పుడమి గర్భంలో…

‘పుడమి గర్భంలోని తడికి జలదరించిన విత్తు లోకాన్ని చూద్దామని రెండు పచ్చని కనురెప్పలు పైకెత్తుతుంది’ అన్న ఓ కవయిత్రి ఆశలు నీరుగారుతున్నాయి. తొలకరికి విత్తిన విత్తనం మట్టిలోనే కలిసిపోయింది. విత్తనాలు నాటిన తర్వాత జల్లులు పడకపోవడంతో పుడమిగర్భంలోనే విత్తనం ఉండిపోయింది. భూమిని నమ్ముకున్న రైతులు… అధిక ధరలకు విత్తనాలు కొని తెచ్చి నాటితే మట్టిలోనే కలిసిపోయాయి. చిరుజల్లులు పడలేదు కానీ అన్నదాత నుంచి కన్నీటి ధార కురుస్తున్నది. మరోసారి విత్తనం కొనుక్కోవాల్సి పరిస్థితి వస్తున్నది. ఈ వానాకాలం సీజన్‌లో పత్తి, మొక్కజొన్న, జొన్న, కంది విత్తనాలు నాటారు. కానీ అనేక చోట్ల విత్తనాలు మొలకెత్తలేదు. మొలకెత్తినవేమో ఎండలకు కమిలిపోయాయి. విత్తన ఖర్చులు, దున్నడానికి, చదును చేయడానికి, చేసిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరైంది. సర్కారోళ్లు విత్తనాలు సరఫరా చేయకపోవడంతో ప్రయివేటోళ్ల దగ్గర కొనాల్సి వస్తుంది. వారు ఇష్టారీతిన అధిక ధరలకు అమ్ముతున్నారు. అడ్డూ, అదుపు లేకుండా ధరలు పెంచి, రైతుల రక్తాన్నీ జలగల్లా పీలుస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతన్నలను సర్కార్‌ ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
-గుడిగ రఘు

Spread the love