పర్యావరణ పరిరక్షణ అనేది పౌరుల బాధ్యత అని ఏ దేశ రాజ్యాంగం చెబుతుంది?

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలలో పర్యావరణ పరిరక్షణ అనేది అంతర్లీనంగా దాగి ఉంటుంది. చెట్లను, జంతువుల్ని పూజించటం, వాటిని సంరక్షించటం భారతీయ గ్రామీణ జీవన విధానంలో అంతర్భాగాలే. దేశీయ సమాజంలో అంతర్లీనంగా దాగి ఉన్న ఈ పర్యావరణ స్పృహ భారత రాజ్యాంగంలో కూడా కనిపిస్తుంది. భారత రాజ్యాంగం యొక్క మూల గ్రంధం నేరుగా పర్యావరణ పరిరక్షణను ప్రస్తావించకపోయినా, పర్యావరణ సంబంధిత అంశాల గురించి ప్రస్తావిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌-47 దేశంలోని పౌరులందరి ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవటం రాష్ట్రాల ప్రాధమిక భాద్యత అని తెలియచేస్తుంది. అదేవిధంగా ఆర్టికల్‌-49 జంతువుల సంరక్షణ కూడా రాష్ట్రాల భాద్యత అని ఉద్ఘాటిస్తుంది. ఆ తర్వాతి కాలంలో పర్యావరణ పరిరక్షణకు సంభందించిన అధికరణలు రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగంలో ప్రవేశపెట్టబడ్డాయి. ఆ రకంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలను రాజ్యాంగంలో పొందుపరచిన మొదటి దేశంగానే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలను చేర్చడానికి రాజ్యాంగ సవరణలు కూడా చేపట్టిన మొదటి దేశంగా భారతదేశం కీర్తిని గడించింది.
ప్రపంచ పర్యావరణం ఎదుర్కొంటున్న సమస్యలు, తద్వారా మానవుని ఆరోగ్యానికి కలుగుతున్న నష్టాల గురించి చర్చించి, ప్రపంచ దేశాలను చైతన్యవంతం చేయటంతో పాటు ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఒక స్పష్టమైప కార్యాచరణ ప్రణాళికను అందివ్వాలన్న లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి స్వీడన్‌ రాజధాని స్టాక్‌హొం నగరంలో మానవుడు – పర్యావరణం అనే అంశం మీద మొదటి ప్రపంచస్ధాయి పర్యావరణ సదస్సును నిర్వహించింది. 1972వ సంవత్సరం జూన్‌ 5వ తేది నుండి 16వ తేది వరకూ జరిగిన ఈ సదస్సులో పర్యాపరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశిస్తూ 26 సూత్రాలతో కూడిన ఒక తీర్మానం ప్రవేశపెట్టబడింది. ‘ఒకే ఒక భూమి’ అనే నినాదంతో జరిగిన ఈ సదస్సులో 122 దేశాలు పాల్గొనగా, 70 దేశాలు ఈ తీర్మానానికి ఆమోదం తెలుపుతూ సంతకాలు చేశాయి. స్టాక్‌హౌ డిక్లరేషన్‌పై భారతదేశం కూడా సంతకం చేసింది.
భూగ్రహ వాతావరణంపై ప్రపంచ దేశాలు నిర్వహించిన మొట్టమొదటి సమావేశంగా స్టాక్‌హౌం కాన్ఫరెన్స్‌ గుర్తింపు పొందింది. స్టాక్‌హొం సదస్సు జరిగిన 1972 నాటికి ప్రపంపంలోని ఏ దేశంలోను పర్యావరణ మంత్రిత్వ శాఖలు లేవు. సదస్సు అనంతరం నార్వే, స్వీడన్‌ దేశాలు పర్యావరణ మంత్రిత్వ శాఖల్ని ఏర్పాటు చేసుకోగా, భారతదేశం 1980లో పర్యావరణ శాఖను ప్రారంభించింది. ఆ తర్వాత అది 1985లో పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖగా మారింది. మొదటి పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రిగా రాజీవ్‌గాంధీ పని చేశారు. స్టాక్‌హౌం సదస్సుకు భారతదేశం తరపున అప్పటి ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ హాజరయ్యారు. హాజరవ్వటంతో పాటు ఇందిరాగాంధీ స్టాక్‌హౌం కాన్పరెన్సులో చేసిన ప్రసంగం అనేక దేశాల ప్రశంసలు అందుకుంది. ధనిక దేశాలు చేస్తున్న పాపాలు, భారత్‌ లాంటి అభివృద్ధి చెందిన దేశాల పాలిట పాపాలుగా మారుతున్నాయని, దేశాలలో పేదరికం తొలగితేనే పర్యావరణ పరిరక్షణ మరింత వేగవంతమవుతుందని ఆమె తన ఉపన్యాసంలో స్పష్టం చేశారు. స్వతహాగా పర్యావరణ ప్రేమికురాలైన ఇందిరాగాంధీపై స్టాక్‌హౌం కాన్ఫరెన్సు ప్రభావం పడింది. ఆ సదస్సు నుండి తిరిగి రాగానే పర్యావరణ పరిరక్షణ, దానికి చట్టబద్ధంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్యలు ప్రారంభించారు. దానిలో భాగంగా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలోకి పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన 48-ఎ, 51-ఎ(జి) ఆర్టికల్స్‌ను ప్రవేశపెట్టటం జరిగింది. ఆర్టికల్‌ 48-ఎ పర్యావరణ పరిరక్షణ మరియు వన్యప్రాణి సంరక్షణకు దేశంలోని ఆయా రాష్ట్రాలు భాద్యత వహించాలని నిర్దేశిస్తుంది. దానితో పాటు అప్పటి వరకూ రాష్ట్ర జాబితాలో ఉన్న వన్యప్రాణులు మరియు అడవులను రాజ్యాంగం ఉమ్మడి జాబితాలోకి చేర్చింది. అదేవిధంగా ఆర్టికల్‌ 51-ఎ(జి) సరస్సులు, నదులు మరియు వన్యప్రాణులతో కూడిన సహాజ పర్యావరణాన్ని పరిరక్షించటం మరియు పర్యావరణాన్ని మెరుగుపరచడం అనేవి దేశంలోని పౌరుల ప్రాధమిక విధులని పేర్కొంది. దానితో పాటు ప్రాణలన్నింటి పట్ల కరుణ, ప్రేమను పౌరులందరూ కలిగి ఉండాలని నిర్దేశిస్తుంది. రాజ్యాంగ సవరణ ద్వారా పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రవేశపెట్టిన ఈ అధికరణల ఆధారంగా దేశంలో అనేక పర్యావరణ చట్టాల రూపకల్పనకు మార్గం సుగమమం అయ్యింది.
1. పర్యావరణ పరిరక్షణ అనేది రాష్ట్రాల మరియు పౌరుల విధిని అని ఏ దేశ రాజ్యాంగం చెబుతుంది?
ఎ. అమెరికా బి. కెన్యా సి. ఇండియా డి. చైనా

