కోటి డాలర్ల ప్రశ్న

ప్రభుత్వం అన్నాక అనేక లక్ష్మణరేఖలు ఉంటాయి. ప్రధాని అన్నాక పార్టీతో సంబంధం లేకుండా అందర్నీ సమదృష్టితో చూడాలి. రాజ్యాంగ నిర్దేశం కూడా అదే. వరంగల్‌ వ్యాగన్‌ రిపేరు ఫ్యాక్టరీ శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ తాను మాత్రం బీజేపీ కార్యకర్తగా ఇక్కడికి వచ్చానంటూ నొక్కివక్కాణించారు. మరి పార్టీ కార్యకర్తగా వచ్చిన పెద్దమనిషి శంకుస్థాపనలు ఎలా చేశారనేదే కోటి డాలర్ల ప్రశ్న. ఢిల్లీ నుంచి మందీమార్బలంతో బయల్దేరి వచ్చిన ఆయన ఖర్చును ప్రభుత్వం భరించిందా…లేక కమలం భరించిందో తెలియాలి. ఇక ఆ మీటింగ్‌లో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజరు తాను పార్టీ విధేయుడినని ప్రకటించుకొనేందుకు నానా తంటాలు పడ్డారు. తనను ఎందుకు తప్పించారో చెప్పండంటూ పరోక్షంగా అదే వేదికపై ఉన్న నడ్డాను, మోడీని అడగకనే అడిగినట్టు మాట్లాడారు. పార్టీ పాత, కొత్త కాపు కిషన్‌రెడ్డి కూడా తాను సీఎం కేసీఆర్‌కు దగ్గరేం కాదు అనిపించుకొనే ప్రయత్నం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ను ఒకే గాటన కట్టేసే ప్రయత్నం చేశారు. ఏంటో కూటికోసం కోటి తిప్పలు అని విన్నాం కానీ…పదవి, అధికారం కోసం ఈ పడరాని పాట్లు ఏంటో ఓ పట్టాన అర్ధమైసావట్లే!! -ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి

Spread the love