సర్కారు ప్రకటనలకు..క్షేత్రస్థాయికీ జమీన్ ఆస్మాన్ ఫరక్
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు నిల్.. అరిగోస పడుతున్న అన్నదాతలు
నిండిన కల్లాలు… వెంటాడుతున్న అకాల వర్షాలు
ఆరుగాలం పంట ఆగమాగం.. గుండె ఆగి రాలిపోతున్న అన్నదాతలు
ధాన్యం సేకరణపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు పొంతనే ఉండట్లేదు. పంట అమ్ముకోవడం కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కల్లాలపైనే రైతులు ప్రాణాలు వదులుతున్నారు. ప్రభుత్వం చెప్పినంత సులభంగా మార్కెట్ యార్డుల్లో పరిస్థితులు లేవు. పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆ శాఖ కమిషనర్ ఏ రోజుకు ఆరోజు ‘ఇవాళ ఇన్ని లక్షల క్వింటాళ్లు కొన్నాం.. ఇన్ని కోట్ల సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేశాం.. బోనస్ కూడా ఇస్తున్నాం…’ అని చేస్తున్న ప్రకటనల్లో వాస్తవాలను వెతుక్కోవలసి వస్తున్నదని అన్నదాతలు చెప్తున్నారు. రాష్ర్టంలో 8,575 పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు సర్కారు చెబుతుంది, కానీ వాటిలో కనీస సౌకర్యాలే లేవు. నామమాత్రపు కొనుగోళ్లు కూడా జరగటం లేదు. సీపీఐ(ఎం)తో పాటు తెలంగాణ రైతు సంఘం నేతలు క్షేత్రస్థాయి పర్యటనల్లో అనేక విస్తుపోయే సమస్యల్ని రైతులు ఏకరువు పెడుతున్నారు. ఆరు రోజులుగా వీరంతా రాష్ర్టంలోని మార్కెట్ యార్డుల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పంట పండే వరకు రైతు ఓ రకమైన గోస పడితే, దాన్ని అమ్ముకోవడానికి అరిగోస తప్పట్లేదు.
మార్కెట్ యార్డుల్లో కుప్పగా ధాన్యం రాసులు పోస్తే, అకాల వర్షాలు, వడ్లగండ్ల వానలతో పంట నష్టం తీవ్రంగా ఉంటోంది. ప్రభుత్వ వాతావరణ శాఖే రాష్ర్టంలో భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తూనే ఉంది. మార్కెట్ యార్డులకు రాని మరికొంత ధాన్యం పొల్లాల్లో కల్లాలపైనే ఉంది. మార్కెట్ యార్డుల్లో టార్పాలిన్ల కొరత వెంటాడుతోంది. వర్షాలకు ధాన్యం తడిసి రంగుమారుతోంది. ఫలితంగా ధర రావట్లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ర్టంలో ఎండలు దంచికొడుతున్నాయి. రైతుల సౌకర్యార్థం కనీసం తాగునీరు, టెంట్లు, టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయలేదు. పలు జిల్లాల్లో మహిళా రైతులు మార్కెట్లకు ధాన్యం తీసుకుని వస్తున్నారు. వారి కష్టాలు వర్ణనాతీతం. నకిరేకల్ మార్కెట్ యార్డుకు నజీరుద్దీన్ అనే రైతు 20 రోజుల క్రితం ధాన్యాన్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు కాంటా వేయకపోవడంతో వర్షం పడి పంట దెబ్బతింటుందనే ఆందోళన, ఆవేదనకు గురై గుండె పోటుతో మరణించాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు గ్రామానికి చెందిన గౌరయ్య తెచ్చిన ధాన్యంలో కూడా తేమ శాతం ఎక్కువగా ఉందనీ, పంట అరబెట్టిన తర్వాతనే కాంటా వేస్తామని చెప్పడంతో ఆయన మనోవేదనకు గురయ్యాడు. కాంటా వేయటం ఆలస్యమైతే వానలు పడి తాను నష్టపోవాల్సి వస్తుందనే భయంతో గుండె ఆగి, అక్కడికక్కడే మరణించాడు. ఈ విధంగా మార్కెట్‌కు ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులు తీవ్రమైన భయాందోళలతో రాలిపోతున్నారు.
