్లేదు. వసూలు చేసిన ఫీజుల్లో 50శాతం మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలివ్వాలి. 15శాతం వరకు పాఠశాల నిర్వహణ, విద్యుత్‌, అద్దె ఖర్చులు, 15శాతం స్కూల్‌ అభివృద్ధికి ఉపయోగించాలి. 15శాతం ఫీజును స్కూల్‌ సిబ్బందికి బీమా, భవిష్యనిధి కోసం కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ ఎక్కడా అమలు కావడం లేదు. 2008 జీఓ నెం.90, 91, 92.. ప్రకారం ఫీజు నిర్ణయించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి, ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, విద్యార్థి సంఘాలు, ప్రయివేటు విద్యా సంస్థల ప్రతినిధితో కమిటీని ఏర్పాటు చేయాలి. దీనికి కలెక్టర్‌ చైర్మన్‌గా ఉండాలి. ఈ కమిటీ పాఠశాలను పరిశీలించి మౌలిక సదుపాయాలు, పరిస్థితులు చూసి ఎంత ఫీజులు వసూలు చేయాలనే విషయమై నివేదిక ఇస్తుంది. దీనిపై విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే ప్రభుత్వ పరంగా ఓ ప్రకటన విడుదల చేయాలి. ఈ ఉత్తర్వులను విధిగా అమలు చేయాలి. జీఓ నెంబర్‌ 42 ప్రకారం ఫీజులను పెంచాలంటే జిల్లా ఫీజ్‌ రెగ్యులేషన్‌ కమిటీ అనుమతి తీసుకోవాలి. ఎలాంటి అనుమతి లేకుండా ప్రతి సంవత్సరం 20 నుండి 30శాతం ఫీజులను యథేచ్ఛగా పెంచుతూ వెళ్తున్నారు. జీఓ నెంబర్‌ 91 ప్రకారం దరఖాస్తు రుసుము రూ.100, అడ్మిషన్‌ ఫీజు రూ.500 మాత్రమే తీసుకోవాలి. అదే పాఠశాలలో పుస్తకాలు, విద్యాసామగ్రిని కొనుగోలు చేయాలన్న నిబంధనలు పెట్టరాదు. పాఠశాలల్లో విక్రయ కేంద్రాలు తెరవకూడదు. సెక్షన్‌ -8(1) ప్రకారం విద్యాసంస్థ పేర్లకు ఇంటర్నేషనల్‌, ఐఐటీ, ఒలంపియాడ్‌, కాన్సెప్ట్‌, ఈ -టెక్నో వంటి పదాలను చేర్చకూడదు. జీఓ 88, 2008 ప్రకారం 200 మంది విద్యార్థులు చదివే పాఠశాలలో 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్రీడా మైదానం ఉండాలి. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి. అగ్నిమాపక సామగ్రిని అందుబాటులో ఉంచాలి. కానీ ఏ ఒక్క ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అగ్నిమాపక సామాగ్రిని పెట్టడం లేదు.
విద్యాహక్కు చట్టం అమలేది..?
2009 విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాల యాజమాన్యం ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల వివరాలను నోటీస్‌ బోర్డులో పెట్టాలి. ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ప్రతి కార్పొరేట్‌ ప్రయివేటు పాఠశాలల్లో 25శాతం సీట్లను పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేటాయించి ఉచిత విద్యను అందించాలి కానీ ఏ ఒక్క విద్యాసంస్థ కూడా ఉచిత విద్య అందించిన దాఖలాలు లేవు. విద్యార్థుల నుండి ఫీజులను వసూలు చేయాలంటే ఆ విద్యాసంస్థల్లో ఎన్నో సదుపాయాలు ఉండాలి. విద్యార్థులకు వసతులు కల్పించాలి. ఈ విధంగా ఏ ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యం వ్యవహరించడం లేదు. ప్రయివేటు, కార్పొరేటు పాఠశాలల్లో ప్రతి 20మంది విద్యార్థులకు ఒక తరగతి గదిని కేటాయించాలి. కానీ ఒక తరగతి గదికి 50 నుంచి 80మంది విద్యార్థులను కేటాయిస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రయివేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో, అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టడం లేదు. ఫైర్‌ సేఫ్టీ లేదు. ఒక్కొక్క తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. ఉపాధ్యాయులు శిక్షణపొంది ఉండాలి. కానీ వేతనాలు అధికంగా ఇవ్వాల్సి వస్తుందని తక్కువ మంది సిబ్బందితో, అర్హతలేని ఉపాధ్యాయులతో చాలా పాఠశాలలు నడుస్తున్నాయి. విద్యార్థులకు క్రీడాలకు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉండాలి. విశాలమైన ఆటస్థలాన్ని ఉండాలి. కానీ రాష్ట్రంలో 80శాతం పాఠశాలలకు ఈ సౌకర్యాలు లేవు. ఇరుకు గదులు, జనసమ్మర్థం ఉండే కూడళ్లు, అపార్ట్‌మెంట్లలో పాఠశాలలు నడుస్తున్నాయి. తరగతి గదుల్లోకి గాలి, వెలుతురు సమృద్ధిగా ప్రసరించాలి. చాలా పాఠశాలల్లో ఆ పరిస్థితి లేదు. విద్యార్థుల నుంచి బిల్డింగ్‌ ఫండ్‌ను వసూలు చేయరాదు. కొన్ని కార్పొరేట్‌, ప్రయివేటు విద్యా సంస్థలు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ఫీజులు వసూలు చేయాలి. కానీ వేలు… లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇలా అనేక రకాలుగా దోపిడీ జరుగుతున్న, రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖాధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరించడం వలన రాష్ట్రంలో విద్యరంగం వ్యాపార వస్తువుగా మారింది. విద్యాహక్కు చట్ట ఆమలు, ఫీజుల నియంత్రణ చట్టం అమలు, అక్రమదోపిడీని అరికట్టేందుకు, విద్యావేత్తలు, మేధావులు, తల్లి దండ్రులు, విద్యార్థి, ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాటికొండ రవి
9177302248

Spread the love