మ‌ణిపూర్ అల్ల‌ర్ల‌తో అట్టుడుకుతుంటే ప్ర‌ధాని విదేశీ ప‌ర్య‌ట‌న‌కు ఎందుకు?

నవతెలంగాణ – న్యూఢిల్లీ : పార్ల‌మెంట్‌లో ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా మోడీ స‌ర్కార్‌పై విప‌క్షం విరుచుకుప‌డింది. మ‌ణిపూర్ అల్ల‌ర్ల‌తో అట్టుడుకుతుంటే ప్ర‌ధాని విదేశీ ప‌ర్య‌ట‌న‌కు ఎందుకు వెళ్లార‌ని టీఎంసీ నిల‌దీసింది. లోక్‌స‌భ‌లో అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా టీఎంసీ ఎంపీ సౌగ‌త రాయ్ మాట్లాడుతూ తాను బీబీసీ డాక్యుమెంట‌రీ, గుజ‌రాత్ అల్ల‌ర్ల గురించి మాట్లాడ‌బోన‌ని, బెంగాల్ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత త‌మ రాష్ట్రానికి కేంద్రం నిధుల‌ను నిలిపివేసింద‌ని, మోడీ ప్ర‌భుత్వం మాన‌వీయ కోణంలో వ్య‌వహ‌రించ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. బెంగాల్‌కు కేంద్రం ప‌లుమార్లు ప్ర‌తినిధి బృందాల‌ను పంపింద‌ని, కానీ మ‌ణిపూర్‌కు ఒక్క ప్ర‌తినిధి బృందాన్నీ పంప‌లేద‌ని ఆరోపించారు. భార‌త్‌ను ప్రేమించేవారెవ‌రైనా మోదీని ద్వేషిస్తార‌న్నారు. అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మ‌ణిపూర్ ఘ‌ట‌న‌ల‌ను మాట‌మాత్రంగానూ ప్ర‌స్తావించ‌లేద‌ని అన్నారు. డీఎంకే ఎంపీ టీఆర్ బాలు మాట్లాడుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌న స్నేహితుడ‌ని అభివ‌ర్ణిస్తూ మ‌ణిపూర్ భ‌గ్గుమంటుంటే ప్ర‌ధాని మోదీ ఎక్క‌డున్నార‌ని నిల‌దీశారు. పార్ల‌మెంట్‌కు రావాల‌ని ప్ర‌జ‌లు మోదీని ఎన్నుకుంటే స‌భ‌కు వ‌చ్చేందుకు ఆయ‌న‌కు అభ్యంత‌రం ఏంట‌ని ప్ర‌శ్నించారు. మ‌ణిపూర్‌లో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్ధితి దిగ‌జారితే ఐరోపా, బ్రిటిష్ పార్ల‌మెంట్‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేసినా మోదీ స‌ర్కార్ మౌనం దాల్చింద‌ని అన్నారు. మ‌ణిపూర్ అల్ల‌ర్ల‌లో ఏకంగా 163 మంది మ‌ర‌ణిస్తే ప్ర‌ధాని నోరుమెద‌ప‌లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దేశంలో నెల‌కొన్న ప‌రిస్ధితి త‌ర‌హాలోనే మ‌ణిపూర్‌లోనూ మెజారిటీ వ‌ర్సెస్ మైనారిటీ అన్న‌ట్టుగా ప‌రిస్ధితులు నెల‌కొన్నాయ‌ని డీఎంకే ఎంపీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Spread the love