మాట‌ల్లోనే మహిళా శక్తి

మాట‌ల్లోనే మహిళా శక్తి‘స్త్రీలు ఎక్కడ పూజింపడతారో అక్కడ దేవతలు నడయాడుతారు అంటారు. స్త్రీ ఔన్నత్యానికి సమాజంలో వారికి ఉన్న ప్రాధాన్యతకు మన భారతీయ సంస్కృతి ఇచ్చిన గౌరవం అది. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏమిటి? మహిళలు అంటే అడుగడుగునా అవమానాలు, లైంగికదాడులు, హత్యలు. అందుకే ప్రతి స్త్రీ మూర్తికి ప్రణమిల్లి చెబుతున్నాం. మీ రక్షణ కోసం, సమాజంలో మీకు సమున్నత గౌరవం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది’ ఒకానొక సందర్భంలో బీజేపీ నాయకులు అన్న మాటలు ఇవి. కానీ ఆచరణలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. బీజేపీ కాలంలోనే మహిళలపై దాడులు మరింత పెరిగిపోయాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ‘బేటీ బచావో, బేటీ పడావో’, ‘మహిళా శక్తి’ అంటూనే మనువాదాన్ని ప్రవేశపెట్టి మహిళలకు తిరిగి ఇంటికి పరిమితం చేయాలని చూస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఎవరి నోట విన్నా ఇప్పుడు ఇవే వినిపిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మీకు ఎలాంటి పాలన కావాలని అడిగితే మహిళల స్పందన ఎలా ఉందో చూద్దాం…
మహిళా అణచివేత చరిత్ర కలిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి బీజేపీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. వారి సనాతన విశ్వాసాలు, పితృస్వామ్య మనస్తత్వం స్త్రీలను బలహీనులుగా మాత్రమే చూస్తాయి. స్త్రీలు ఎప్పుడూ మగవారికి లోబడి ఉండాలని చెప్తారు. సొంత నిర్ణయాలు తీసుకోలేని వారిగా, గొంతు లేని వారిగా చిత్రీకరిస్తున్నారు. పదేండ్ల బీజేపీ పాలనలో మహిళలపై పెరుగుతున్న నేరాలే దీనికి నిదర్శనం. 2014కు ముందు మహిళల పట్ల ఇంతటి దిగజారుడు తనాన్ని మనం చూడలేదు. ఉన్నావ్‌, హత్రాస్‌ కేసులలో బాధితులు, వారి కుటుంబాలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుల గురించి విన్నాం. కాపాడాల్సిన వారే నేరస్థులతో చేతులు కలపడం కండ్లారా చూశాం. అంతేనా మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ నేటీ బీజేపీ పాలనలో హరించివేయబడుతున్నాయి. మహిళలను రక్షిస్తామని చెబుతున్న కేంద్రం ఆచరణలో మాత్రం మనువాద విధానాలతో మరింత దుస్థితిలోకి నెట్టివేస్తోంది.
అభద్రతా భావంలో బతుకుతున్నారు
హింసకు గురైన బాధితులను న్యాయానికి దూరం చేసి దేశంలో మహిళలకు రక్షణ లేకుండా చేశారు. అభద్రతా భావంలో బతికేలా చేస్తున్నారు. దేశానికి పతకాలు తెచ్చిపెట్టిన రెజ్లర్‌లు బ్రిడ్జ్‌ భూషణ్‌ తమపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని నడిరోడ్డుపై నినదించినా వారి ఆర్తనాధాలు వినిపించుకోలేదు. మణిపూర్‌లో మహిళలపై సామూహిక లైంగిక దాడి చేసి, వివస్త్రలను చేసి ఊరేగించినా నోరు మెదమని పాలకుల చేతుల్లో మన దేశం ఉంది. అందుకే మహిళలు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి మరింత దిగజారి పోతుందనీ, తమ ఉనికే ప్రశ్నార్థమవుతుందని వారు ఆందోళన చెందడం సహజం.
