మన ఇసుక.. మన వాహనం ఎక్కడ..?

– అమలు కానీ ఎమ్మెల్యే మాట
– స్పందించని అధికారులు

– విలేకర్ల సమావేశంలో ఆర్భాటంగా ఇసుక రవాణా అమలు చేస్తామన్న ఎమ్మెల్యే మాట అమలు చేయని అధికారులు
– అచ్చంపేట పట్టణానికి వంగూరు మండలం నుంచి టిప్పర్లలో ఇసుక రవాణా

– గ్రామాల్లో ఇసుక లేక ఆగిన పేదల ఇంటి నిర్మాణాలు
– సీసీరోడ్లు నిర్మాణ పనులకు డీడీ కి వేల రూపాయలు చెల్లించినా పర్మిషన్ ఇవ్వని అధికారులు
– మైనింగ్ శాఖకే సంబంధం అంటున్నా ఎమ్మార్వో

నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతల మండలం పలు గ్రామాలలో ప్రజలు ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనులు ముగించుకొని పంట మీద వచ్చిన లాభాన్ని లేదా అప్పు చేసి వేసవికాలంలో వ్యవసాయ పనులు లేకపోవడంతో ఇంటి నిర్మాణం పై ఎంతోకొంత నివాస గృహాలకు నిర్మాణాలకు ఉపయోగిస్తుంటారు. కాగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇసుక రవాణా ఒక్కసారిగా ఉప్పునుంతల మండలం పరిధిలో దుందుభి వాగు నుండి గత 30 రోజుల నుండి ఇసుక రవాణా ఆగిపోవడంతో మారుమూల గ్రామాలలో గృహ నిర్మాణాలు నిర్మించుకునే పేదలకు భారంగా మారింది ఇదే ఆసరాగా చేసుకొని ఇసుక మాఫియా ఒక్కసారిగా ఒక్క ఇసుక ట్రాక్టర్ కు రూ.7000 నుండి రూ.8 వేల వరకు విక్రయిస్తూ అమ్మకాలు జరిపారు. ఇసుక కొరత తీవ్రంగా ఏర్పడి అరుదుగా బంగారమైందని పలువురు బహిర్గతంగా ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాలలో నూతనంగా ఈజీఎస్ నిధుల కింద మంజూరైన సిసి రోడ్లు ఇసుక రవాణా అనుమతి లేక డస్ట్, నాణ్యతలేని ఇసుకను కూడా సిసి రోడ్లకు ఉపయోగించారని గ్రామస్తుల నుండి పది కాలాలపాటు ఉండటం అనుమానమే అన్నట్లు విమర్శలు వినిపించాయి ఇది నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ఒక మచ్చగా ఉంది అన్నట్లు  పలువురు ఆరోపించారు. ఇసుక రవాణా అనుమతించి  ఇసుక నిబంధనలు అమలు అయ్యేలా మైనింగ్ సంబంధిత శాఖ అధికారులు, పాలకులు స్పందించి ఇసుక రవాణా గ్రామాల్లో నివసించే గృహ నిర్మాణ వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పనులు నిలిచాయి బతికేది ఎట్లా..
నేను వివిధ గ్రామాలలో ఇంటి నిర్మాణాలు పట్టుకొని మేస్త్రిగా ఇంటి కట్టడాలు చేపడుతూ జీవనోపాధి కొనసాగుతున్న పలు గ్రామాలలో ఇసుక లేక నిర్మాణ పనులు ఆగాయి 20 రోజుల నుండి జీవనం కొనసాగించాలంటే అస్తవ్యస్తంగా మారింది ఉపాధి లేక ఇబ్బందులు పడవలసి వస్తుంది ఇసుక లేక అమాంతం రేటు పెరగడంతో రైతులు పనులు ఆపుతున్నారు. అధికారులు పాలకులు స్పందించి ఇసుక అనుమతులు ఇస్తే గ్రామాల్లో పనిచేసే మేస్తిర్లకు ఉపాధి కల్పించిన వాళ్లు అవుతారు. – తాపీ మేస్త్రి నక్కర కంటి నిరంజన్, అయ్యవారిపల్లి గ్రామం.
మేస్త్రీల కిందికి పారపనిగా కూలికి వెళ్తుండేవాడిని ఒక రోజుకు చొప్పున కూలి 600 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇటుక, సిమెంటు ఉన్న ఇసుక లేక నెల రోజులుగా పని లేకుండా ఖాళీగా ఉన్న నాకు పారా పని తప్ప వేరే పని రాదు కావున పని లేకపోవడానికి కారణం ఇసుక లేకపోవడం ఇసుక ఇంటి నిర్మాణాలు కట్టడాలకు అనుమతి ఇస్తే పనులు జరుగుతాయి నాకు జీవనం కొనసాగుతది – లేబర్ ఇంజమూరి బాలరాజు, రాయిచెడు గ్రామం
ఇంటి గోడలు కట్టుకున్న ఇంటికి ప్లాస్టిగ్ కొరకు దొడ్డుమాలు, దుబారా చెయ్యడానికి 5 ట్రాక్టర్ల ఇసుక అవసరం ఉంది ఇప్పుడు ఇంటి ముందల ఒక్క ట్రాక్టర్ ఇసుక మాత్రమే ఉంది కొనుకుందామన్న ఇసుక దొరుకుతలేదు రేటు ఎక్కువగా ఉంది అని రూ.8000 అంటుండ్రు ఇన్ని పైసలు పెట్టి మేము ఎట్లా కట్టుకునేది కూలి నాలి చేసుకునే మాకు ఇసుక పెనుబారంగా మారింది తక్కువ ధరకు దొరికిన కొనుక్కొని ఇంటి మరమ్మతులు పూర్తి చేసుకునే వాళ్ళం కానీ ఇసుక లేక ఇబ్బంది పడుతున్నాం- మహిళా గృహిణి, ఇంజమూరి లక్ష్మమ్మ, రాయిచెడ్ గ్రామం.
గ్రామాలలో ఇంటి నిర్మాణ పనులు చేసుకునే ప్రజలకు నెల రోజులుగా ఇసుక కొరత ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులు పాలకులు స్పందించి ఇంటి నిర్మాణం పనులకు అవసరమయ్యే అంత ఇసుక అనుమతులు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అమలుకు నోచుకోని యెడల పేదల పక్షాన రానున్న రోజుల్లో తాహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేస్తాం – తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి, చింతల నాగరాజు
Spread the love