బీజేపీ టికెట్ ఎవరికో ?

  •  హస్తినలో ఎవరికి వారి మంతనాలు!

నవతెలంగాణ చందుర్తి: వేములవాడ రాజకీయ పరిణామాలు ఉత్కంఠకు తెర తొలగలేదు. ఒక వైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో మునిగి పోయారు. కానీ బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయక పోవడంతో ఇక్కడ ఆ పార్టీ నాయకులు మాత్రం ఎవరి దారిలో వారు ప్రచారం చేసుకుంటున్నారు. తనకే టికెట్ అని వికాసరావు, తనకే అని తుల ఉమ కూడా ప్రజల్లో ముందస్తుగా ప్రచారం సాగిస్తున్నారు.
హస్తినలో వికాసరావు మకాం
వికాసరావు టికెట్ తమకు ఇవ్వాలని హస్తినలో మకాం వేసినట్టుగా తెలుస్తుంది. గత మూడు రోజుల కిందట తమకే టికెట్ వస్తుంది అని నియోజకవర్గ బీజేపీ నాయకులు టపాసులు పేల్చాలని గ్రామాల వారిగా టపాసులు పంపిణీ చేశారు. కానీ టికెట్ సందిగ్ధంలో ఉండగా అట్టి బాణసంచా దసరా రోజున ఊరూరా పేల్చారు. దీంతో బీజేపీ కార్యకర్తలు నిరాశతో ఉన్నారు. టికెట్ వస్తే గాని కార్యకర్తలు ఎటు పనిచేయలో తేలిక అయోమయంలో ఉన్నారు.
తుల ఉమాకే టికెట్ ప్రచారం!
 తుల ఉమాకే బీజేపీ టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. గత కొంత కాలంగా వికాస రావు, తుల ఉమ మధ్యలో టికెట్ పోరు నడుస్తుంది.మరో వైపుగా ఈటల రాజేందర్ సైతం ఉమకు టికెట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారని వినికిడి. మరో వైపుగా తనయుని కోసం విద్య సాగర రావు కూడా ఢిల్లీ స్థాయి నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లుగా నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ అభ్యర్థి ఎవరో అని వేములవాడ నియోజకవర్గ ప్రజల్లో ఉత్కంఠగా మారింది.

Spread the love