ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు ఎందుకు చేయలేదు

– ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎస్టీల కోసం ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ కమిషనర్‌, షెడ్యూల్డ్‌ తెగల జాతీయ కమిషన్‌, కేంద్ర హౌం శాఖ కార్యదర్శి కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎస్టీల కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ లంబాడీ హక్కుల పోరాట సమితి నగార భేరీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన పిల్‌పై విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. ఎస్సీ, ఎస్టీలకు ఒకే కమిషన్‌ వేయడాన్ని పిటిషనర్‌ తప్పపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు
రాష్ట్ర స్థాయి పోలీస్‌ భద్రతా కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ), పోలీసు ఫిర్యాదు అథారిటీ(పీసీఏ)లకు రెండు నెలల్లోగా ఆఫీసులు, స్టాఫ్‌ వంటి మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఎస్‌ఎస్‌సీ, పీసీఏలను ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని పేర్కొంటూ ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి పద్మనాభరెడ్డి లాయర్‌ వేణుమాధవ్‌ వేసిన వ్యాజ్యాలను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారించింది. హైదరాబాద్‌, మరో జిల్లాలో రీజినల్‌ అథార్టీలకు చైర్మెన్‌, సభ్యులను నియమించామని ప్రభుత్వ ప్లీడర్‌ చెప్పారు. జిల్లాల్లో ఏర్పాటు చేయలేదని పిటిషనర్‌ వాదన. విచారణను ఆగస్టుకు వాయిదా వేశారు.
కోర్టుకు అజారుద్దీన్‌
కోర్టు ధిక్కార కేసులో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ చైర్మెన్‌, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ శుక్రవారం హైకోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. అసోసియేషన్‌ నిర్వహించిన లీగ్‌ మ్యాచ్‌ల్లో నల్లగొండ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ పాల్గొనేలా చేయాలని 2021లో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదని ఆ అసోసియేషన్‌ కోర్టు ధిక్కార పిటిషన్‌ వేసింది. దీనిని జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ విచారించారు. తదుపరి విచారణకు కూడా హాజరుకావాలని అజారుద్దీన్‌ను ఆదేశించారు.
సింగరేణి ఎన్నికలపై కేసు
సింగరేణి యూనియన్‌ ఎన్నికలను అక్టోబర్‌ వరకు వాయిదా వేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజరుసేన్‌రెడ్డి శుక్రవారం ఆదేశించారు. సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం వేసిన రిట్లను విచారించి వారి అభ్యర్థనలకు అనుగుణంగా ఎన్నికలను అక్టోబర్‌ వరకు ఆపాలని ఆదేశించారు. అక్టోబర్‌ 1 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని, మూడు నెలల్లోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
వీసీ కొనసాగింపుపై రిట్‌
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వైస్స్‌ చాన్సలర్‌ పదవీ 2019 జులైలో ముగిసినా ఆ పదవిలో ఆయనను కొనసాగించడానికి కారణాలు చెప్పాలని హైకోర్టు కోరింది. అలా కొనసాగించడానికి ఉన్న అర్హతలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ఛాన్సలర్‌, రిజిస్ట్రార్లతోపాటు వీసీ డాక్టర్‌ బి.కరుణాకర్‌రెడ్డిలను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. హెల్త్‌కేర్‌ రిఫామ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది.

Spread the love