పింఛన్ల పెంపు ఇంకెప్పుడు?

పింఛన్ల పెంపు ఇంకెప్పుడు?– ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెంకట్‌, అడివయ్య
– రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవ్వాలని పిలుపు
– ఆగష్టు 24,25,26 తేదీల్లో ‘వేదిక’ రాష్ట్ర మహాసభ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆసరా పింఛన్‌, చేయూత పింఛన్‌ను ఇంకెప్పుడు పెంచుతారని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట్‌, అడివయ్య అన్నారు. హామీనిచ్చి ఆరు నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం ఊసే ఎత్తడం లేదన్నారు. పింఛన్‌ పెంపు అమలు కోసం ఉద్యమానికి ఆసరా, చేయూత లబ్దిదారులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బుధవారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్‌ కమలానగర్‌లోని భాస్కర్‌రావు భవన్‌లో ఎన్‌పీఆర్‌డీ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షులు ఎ.రంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఆసరా పింఛన్‌, చేయూత పింఛన్‌ను రూ.4వేలు, రూ.6వేలకు పెంచుతామని హామీలిచ్చారని గుర్తుచేశారు. 2024 జనవరి నుంచే ఆసరా, చేయూత పథకాన్ని అమలు చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదన్నారు. ప్రజాపాలనా కార్యక్రమం సందర్భంగా పింఛన్‌ల కోసం షుమారు 24.84 లక్షల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం గతంలో ప్రకటించినట్టు గుర్తుచేశారు. ప్రతి నెలా చివరి వారంలో పింఛన్‌ డబ్బులు చెల్లించడం వల్ల లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 2014 నుంచి ప్రతి ఏడాదీ 2, 3 నెలల పింఛన్‌ పెండింగ్‌లో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో లేకుండా రెగ్యులర్‌గా పింఛన్లు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పెంచాల్సిన పింఛన్లు కూడా జనవరి నుంచే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జులై పింఛన్‌తో పాటు పెరిగిందీ ఇవ్వాలని, జనవరి నుంచి జూన్‌ వరకు ఏరియర్స్‌ కలపాలని అన్నారు. వెంటనే పింఛన్లు పెంచి ఇవ్వాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర 4వ మహాసభ ఆగస్టు 24-26 తేదీల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మహాసభకు 33 జిల్లాల నుంచి 700 మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. మహాసభ నిర్వహణ కోసం ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జి.బాలయ్య, జె.మల్లేష్‌, షాయినా బేగం, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మిపతి, సుల్తాన్‌ రమేష్‌, విజయలక్ష్మి, చంద్రమోహన్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love