ద్వితీయ శ్రేణి జట్టుతో

– ఆసియా క్రీడలకు భారత జట్లు
– ఆమోదం తెలిపిన బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌
నవతెలంగాణ-ముంబయి
ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో భారత క్రికెట్‌ జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ మేరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అపెక్స్‌ కౌన్సిల్‌ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 24-అక్టోబర్‌ 2 వరకు చైనాలోని హౌంగ్జౌ వేదికగా ఆసియా క్రీడలు జరుగనున్నాయి. ఇదే సమయంలో అక్టోబర్‌ 5-నవంబర్‌ 19 వరకు భారత్‌ వేదికగా ఐసీసీ ప్రపంచ కప్‌ షెడ్యూల్‌ చేశారు. దీంతో ఆసియా క్రీడలకు భారత మెన్స్‌ జట్టును పంపటంపై బోర్డు వర్గాల్లో అనిశ్చితి నెలకొంది. ముంబయిలోని ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సమావేశమైన బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ పలు అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకుంది.
బరిలో రెండు జట్లు : ఆసియా క్రీడల్లో మెన్స్‌ క్రికెట్‌ ఈవెంట్‌ (టీ20) సెప్టెంబర్‌ 28న ఆరంభం కానుండగా, మహిళల ఈవెంట్‌ సెప్టెంబర్‌ 19న షురూ కానుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్‌ జట్టు ఆసియా బరిలో నిలువనుండగా.. మెన్స్‌ విభాగంలో రోహిత్‌సేన అందుబాటులో ఉండటం లేదు. దీంతో ద్వితీయ శ్రేణి జట్టును చైనాకు పంపన్నారు. శిఖర్‌ ధావన్‌ సారథ్యంలోని భారత జట్టు ఆసియా క్రీడల్లో పోటీపడే అవకాశం ఉంది. చివరగా 2014 ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను చేర్చినా.. అప్పుడు బీసీసీఐ జట్లను పంపించలేదు. హౌంగ్జౌ ఆసియా క్రీడల క్రికెట్‌ ఈవెంట్‌లో భారత మహిళల, పురుషుల జట్లు పసిడి ఫేవరేట్లుగా బరిలోకి దిగనున్నాయి. ‘అత్యంతగా బిజీగా ఉన్న అంతర్జాతీయ షెడ్యూల్‌ దృష్ట్యా ఆసియా క్రీడలకు జట్లను పంపించటం సవాల్‌తో కూడుకున్నది. అయినా, జాతీయ ప్రయోజనాలు సైతం ప్రధానం. ప్రభావంతమైన ప్రణాళిక, కమ్యూనికేషన్‌, సమన్వయంతో బీసీసీ ఈ సవాళ్లను అధిగమిస్తుంది. భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మెన్స్‌, ఉమెన్స్‌ విభాగాల్లో జట్లను ఆసియా క్రీడలకు పంపుతుంది’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
దేశవాళీలో ఇంపాక్ట్‌ : దేశవాళీ టీ20 టోర్నీ (సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ)లో ఇక నుంచి ఐపీఎల్‌ తరహా ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను అమలు చేయనున్నారు. గత ఏడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను ప్రయోగాత్మకంగా అమలు పరిచారు. టాస్‌కు ముందే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను ఎంచుకోవటం, 14వ ఓవర్‌కు ముందే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సేవలను వినియోగించుకోవాలనే నిబంధనలను ఈ ఏడాది నుంచి తొలగించనున్నారు.
ఐపీఎల్‌ 16 తరహాలోనే మ్యాచ్‌లో ఏ సమయంలోనైనా ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను వాడుకోవటంతో పాటు టాస్‌ సమయంలో నలుగురు సబ్‌స్టిట్యూట్‌ ఆటగాళ్లలో ఒకరిని ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ దేశవాళీ సర్క్యూట్‌లోనూ పూర్తి స్థాయిలో అమలు పరిస్తే.. నాణ్యమైన ఆల్‌రౌండర్లు కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు!.
ఆఫీస్‌ బేరర్లే తేల్చాలి : విదేశీ టీ20 లీగ్‌ల్లో భారత రిటైర్డ్‌ క్రికెటర్ల ప్రాతినిథ్యంపై అపెక్స్‌ కౌన్సిల్‌ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. భారత క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు సైతం వీడ్కోలు పలికితేనే విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతులు ఇస్తుంది. తెలుగు తేజం అంబటి రాయుడు ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించి నేరుగా యుఎస్‌ఏ టీ20 లీగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐపీఎల్‌ ప్రాంఛైజీలే ఇప్పుడు గ్లోబల్‌ టీ20 లీగ్‌ల్లో జట్లను కొనుగోలు చేయటంతో భారత క్రికెట్‌ ప్రణాళికల్లో లేని ఆటగాళ్లపై ఒత్తిడి కనిపిస్తుంది. దీంతో ఇక్కడ వీడ్కోలు పలికి గ్లోబల్‌ టీ20ల్లో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిపై అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చ జరిగినా.. ఈ అంశంలో విధి విధానాల రూపకల్పన బాధ్యత బోర్డు ఆఫీస్‌ బేరర్లకు వదిలేసింది.

Spread the love