విద్యార్థులపై ఏబీవీపీ గుండాల దాడి
నాటకాన్ని ప్రదర్శిస్తుండగా అటాక్
విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులకు తీవ్ర గాయాలు
దాడిని ఖండించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
విద్యా స్వేచ్ఛపై దాడులను ఖండిద్దాం
హెచ్ సీయూ క్యాంపస్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
దాడికి పాల్పడిన ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలి : ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ- మియాపూర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సోమవారం రాత్రి ఉద్రికత్త నెలకొంది. అకాడమిక్ మూల్యాంకనంలో భాగంగా నాటకాన్ని ప్రదర్శిస్తున్న విద్యార్థులపై ఏబీవీపీ నేతలు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. యూనివర్సిటీ థియేటర్ విభాగానికి చెందిన విద్యార్ధులు తమ అకాడమిక్ మూల్యాంకనంలో భాగంగా ‘హోలీ’ నాటకాన్ని ప్రదర్శించాలని నిర్ణయించారు. అయితే, నాటకాన్ని అడ్డుకుంటామని ఏబీవీపీ కార్యకర్తలు హెచ్చరించారు. విద్యార్థులు ఆదివారం నాటకాన్ని ప్రదర్శించిన అనంతరం కొందరు ఏబీవీపీ కార్యకర్తలు అల్లర్లు సృష్టించారు. విద్యార్థులను బెదిరించి, తదుపరి రోజు కూడా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయినా.. సోమవారం రాత్రి థియేటర్ విద్యార్థులు నాటకాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. ఈ నాటకాన్ని వీక్షించేందుకు విద్యార్థులు పెద్దఎత్తున హాజరయ్యారు. దీన్ని తట్టుకోలేని ఏబీవీపీ కార్యకర్తలు గుంపులు గుంపులుగా నాటకం ప్రదర్శిస్తున్న హాల్ పై దాడి చేశారు. బీర్ బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు విద్యార్థులతో పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఎన్నికైన విద్యార్థి యూనియన్ సభ్యులు కూడా ఉన్నారు. గాయపడిన విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.
దాడి పట్ల ఎన్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఖండన
హెచ్సీయూలో విద్యార్థులపై జరిగిన దాడిని ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. అకాడమిక్ మూల్యాంకనంలో భాగంగా విద్యార్థులు ‘హోలీ’ నాటకాన్ని ప్రదర్శిస్తే.. దాడులు చేయడం సరికాదని పేర్కొంది. ఈ దాడులకు విద్యార్థి సంఘం నేతలే నాయకత్వం వహించడం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్ధుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న వారే, గుండాగిరీకి పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొంది. విద్యార్ధులు, అధ్యాపకులను బెదిరించడం అసహ్యకరమైన చర్యగా పేర్కొంది. ఒక ఆకడమిక్ కార్యక్రమం ‘మతభావాలను దెబ్బతీస్తోంది’ అనే పేరుతో అడ్డుకోవడం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించింది. విద్యార్థులు తమ పాఠ్యాంశాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలకు కూడా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి రావడం అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. విద్యా స్వేచ్ఛను హరిస్తూ, క్యాంపస్ ను భయాందోళనల వాతావరణంలోకి నెట్టే ప్రయత్నం చేశారని పేర్కొంది. క్యాంపస్లో హింసకు పాల్పడిన ఏబీవీపీ కార్యకర్తలు, సంబంధిత యూనియన్ సభ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. గాయపడిన విద్యార్థులకు తక్షణ వైద్య సహాయం, న్యాయం అందించాలని కోరింది. క్యాంపస్ లో ద్యార్థుల భద్రతను యూనివర్సిటీ యాజమాన్యం పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తులందరూ ఐక్యంగా ముందుకు వచ్చి, క్యాంపస్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరింది. హింస, అసహనం, ద్వేష రాజకీయాలను ఎదిరించి, విద్యా స్వేచ్ఛను రక్షించేందుకు విద్యార్థి సమాజం పోరాడాలని పిలుపునిచ్చింది.



