నేడు హైకోర్టు ముందుకు కవిత బెయిల్‌ పిటిషన్‌…

– 1149 పేజీలతో బెయిల్‌ అప్లికేషన్‌ దాఖలు
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్టై తీహార్‌ జైళ్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ స్కాంలో దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ… బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు గురువారం కవిత తరపు అడ్వకేట్‌ మోహిత్‌ రావు మొత్తం 1149 పేజీలతో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కాగా, ఢిల్లీ లిక్కర్‌ స్కాం మనీలాండరింగ్‌ కేసులో కవితను ఈడీ మార్చి 15న, సీబీఐ ఏప్రిల్‌ 11న అరెస్ట్‌ చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాలని కవిత పిటిషన్‌ దాఖలు చేయగా… ఇందుకు రౌస్‌ అవెన్యూ కోర్టు(ట్రయల్‌ కోర్టు) నిరాకరించింది. ఆమె బెయిల్‌ పిటిషన్లను తిరస్కరిస్తూ… ఈడీ కేసులో 45 పేజీల ఉత్తర్వులు వెలువరించింది. అంతకుముందు మైనర్‌ కొడుకు పరీక్షల నేపథ్యంలో కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ కోరారు. ఈ అప్లికేషన్‌ను సైతం స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా తిరస్కరించారు.

Spread the love