తరుగు పేరిట దోపిడీ
పంటను కాంటా వేసే క్రమంలో తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో అధికారులు అందుకు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. కాంటా వేసేందుకు నిరాకరిస్తున్నారు. ఈ సాకుతో 40 కిలోల బస్తాకు రెండు, మూడు కేజీల తరుగును తీస్తూ.. రైతులకు నష్టం చేకూరుస్తు న్నారు. రైతు పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాక, వెంటనే కాంటా వేయకపోవటం ఒక సమస్య అయితే.. కాంటా వేసిన తర్వాత కూడా రైతు ఊపిరి పీల్చుకోవడానికి వీలులేదు. మిల్లింగ్ అయ్యేంత వరకు అతడిదే బాధ్యత. దీంతో రైతుకు సమయం వృధా అవుతోంది. ధాన్యాన్ని ఎక్కువ రోజులు కాపాడాల్సి వస్తుంది. ఒక్కోసారి మార్కెట్‌లో తేమ శాతాన్ని నిర్ధారించిన తర్వాత కాంటా మిల్లు దగ్గర వేసుకోవాలని చెబుతున్నారు. అక్కడ కూడా మళ్లీ తేమను చెక్ చేస్తున్నారు, తరుగు తీస్తున్నారు. ఈ క్రమంలో పంట పండించిన కష్టం కంటే రైతుకు దాన్ని అమ్ముకోవడమే కష్టంగా పంట కొనరేం? మారుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలా ఉంటే మంత్రి, అధికారులు మాత్రం రైతులకు ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నామని చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేకుండా ఉంటున్నాయి. దళారుల రంగ ప్రవేశం ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడం, రైతులు బేజారెత్తిపోవడంతో దళారులు రంగ ప్రవేశం చేస్తున్నారు. క్వింటా సన్నాలకు ప్రభుత్వం ఎంఆర్‌పీ ధర రూ. 2,200 చెల్లిస్తోంది. దీనికి బోనస్ ఇస్తామని చెబుతున్నది. కానీ దళారులు మాత్రం క్వింటాకు రూ. 1,600 , 1,800 వరకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు క్వింటాకు ఐదారు వందలు నష్టపోవాల్సి వస్తోంది.
మరోవైపు దళారులకు వడ్లు అమ్మి మోసపోవద్దని సర్కారే చెప్తోంది. అదే సమయంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనేలేదు. దీంతో ధాన్యం కల్లాల్లోనే ఉంది. యాసంగి వరి పంట దాదాపు 1 కోటి 32 లక్షల మెట్రిక్ టన్నుల మేర వస్తుందని అధికారులు అంచనా వేయగా, అందులో 90 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటివరకు 14.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. ఇంకా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉంది. నిమామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, నల్లగొండ, సూర్యపేట జిల్లాల్లో వరి బాగా పండుతుంది. వరంగల్ జిల్లాలో వరికోతలు వేగం పుంజుకున్నాయి. మిగతా జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ పూర్తి కావచ్చింది. కానీ సేకరణ అంతగా లేకపోవటంతో రైతులు దిగాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి వర్ణ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ రైతు సంఘం ‘కోతలు పూర్తయి పంట చేతికొస్తున్నా… కోనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. తరుగు తీయడం ఆపేయాలి. తేమ పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు. ఎమ్మెల్యేలు చొరవ తీసుకున్న చోట కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయి. కానీ ఎవరూ పట్టించుకోని చోట రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. వారి కోసం మార్కెట్ యార్డుల్లో టెంట్లు వేయాలి, మంచి నీటి సౌకర్యం కల్పించాలి. మద్దతు ధరకు పంట మొత్తాన్ని కొనాలి.’ సర్కారుది అబద్ధ ప్రచారం పెద్దారపు రమేష్, ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ‘రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల విషయంలో అబద్దపు ప్రచారం చేస్తోంది. క్షేత్రస్థాయిలో చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. రైతు వారం పేరిట కార్యక్రమాలు నిర్వహించిన సర్కారు… ధాన్యం కొనుగోళ్ల వారం అని ప్రచారం చేయాలి. అప్పుడే ధాన్యం రైతులకు భరోసా ఉంటుంది. వీటితోపాటు దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మొక్కజొన్నలను వెంటనే కొనుగోలు చేయాలి.’