పూర్తి భిన్నంగా ఉన్నాయి
21వ శతాబ్దంలో మహిళలు సమానత్వం, స్వేచ్ఛను కోరుకుంటున్నారు. వారు తమ కార్యాలయంలో, కుటుంబంలో, సామాజిక సమూహాలలో, సమాజంలో సమానత్వాన్ని కోరుకుంటున్నారు. సొంత ఎంపికలు చేసుకునే స్వేచ్ఛను కోరుకుంటున్నారు. కానీ నేడు దేశాన్ని పాలిస్తున్న పాలకుల విధానాలు మహిళల ఆలోచనలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. భారతదేశంలోని ప్రతి స్త్రీకి సమానత్వాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి వుంది. అలాంటి ప్రభుత్వం కావాలని మహిళలు కోరుకుంటున్నారు.
బీజేపీతో దేశానికి నష్టమే
కేంద్రంలో పదేండ్ల నుండి బీజేపీ పాలిస్తుంది. ఇప్పటి వరకు దేశానికి చేసింది ఏమీ లేదు. పైగా ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మహిళల గురించి తక్కువగా మాట్లాడుతున్నారు. మణిపూర్‌లో మహిళలను లైంగిక దాడి చేసి వివస్త్రలుగా చేసినా నోరు విప్పలేదు. ఇలాంటి వారి వల్ల దేశానికి నష్టం తప్ప ఎలాంటి లాభం లేదు. పైగా జీఎస్టీ తెచ్చి పన్నుల భారం మరింత పెంచాడు. నేను ఈ మధ్య నాలుగు చీరలు కొంటే పదిహేను వందలు జీఎస్టీనే కట్టాల్సి వచ్చింది. పెట్రోల్‌, గ్యాస్‌ రేట్లు పెంచారు. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ ఏదో రేట్లు తగ్గిస్తున్నట్టు గ్యాస్‌పై కొంత తగ్గించారు. ఇవన్నీ సామాన్యులకు భారాలుగా మారాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ వస్తే దేశానికి కాస్త అయిన మంచిదని అనిపిస్తుంది.
– ఊర్మిళ, ఉప్పల్‌
బీజేపీని ఓడించాల్సిందే
దేశంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ప్రజాస్వామ్యం అంటే విలువ లేకుండా పోతోంది. బీజేపీ వాళ్ళు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. అమ్మాయిలు చదువులు మానేసి మళ్ళీ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేలా అనిపిస్తుంది. రెజ్లర్‌లు తమపై దాడులు జరిగాయని అన్ని రోజులు ధర్నాలు చేసినా అస్సలు పట్టించుకోలేదు. మణిపూర్‌లో కూడా అంతే. మనువాదాన్ని ప్రవేశపెట్టి మహిళల జీవితాలను పాతాళంలోకి నెట్టేసేలా ఉన్నారు. మహిళలు పిల్లల్ని కని పెంచితే సరిపోతుందని మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రధాని వల్ల దేశానికి నష్టం తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈసారి బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్‌ వస్తే కొద్దిగైనా బాగుందనిపిస్తుంది.
– కె.సుమతి, ఫ్యాషన్‌ డిజైనర్‌
మతం పేరుతో విడదీస్తున్నారు
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం పరిస్థితి బాగా మారిపోయింది. నోట్లు రద్దు చేసినప్పుడు ఎంతో మంది చాలా ఇబ్బందులు పడ్డారు. జీఎస్టీ తెచ్చి మనపై విపరీతమైన భారాలు మోపారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు. అన్నిటికంటే ముఖ్యంగా కలిసి మెలిసి ఉండే ప్రజలను మతం పేరుతో విడదీయాలని చూస్తున్నారు. ఇక్కడే పుట్టి, పెరిగిన ముస్లింలను ఇక్కడి వారు కాదన్నట్టు ప్రచారం చేస్తున్నారు. పాఠశాల విద్య నుండి రామాయణ, మహాభారతం వంటికి ప్రవేశపెట్టి మతోన్మాదాన్ని పెంచి పోషించాలని చూస్తున్నారు. పైగా రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు. ఇలాంటి వారు దేశాన్ని పాలిస్తే మరింత నష్టం తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి బీజేపీ ఓడిపోవాల్సిందే.
– అమీన, ప్రైవేట్‌ ఉద్యోగి

Spread the love