Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాల తహసీల్దార్‌ను ఎందుకు సస్పెండ్ చేయకూడదు..!

పరకాల తహసీల్దార్‌ను ఎందుకు సస్పెండ్ చేయకూడదు..!

- Advertisement -

అధికార బలంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తహసీల్దార్‌..!
నిబంధనలకు విరుద్ధంగా భూ మ్యూటేషన్లు చేస్తున్న వైనం..
మౌనం వహిస్తున్న ఉన్నతాధికారులు
సమగ్ర విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం
నవతెలంగాణ – పరకాల

పరకాల రెవెన్యూ కార్యాలయంలో భూ మ్యూటేషన్ల వ్యవహారం రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. నిబంధనలను పక్కనపెట్టి, కోర్టు వివాదాలు ఉన్న భూములతో పాటు అసలు పట్టాదారుల హక్కులను విస్మరిస్తూ భూ మ్యూటేషన్లు జరిగాయన్న ఆరోపణలు వరుసగా వెలుగుచూస్తుండటంతో తహసీల్దార్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌పై సమగ్ర శాఖాపరమైన విచారణ జరిపి, విచారణ పూర్తయ్యే వరకు విధుల నుంచి తప్పిస్తూ సస్పెండ్ చేయాలనే డిమాండ్ స్థానికంగా వినిపిస్తోంది.

పరకాల తహసీల్దార్ కార్యాలయాన్ని తన వ్యక్తిగత కార్యాలయంలా భావిస్తూ, ఏ నిర్ణయం తీసుకున్నా తనకు అధికార బలం అండగా ఉందనే ధీమాతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ చట్టాలు, ప్రభుత్వ నిబంధనలను పక్కనబెట్టి కొందరికి అనుకూలంగా భూ మ్యూటేషన్లు చేస్తున్నారనే విమర్శలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తాజాగా వెలుగుచూసిన అక్రమ మ్యూటేషన్ వ్యవహారం ఇప్పటికే వివాదాస్పదంగా మారిన పలు భూ లావాదేవీలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే మాదారం రెవెన్యూ పరిధిలో అసలు పట్టాదారులను పక్కనబెట్టి ఇతరుల పేర్లపై మ్యూటేషన్ చేసిన ఘటన బాధితులను న్యాయం కోసం రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది.

ఆ ఘటనలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అనంతరం సంబంధిత రిజిస్ట్రేషన్‌ను ‘ఓల్డ్’లో పెట్టిన వ్యవహారం ఇంకా ప్రజల మదిలో ఉండగానే మరో భూమికి సంబంధించిన మ్యూటేషన్ వివాదం వెలుగుచూడడం చర్చనీయాంశమైంది. వరుసగా ఇలాంటి ఆరోపణలు వస్తున్నా బాధ్యులపై ఎలాంటి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కోర్టు వివాదాల్లో ఉన్న భూములు, స్పష్టమైన యాజమాన్య వివాదాలు ఉన్న సర్వే నంబర్ల విషయంలోనూ మ్యూటేషన్లు జరిగినట్లు ఆరోపణలు రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఇలాంటి భూములపై పూర్తి స్థాయి పరిశీలన, రికార్డుల ధృవీకరణ, సంబంధిత పక్షాలకు నోటీసులు, అభ్యంతరాల పరిశీలన అనంతరమే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, ఆ ప్రక్రియను పాటించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో తహసీల్దార్‌కు రాజకీయ, అధికార అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ప్రచారం కార్యాలయ వర్గాల్లోనే జరుగుతోంది. అందుకే తనపై ఎలాంటి చర్యలు తీసుకోలేరనే ధీమాతో వ్యవహరిస్తున్నారని, ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. “ఆర్డీవో కూడా ఏమీ చేయలేరు” అన్న భావనతోనే నిర్ణయాలు తీసుకుంటున్నారనే చర్చలు రెవెన్యూ శాఖలోనే సాగుతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఇప్పటికే వెలుగుచూసిన అక్రమ మ్యూటేషన్లపై జిల్లా స్థాయి ప్రత్యేక కమిటీతో సమగ్ర విచారణ జరిపితే మరిన్ని అవకతవకలు బయటపడే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా జరిగిన అన్ని మ్యూటేషన్లు, సంబంధిత ఫైళ్లు, ఆన్‌లైన్ నమోదులు, ఫీల్డ్ రిపోర్టులు, అనుమతులు, రికార్డు మార్పులను సమగ్రంగా పరిశీలిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు.అయితే ఈ ఆరోపణలపై సంబంధిత తహసీల్దార్ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఉన్నత రెవెన్యూ అధికారులు ఈ అంశంపై నిష్పక్షపాత విచారణకు ఆదేశించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -