బరిలో ఎవరు..?

Who is in the ring?– స్థానిక నేతలతో అభిప్రాయ సేకరణ.. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ కసరత్తు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ అచితూచి అడుగులేస్తున్నది. ఎన్నికల్లో బలమైన అభ్యర్ధులను రంగంలోకి దించేందుకు ఆ పార్టీ వేట మొదలు పెట్టింది. అందుకు పార్టీ నేతలే కావాల్సిన అవసరం లేదు. ఎన్నికల రణరంగంలో తలపడే రేసు గుర్రమైతే చాలు అనే విధంగా కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తున్నది. రాష్ట్రంలో హస్తం అధికారంలో ఉండటంతో అధిష్టానం కూడా టీపీసీసీకి పెద్ద కర్తవ్యాన్ని నిర్దేశించింది. దీంతో ఇప్పటికే బీజేపీ ప్రకటించిన అభ్యర్థులకు ధీటైన నేతలను ఎంపిక చేసే పనిలో రేవంత్‌ బృందం పడింది. ఈసారి 14 ఎంపీ స్థానాలకు తక్కువ కాకుండా ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఆ టీమ్‌ ఉన్నది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు, ఇన్‌చార్జీలు ఏ మాత్రం ఏమరుపాటు వహించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధిష్టానం సూచించింది. ఇతర పార్టీలకు చెందిన నేతలను చేర్చుకునే విషయంలోనూ స్థానిక నేతల అభిప్రాయాలకే పెద్ద పీట వేస్తున్నది. ‘మీ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తే విజయం సాధిస్తారు. ఎవర్ని రంగంలో దించితే బాగుంటుంది. అక్కడ బీఆర్‌ఎస్‌, బీజేపీ పరిస్థితి ఏంటి? ఆ పార్టీలకు చెందిన అభ్యర్థుల బలాబలాలేంటి?’ అభ్యర్థిగా ఎవరుండాలి? వారికి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాదరణ, నాయకుల సహకారం తదితర అనేక విషయాలపై రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షి… బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను సేకరించింది. అయితే ఇప్పటికే తమ అభ్యర్థిత్వం పరిశీలించాలంటూ 800 మందికిపైగా నేతలు హైకమాండ్‌కు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అందులో నుంచి ప్రతి నియోజకవర్గానికి ముగ్గురి పేర్ల చొప్పున కేంద్ర కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీకి పీసీసీ పంపించిన సంగతి విదితమే. కాగా, వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రాబోతున్న తరుణంలో అభ్యర్థుల కోసం దీపాదాస్‌ మున్షి అభిప్రాయ సేకరణ చేయడం పట్ల పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే తొలి జాబితా వచ్చింది. అందులో జహీరాబాద్‌ – సురేష్‌కుమార్‌ షెట్కర్‌, నల్లగొండ – రఘువీర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌-చల్లా వంశీచంద్‌ రెడ్డి, మహబూబాబాద్‌ (ఎస్టీ) -బలరాం నాయక్‌ పేర్లు ప్రకటించిన సంగతి విదితమే. మిగిలిన 13 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు నడుస్తోంది. ఒక్కో పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు తమ అభిప్రాయాలను అధిష్టానం ప్రతినిధుల ముందు వెల్లడిస్తున్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవేళ్ల నియోజకవర్గాలకు చెందిన నాయకుల నుంచి ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తయినట్టు తెలిసింది.

Spread the love