ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత క్రికెటర్ భార్య

నవతెలంగాణ- చైనా: హాంగ్ ఝౌ నగరం ఆతిథ్యమిస్తున్న ఆసియా క్రీడల్లో భారత స్క్వాష్ టీమ్ మిక్స్ డ్ డబుల్స్ లో పసిడి పతకం గెలిచిన సంగతి తెలిసిందే. దీపికా పల్లికల్, హరీందర్ పాల్ సింగ్ లతో కూడిన భారత స్క్వాష్ జట్టు ఫైనల్లో అద్భుత విజయం సాధించింది. దీపికా పల్లికల్ ఎవరో కాదు… భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ భార్య. వీరిది ప్రేమ వివాహం. 2021లో దీపికా మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది. వీరికి కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్ అని నామకరణం చేశారు. టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడిన దినేశ్ కార్తీక్ కొంతకాలంగా క్రికెట్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. కాగా, దీపికా పల్లికల్ తల్లయిన తర్వాత కూడా దినేశ్ కార్తీక్ ప్రోత్సాహంతో స్క్వాష్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ లో వరల్డ్ కప్ జరుగుతుండగా, దినేశ్ కార్తీక్ కూడా వ్యాఖ్యాతల బృందంలో ఉన్నాడు. హాంగ్ ఝౌ ఆసియా క్రీడల్లో తన భార్య దీపికా స్వర్ణం గెలిచిన వెంటనే, దినేశ్ కార్తీక్ ఆ ఆనందకర క్షణాలను అందరితో పంచుకున్నాడు. అటు, టీమిండియా యువ జట్టు ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్ లో పాల్గొంటోంది. ఆ జట్టులో సభ్యులైన వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠీ తదితరులు నేటి స్క్వాష్ ఈవెంట్ ఫైనల్ మ్యాచ్ లో దీపికా పల్లికల్ కు సపోర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో, టీమిండియా క్రికెటర్లకు కూడా దినేశ్ కార్తీక్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Spread the love