2. మొదటి ప్రపంచ పర్యావరణ సదస్సు ఏ సంవత్సరంలో జరిగింది;
ఎ. 1976 బి. 1967 సి. 1972 డి. 1976

3. స్టాక్‌హొం కాన్ఫ్‌రెన్స్‌ ఏ దేశంలో జరిగింది?
ఎ. స్వీడన్‌ బి. రియోడిజెనిరా సి. వియత్నాం డి. రష్యా

4. స్టాక్‌హొం కాన్ఫరెన్సులో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి?
ఎ. 122 బి. 128 సి. 123 డి. 124

5. స్టాక్‌హొం కాన్ఫరెన్సులో భారత దేశం తరుపున ఎవరు పాల్గొన్నారు?
ఎ. మొరార్జీ దేశారు బి. రాజీవ్‌ గాంధీ
సి. శ్రీమతి ఇందిరా గాంధీ డి. ఫిరోజ్‌ గాంధీ

6. స్టాక్‌హౌం కాన్ఫరెన్సు ప్రవేశపెట్టిన 26 సూత్రాలతో కూడిన డిక్లరేషన్‌పై ప్రాధమికంగా ఎన్ని దేశాలు సంతకం చేశాయి?
ఎ. 120 బి. 122 సి. 111 డి. 70

7. స్టాక్‌హొ కాన్ఫరెన్సు ఏ నినాదంతో జరిగింది;
ఎ. ఒకే ఒక భూమి బి. భూమి ఒక్కటే
సి. భూగ్రహాన్ని కాపాడుకుందాం డి. పైవేవీ కావు

8. భారతదేశంలో పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
ఎ. 1975 బి. 1985 సి. 1965 డి. 1995

9. భారత రాజ్యాంగంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలను ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు?
ఎ. 47వ రాజ్యాంగ సవరణ బి.42వరాజ్యాంగ సవరణ
సి. 45వ రాజ్యాంగ సవరణ డి. పైవేవీ కావు

10. భారత రాజ్యాంగంలో పర్యావరణ పరిరక్షణ రాష్ట్రాలు, పౌరుల ప్రాధమిక విధి అని ఏ అధికరణం నిర్దేశిస్తుంది?
ఎ. 48-ఎ బి. 48-బి సి. 47-ఎ డి. 47-డి

11. జీవరాశి లేదా తోటి ప్రాణుల పట్ల కరుణ, ప్రేమ, ఆదరణ భావం కలిగి ఉండాలని ఏ అధికరణం చెబుతుంది?
ఎ. ఆర్టికల్‌ 15 బి. ఆర్టికల్‌ 51-ఎ(జి) సి. ఆర్టికల్‌ 48-ఎ డి. పైవేవీ కావు

12. భారతదేశంలో పర్యావరణ చట్టాల రూపకల్పనకు మార్గమేసిన రాజ్యాంగ అధికరణలు ఏవి?
ఎ. 14-ఎ; 15-ఎ బి. 48-ఎ; 51-ఎ(జి)
సి. 47-ఎ; 49-బి డి.42-ఎ; 43-సి

13. అడవులను, వన్యప్రాణులను కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో చేర్చిన ఆర్టికల్‌ ఏది?
ఎ. 48-ఎ బి. 51-ఎ(జి) సి. 14, 15-ఎ డి. పైవేవీ కావు

14. 42వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ. 1956 బి. 1966 సి. 1976 డి. 1986

15. భారతదేశ మొదటి పర్యావరణ మరియు అటవీ శాఖా మంత్రి ఎవరు?
ఎ. శ్రీమతి ఇందిరా గాంధీ
బి. సంజరు గాంధీ
సి. రాజీవ్‌ గాంధీ
డి. ఫిరోజ్‌ గాంధీ
సమాధానాలు
1.సి 2.సి 3.ఎ 4.ఎ 5.సి 6. డి 7. ఎ 8. బి 9. బి 10.ఎ 11. బి 12. బి 13. ఎ 14. సి 15. సి
– డాక్టర్‌ కె. శశిధర్‌
విషయ నిపుణులు
94919 91918

Spread the love