చదువరులే కానీ…

పుస్తకాలు కొనేందుకు ఓ ప్రముఖ పుస్తక విక్రేయ కేంద్రానికి వెళ్లాను. పుస్తకాల దుకాణాన్ని కలియ చూసిన తర్వాత కొన్ని కథల పుస్తకాలు కొన్నాను. ఈ సందర్భంగా నేను ఒక జర్నలిస్టుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలనే కుతూహలంతో పుస్తక విక్రేయ కేంద్రం నిర్వహకుడిని కొన్ని ప్రశ్నలు అడిగాను. అందులో ముఖ్యమైన ప్రశ్న ఏదంటే, ప్రతి ఒక్కరి దగ్గరా సెల్‌ఫోన్లు, యూట్యూబ్‌, గూగుల్‌ తల్లి ఉన్న కాలంలో పుస్తకాలు కొనడం, చదవడం తగ్గిపోయాయి కదా? ‘అన్నాను’. లేదు మీ అవగాహన తప్పు. ఇటీవల కాలంలో పుస్తకాలు కొనడం, చదవడం విపరీతంగా పెరిగిందని చెప్పారు. అదేందండీ గిరాకీ లేక పుస్తకాలు షాపులు వెలవెలబోతున్నది వాస్తవం కదా? అని ప్రశ్నించగా, మారుతున్న పరిస్థితుల్లో జీవితాలు అభద్రతకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధాంత గ్రంధాలు చదవడం లేదు. కానీ డబ్బు సంపాదించడం ఎలా? విజయానికి ఏడు మెట్లు, ప్రశాంత జీవితం గడపడం ఎలా?, ఆరోగ్య సూత్రాలు, మెదడుకు మేత, వారం రోజుల్లో ఇంగ్లీష్‌, హిందీ నేర్చుకోవడమెలా?డబ్బు సంపాదించే మానసిక వికాసాన్ని పెంపొందించు కునేందుకు ఎక్కువగా కొంటున్నారు. మా వద్ద అవి ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని తెలిపారు. పుస్తక పాఠకుల గురించి ఆయనే చెబుతూ…’తన చిన్నతనంలో స్వతంత్ర సమరయోధుల జీవితం చరిత్రలు, రష్యాను ప్రభావితం చేసిన అమ్మ నవల, దేశ చరిత్రను తెలుసుకునేందుకు ఎక్కువ పుస్తకాలు కొని చదివేవారు. తద్వారా రాజకీయ అవగాహన పెంచుకుని విద్యార్థి సంఘాల్లో చేరేవారు. ఈనాటి విద్యార్థులు, యువకులు మానసిక ఆందోళనలను తగ్గించుకునేందుకు చదువుతున్నారు. రాజకీయాలంటే మనకు సంబంధం లేదనే తీరుతో విద్యార్థులు వ్యవహరిస్తున్నారు. విద్యార్థి సంఘాలకు, రాజకీయ దూరంగా ఉంటూ…సమాజం ఎటుపోతే నాకేంటి? అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. తమ సమస్యను తాను పరిష్కరించుకోలేక ఆగమాగవు తున్నారు’. అని విశ్లేషించారు. చివరకు ఆయనే బాంబు పేల్చుతూ…అనీ అత్రుతో కొంటారండీ. ఒకట్రెండ్రు పేజీలు తిప్పేసి మూలనపడేస్తారు. దుమ్మూధూళి పట్టాకా పాత పుస్తకాలోళ్లకు అమ్ముతున్నారు. అని సమాజ వాస్తవ పరిస్థితిని కండ్లకు కొట్టినట్టు చూపించారు. చివరకు ఆయన చెప్పిదంతా నిజమే కదా అనిపించింది.
-ఆర్‌. రఘు

Spread the love