మధ్యంతర ఉత్తర్వులు ఉండగా పిటిషన్‌ ఎందుకు?

నవతెలంగాణ -హైదరాబాద్‌
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసులో అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు చేపట్టవద్దంటూ ఢిల్లీ పోలీసులకు ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా ఇదే వ్యవహారంపై పిటిషన్‌ ఎలా దాఖలు చేస్తారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ను రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. పిటిషన్‌పై విచారణను ముగించేస్తామని గురువారం జస్టిస్‌ భాస్కర్‌రెడ్డి వెల్లడించారు. దీనిపై పిటిషనర్‌ తరుపు అడ్వొకేట్‌ కల్పించుకుని వేసవి సెలవుల తర్వాత కేసు విచారణను చేపట్టాలని కోరడంతో అందుకు ఆయన అనుమతిచ్చారు. ఢిల్లీ పోలీసులు తమ పార్టీ సోషల్‌ మీడియా కార్యదర్శులపై అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని గౌడ్‌ పిటిషన్‌ వేశారు. ఇప్పటికే ఇదే తరహా కేసులో టీపీసీసీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి మన్నె సతీష్‌ ఇతరులు కఠిన చర్యలు తీసుకోకుండా ఢిల్లీ పోలీసులను ఆదేశించేలా ఉత్తర్వులు పొందారు. పిటిషనర్‌ తరుపు న్యాయవాది విజ్ఞప్తితో విచారణ వాయిదా పడింది.
ఢిల్లీ పోలీసులకు నిరాశ
అమిత్‌షా ఫేక్‌ వీడియో కేసులో మన్నే సతీష్‌, ఇతరులు పలు వాస్తవాలు దాచి హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు పొందారనీ, వాటిని సవరించాలని ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌లో ఉత్తర్వుల జారీకి గురువారం హైకోర్టు నిరాకరించింది. ఇది తెలంగాణకే పరిమితమైన కేసు కాదనీ, పలు రాష్ట్రాలతో ముడిపడిన కేసని ఢిల్లీ పోలీసుల తరుపు లాయర్‌ వాదించారు. తెలంగాణలోని కేసును కూడా ఢిల్లీకి బదిలీ చేయాలని కోరారు. ఈలోగా గత మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తే కేసు దర్యాప్తునకు మార్గం సులభమవుతుందని తెలిపారు. యూపీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోని వాళ్లకు నోటీసులు జారీ చేశామనీ, తెలంగాణకు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేస్తే పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. వాదనల తర్వాత గత మధ్యంతర ఉత్తర్వుల సవరణకు న్యాయమూర్తి జస్టిస్‌ భాస్కర్‌రెడ్డి నిరాకరించారు. విచారణను జూన్‌ రెండో వారానికి వాయిదా వేశారు.
లోకాయుక్తకు అధికారం లేదు : నిర్మాణం కూల్చివేత ఉత్తర్వుల్ని రద్దు చేసిన హైకోర్టు
ప్రయివేట్‌ నిర్మాణాలను తొలగించాలంటూ లోకాయుక్త జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. సివిల్‌ వివాదాలపై విచారణ చేసి ఉత్తర్వులు జారీ చేసే అధికారం లోకాయుక్తలకు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాథే, జస్టిస్‌ అనిల్‌ కుమార్లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఆదేశాలను జారీ చేసింది. హైదరాబాద్‌లోని చాంద్రాయణ గుట్టలో చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని 2015లో లోకాయుక్త జారీ చేసిన ఉత్తర్వులను సీహెచ్‌ హనుమంతరావు హైకోర్టులో సవాలు చేశారు. పిటిషనర్‌కు చెందిన 194 చదరపు గజాల స్థలంలోని 33.33 గజాలను రోడ్డు విస్తరణ పేరుతో జీహెచ్‌ఎంసీ తీసుకుని పరిహారం కూడా చెల్లించలేదని న్యాయవాది చెప్పారు. మిగిలిన స్థలంలో పిటిషనర్‌ ఇంటిని నిర్మిస్తోంటే అంజమ్మ అనే మహిళ ఫిర్యాదు చేసిందనీ, ఈ క్రమంలో తన పరిధిలోకి రాని అంశంపై లోకాయుక్త విచారించి నిర్మాణాన్ని తొలగించాలంటూ జీహెచ్‌ఎంసీకి ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. వాదనల తర్వాత హైకోర్టు, సివిల్‌ వివాదాలపై లోకాయక్తకు విచారణ చేసే అధికారం లేదని తేల్చి చెప్పింది. లోకాయుక్త జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది.

Spread the love