మహిళలకు అన్ని రంగాల్లో సమానత్వం కల్పించాలి

మహిళలకు అన్ని రంగాల్లో సమానత్వం కల్పించాలి– మద్యం, డ్రగ్స్‌ను నియంత్రించాలి
– విద్య,వైద్యం ఉచితంగా అందించాలి: ఐద్వా కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి
నవతెలంగాణ-సూర్యాపేట
మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమానత్వం కల్పించాలని ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో శుక్రవారం ఐద్వా జిల్లాస్థాయి రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ తరగతులకు హాజరైన ఆమె ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మద్యం, డ్రగ్స్‌ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. గడిచిన పదేండ్ల కాలంలో దేశంలో మహిళలపై హత్యలు, లైంగికదాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక చట్టాలు వస్తున్నప్పటికీ సక్రమమైన పద్ధతిలో అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళా లోకం తమ హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు నిర్వహిస్తోందన్నారు. న్యూయార్క్‌ నగరంలో కుట్టు మిషన్‌ పని చేసే శ్రామిక మహిళలు ఎనిమిది గంటల పని దినం, పని ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, శ్రమకు తగ్గ వేతనం, ఓటు హక్కు కావాలని పోరాడి హక్కులుసాధించుకున్నారని వివరించారు. వారి త్యాగాలు వెలకట్ట లేనివన్నారు.
విద్య, వైద్యం, క్రీడా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు పోతున్న మహిళల పట్ల వివక్ష, అసమానత, లైంగిక వేధింపులు కూడా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లింగ సమానత్వ సూచిలో 146 దేశాల్లోకెల్లా మన దేశం 127వ స్థానంలో ఉందని చెప్పారు. సాధించుకున్న హక్కులు నిర్వీర్యం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల హక్కులు పరిరక్షించబడాలంటే నిర్ణయ అధికారంలో భాగస్వామ్యం కావాలన్నారు. మహిళలకు పని, భద్రత కల్పించాలని కోరారు. వాటిని కల్పించే వరకు మహిళలందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ప్రభుత్వాని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ, నాయకులు మద్దెల జ్యోతి, జూలకంటి విజయలక్ష్మి, అండం నారాయణమ్మ, సురభి లక్ష్మి, గోలి భాగ్యమ్మ, నెమ్మాది లక్ష్మి, జృజన, రజిత, దేవిరెడ్డి జ్యోతి తదితరులు ఉన్నారు.

Spread the love