ఇంతకూ పాట ఎవరిది?

ఇంతకూ పాట ఎవరిది?చెట్టూ పుట్ట గుట్ట
చదును చేసి దుక్కిదున్నిన
దేహాలది.
మట్టిని చాళ్ళు గొట్టి
చెమటను విత్తిన చేతులది
గుంజలు నరికి
భుజాలు కాయలు గట్టేలా మోసి
మంచె వేసి
వడిసెల తిప్పుతూ అడవి జంతువులను
గురిచూసి కొట్టిన బొబ్బలు తేలిన
హస్తాలది.
పొద్దున్నే గడ్డిపరకలపై
తేలిన పొగమంచును తొక్కుతూ
నడిచిన చెప్పులెరగని పాదాలది.
రాత్రి చంద్రుడిని
జాము చుక్కల్ని
కొండగాలి పరవశాన్ని
తెల్లవార్లూ కంఠాల నిండా కైగట్టిన గొంతులది
నిద్రలెరుగని చింతనిప్పురంగు కళ్ళది.
నారుపోసి
మడిచెక్కలు దమ్ముజేసి
నెలవంకలా నడుము వంచి
బురద మన్నులో సుతారంగా వేళ్ళు జొనిపి
పచ్చాపచ్చని రంగులద్దిన నల్లకలువలది.
చేతులను కొడవళ్ళలా వంచి
పంటలు కోసి
పనలు కట్టి
కుప్పనూర్చి పొలికట్టిన
ప్రకృతి చెలికానిది
నల్లకొడిసె వన్నెగానిది.
ఆరు రుతువుల సోపతిగానిది
వీళ్ళను
ఏ ఫిలింఫేరు గుర్తించదు
ఆస్కారూ పిలిచి
పురస్కారమివ్వదు.
జానపదులు పాడుకునే జీవితాలే
పే..ద్ద గ్రామీ అవార్డులు
– మణీందర్‌ గరికపాటి

Spread the love